జనతాదళ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన భారత ప్రధాని వీపీ సింగ్ ఉద్యోగాల్లో 27% ఓబిసి రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు ఆగస్టు 7, 1990న ప్రకటించారు. మండల్ కమిషన్ చేసిన 40 సిఫారసులలో జాతీయస్థాయి ఉద్యోగాల్లో ఓబిసిలకు రిజర్వేషన్ అమలు ఒకటి మాత్రమే.
ఒబిసి రిజర్వేషన్ల ప్రకటన కాంగ్రెస్, బిజెపిలకు మింగుడు పడలేదు. వాస్తవానికి, భారత జాతి సంపూర్ణ ఫలాలను పొందిన ఉన్నతవర్గం ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది. పౌర సమాజం, బిజెపి-కాంగ్రెస్ కలిసి విద్యార్థులను రోడ్లమీదకు తెచ్చి, ఆత్మబలిదానాలకు పురికొల్పాయి.
స్వాతంత్య్రానంతరం రాజకీయ పార్టీలు, మేధావి వర్గం, ఉన్నతవర్గ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకించారు. ఉన్నత సామాజికవర్గాల నాయకత్వం, పాత్రికేయులు మండల్ కమిషన్ సూచనలు, సలహాలను వ్యతిరకిస్తూ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.
ఉత్పాదక కులాలను అసమర్దులుగా, ప్రతిభలేనివారిగా చిత్రీకరించారు. అందువల్ల వెనుకబడిన తరగతుల పిల్లలు (ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీలు) అభివృద్ధి సంస్థలలో ఉండటం శ్రేయష్కారం కాదని వాదించారు. ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తూ ఉన్నత వర్గాలు దేశాన్ని మరింత వెనక్కి నెట్టాయి.
రాజకీయ పార్టీలైన, బీజేపీలు ఓబీసీలు రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. పార్లమెంటులో వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా చర్చించాయి. నెహ్రూ, ఇందీరాగాంధీ, రాజీవ్ గాంధీలు మొదటి నుంచి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వాదించారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్న రాజ్యాంగ ప్రమాణాలకు వ్యతిరేకంగా బిజెపి నిలబడింది. ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలని ప్రచారం చేసింది. ఓబిసి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అద్వానీ అయోధ్య రామ్ జన్మ భూమి రథ యాత్రను బీజేపీ చేపట్టింది.
ఓబీసీ రిజర్వేషన్లను న్యాయమైనవిగా గుర్తిస్తూనే కమ్యూనిస్టులు క్రీమిలేయర్ ను చేర్చాలని తీర్మానం చేశారు. కాన్షిరాం నేతృత్వంలోని బీఎస్పీ మండల్ కమిషన్ రిపోర్టు అమలు కోసం నిరసన చేపట్టింది. ‘అరక్షన్ లాగు కరో, వర్ణ కుర్సీ ఖాలీ కరో’ వంటి నినాదంతో కింది స్థాయి సామాజిక వర్గాలను చైతన్యపరిచింది. సోషలిస్ట్, బహుజన్ ఉద్యమాలు ఓబిసి రిజర్వేషన్ల కోసం పోరాడాయి.
వాస్తవానికి సోషలిస్టులు కుల ఆధారిత రిజర్వేషన్లు సమర్ధిస్తూ మండల్ సిఫారసులను అమలుపరచాలని ఉద్యమించారు. ‘పిచ్డా పావే సౌ మే సాట్’ నినాదంతో సైద్ధాంతిక పరంగా 1950 ల నుండి ప్రచారం చేశారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ మొదలైనవారు మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి ప్రధానమంత్రి వీపీ సింగ్ మండల్ కమిషన్ రిపోర్టును పూర్తిగా అమలు చేయకపోవడంపై ములాయం సింగ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకవేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి రథ యాత్ర ప్రవేశిస్తే అద్వానీని అరెస్టు చేస్తామని ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. తరువాత అద్వానీ బీహార్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్టు చేశారు. రిజర్వేషన్లను అమలు చేసినందుకు నవంబర్ 7, 1990 న జాతీయ స్థాయిలో జనతాదళ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. మండల్ కమిషన్ నివేదిక అమలు కోసం జరుగుతున్న మండల్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కమండల్ ఉద్యమాన్ని ముందుకు తెచ్చింది.
మండల్, మందిర్ ఉద్యమాలతో దేశం నిట్టనిలువుగా చీలిపోయింది. ఒకవైపు ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఉన్నత సామాజిక వర్గాలు, మరోవైపు మండల్ కమిషన్ రిపోర్టు సంపూర్ణ అమలు కొరకు ఉద్యమిస్తున్న దళిత, ఆదివాసీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాలుగా చీలిపోయారు. దీంతో వెనుకబడిన సామాజికవర్గాలు ఒకతాటిపైకి వచ్చి, మండల్ విప్లవం రూపంలో దేశ రాజకీయాలను నిర్దేశించారు.
తొమ్మిది మంది సభ్యులు కలిగిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఓబిసిలకు 27% రిజర్వేషన్ల అమలును సమర్థించింది. రాజ్యాంగపరంగా ఓబీసీలను నిర్వచించడంలో మండల్ కమిషన్ సఫలీకృతమైంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 16 (4) ప్రకారం ఓబీసీ నిర్వచనాన్ని న్యాయస్థానం సమర్దించింది. దీంతో సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం రిజర్వేషన్ లకు ప్రాతిపదికగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశంలో అత్యున్నత న్యాయస్తానమైన సుప్రీంకోర్టు ఆర్థిక ఆధారిత వెనుకబాటుతనం చట్ట విరుద్ధమని తీర్పునిచ్చింది.
అయినప్పటికీ ఓబిసిలలో క్రీమిలేయర్ అవసరం అని సుప్రీంకోర్టు భావించింది. ఉపాధి, ఉద్యోగాలలో ఓబిసిలకు లభించే చిన్న ప్రయోజనాలను కూడా తిరస్కరించడానికి బిజెపి క్రీమిలేయర్ ను మార్చడానికి పూనుకుంది. అసంపూర్ణగా మిగిలిపోయిన రామ జన్మ భూమి రథ యాత్ర ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు మండల్ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రామ మందిర ఉద్యమం ఉన్నత వర్గాలకు అధికారం అందించింది.
మండల్ ఉద్యమం దళిత, ఆదివాసీ, ఓబీసీ, మైనారిటీలను ఏకం చేస్తూ వెనుకబడిన సామాజికవర్గాలకు అధికారం అందించింది. దీని ఫలితమే సమాజ్ వాదీపార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలో అధికారాన్ని చేపట్టాయి. బీహార్ రాష్ట్రంలో కూడా మండల్ ఉద్యమం వెనుకబడినవర్గాల అధికారాన్ని కొనసాగించింది.
సాధికారిత, సమానత్వం, ఆత్మగౌరవం, ప్రాతినిథ్యం, సామాజిక పరివర్తన సాధించడానికి పూర్తి స్థాయిలో మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేయాలి.
మండల్ తన నివేదికలో, , “సామాజిక వెనుకబాటు తనంపై ఓబీసీల మెదళ్లల్లో పోరాటం జరగాల్సిన అవసరం ఉంది,” అని పిలుపునిచ్చారు.
‘ఇండిపెండెన్స్ డే’, ‘రిపబ్లిక్ డే’ను జరుపుకున్నట్టే మనం ‘ఆగస్టు 7’ ను ‘మండల్ డే’గా స్మరించుకుందాం.