నాకు తెలిసిన బుల్లి అబ్బాయి బాబయ్య : పరకాల సూర్యమోహన్

(పరకాల సూర్యమోహన్)
నాకు తెలిసిన బుల్లిఅబ్బాయి బాబయ్య పేరు పరకాల వెంకట రామచంద్రమూర్తి.
1928 లో సరిగ్గా ఈ నెల  ఇవాళ (జూలై 27) పుట్టిన బాబయ్య ఇంకా మన మథ్యనే వుండివుంటే ఇప్పుడు 92 ఏళ్ళు వుండేవి.
ఎందుకో తెలియదు కానీ ఈ బాబయ్యకి నేనంటే కొంచం ఎక్కువ అభిమానం .
బహుశా మిగతా పిల్లల్లోకి నేనుకాస్త పెద్దవాణ్ణి కావడం రెండవది బెజవాడ నుంచి వేసవి సెలవులకి మాత్రమే కవిటం వస్తూ వుండటం కావచ్చు. నాకూ బాబయ్య దగ్గరే ఎక్కువ చనువు వుండేది.
సినిమాలు, షికార్లకీ నన్నే తీసుకువెళ్ళే వాడు. సినిమాలుకి ఇటు పెనుగొండ అటు పాలకొల్లు సైకిల్ మీద డబల్సు వెళ్ళేవాళ్ళం, మేము ఎప్పుడు వెళ్ళినా ఒక సినిమాతో సరిపెట్టుకునేవాళ్ళం కాదు. ఫస్ట్ షో, సెంకండ్ షో చూసితీరాల్సిందే. ఒకసారి మ్యాటనీ, ఫస్ట్ షో, సెంకండ్ షో చూసిన రికార్డు కూడా వుంది.
అర్థరాత్రి రెండు దాటాకా కాలవ పక్కనే వున్న రోడ్డమ్మటే, ఆ చిమ్మచీకట్లో, డైనమో వెలుతుర్లో, చల్లని గాలి రివ్వున మొహానికి తగులుతూవుంటే , కీచురాళ్ళ శబ్దాలు వింటూ భయంభయంగా సైకిల్ తోక్కుకుంటూ ఇంటికి వెడుతూంటే ఎంతో త్రిల్లింగ్ గా అనిపించేది. అలాంటి రోజులు మళ్ళీ రావు. ఇంటికి చేరేసరికి రాత్రి రెండుమూడు అయ్యేది. ముందుగానే ఏర్పాటు చేసుకున్న మడతమంచాలు వాల్చుకుని అరుగు మీద పడుకునేవాళ్ళం . మర్నాడు తెల్లారాకా పెద్దత్తయ్య, బులిచిన్నపిన్ని చివాట్లుపెట్టడం, నేను తలొంచుకుని నిలబడటం, బాబయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ వుండటం మాకు అలవాటైపోయింది. నాలుగు రోజులు అయిన తరువాత, కాస్త సద్దుమణిగాకా మేము మళ్లీ బయల్దేరే వాళ్ళం.
బాబయ్య మనసు వెన్న, మాటల్లో ఎంతో ఆప్యాయత తొంగిచూస్తూవుండేది.
ఎక్కువ గా బీడీలు కాల్చేవాడు. దంపుడు వసారా దాటి మెట్లెక్కి బాబ్బ మిద్దెదాటి ముందుకు వెడితే పెద్ద డాబా. వేసవి లో రాత్రిళ్ళు మేమంతా అక్కడే పడుకునే వాళ్ళం. అక్కడే బాబయ్యా నేనూ చెస్ ఆడేవాళ్ళం, బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగుతూ ఎత్తులు వేసేవాడు. ఒకసారి బీడీకాలిస్తే ఎలావుంటుందో చూద్దామని గప్ చుప్ గా వెలిగించాను. బీడీ నోట్లో వుంది, ఏదో అలికిడి అనిపించి తలెత్తి చూసేసరికి కొయ్య బారిపోయాను,ఎదురుగా బులిచిన్న పిన్ని. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఆ తరువాత ఏంజరిగిందో నేను చెప్పను. బాబయ్యా, మేము కేరం బోర్డు కూడా ఆడేవాళ్ళం.
పలపదొడ్డిలో బొలెడు ఆవులు గేదెలూ వుండేవి. ప్రతిరోజూ పాలు పితకడానికి బాబయ్య నన్నూ తీసుకుని వెళ్ళేవాడు. పెద్ద ఇత్తడి చెంబు నిండా పాలు పితికేవాడు. పాలు ఎలాపితకాలో నాకు నేర్పాడు, గుమ్మపాలు చాలా బావుంటాయని నా చేత తాగించే వాడు.
బాబయ్య బాగా పేరున్న పశువుల డాక్టరు .
కవిటం(పోడూరు మండలం,పశ్చిమ గోదావరి జిల్లా) లోనే కాదు పొరుగూళ్ళ నుంచికూడా బాబయ్యని పిలుచుకు వెళ్ళేవాళ్ళు. మదరాసులో వెటర్నరీ వైద్యంలో డిప్లొమా పొందిన బాబయ్యకి ఎంతో హస్త వాసి వున్న వైద్యుడుగా పేరు వుండేది.
పొలం పనులన్నీ బాబయ్యే చూసేవాడు. సైకిల్ మీద ముర్రావు, గరువుకి వెళ్ళేవాడు. నూర్పిళ్ళు అయి థాన్యం గుట్టలుగా పోలాల్లో పోసివుంచేవాళ్ళు. రాత్రిళ్ళు బాబయ్యవెళ్ళి పడుకునేవాడు, ఒకటిరెండుసార్లు నేనూ వెళ్ళి పడుకున్నాను. నులక మంచం, లాంతరు, టార్చిలైట్ వుండేవి, ఆ తరువాత రెండెడ్ల బండిమీద థాన్యం బస్తాలు తీసుకొని మార్టేరుకు బయలుదేరుతూవుంటే అందరికన్నా ముందుగా నేను రెడి అయ్యేవాణ్ణి.ఒకసారి బాబయ్యని బాగా బతిమాలి బండిని మార్టేరు మిల్లు వరకూ తోలుకుంటూ వెళ్ళాను.
మన ఇంటి సావిడిలో గోడ వారగా గోనెసంచి పరిచి, దాని మీద పెద్ద పీట బోర్లించి, చెక్క పిడి దింపిన పనసకాయ ని పెసరబద్దల్లా ఎలా కొట్టాలో నాకు నేర్పిన ఘనత బాబయ్యదే.
పొలం పనుల్లో బిజీగా వున్నా బాబయ్య , పెద్దత్తయ్య మహిళా సంఘం పనుల్లో ఎంతో సాయం చేసేవాడు.
తుక్కు తాతయ్య కన్ను మూసిన తరువాత కుటుంబ బాధ్యతలు ఎక్కువగా బాబయ్య మీదే పడ్డాయి. తద్దినాలు వగైరా బాబయ్యే చూసేవాడు. బాబయ్య పెద్ద అన్నగారు పట్టాభి రామారావు వుద్యోగ రీత్యా విజయవాడలో స్థిర నివాసం, రెండవ అన్నగారు రమణరావు కి మార్టేరులో రేడియో షాపు వుండేది.
బాబయ్య కొంతకాలం branch post master గా పనిచేసాడు. మన ఇల్లు అరుగుకి కుడిపక్కన వున్న గదిలో పోస్టాఫీసు సరంజామా వుండేది.అరుగు ఎడమ పక్క గది తుక్కుతాతయ్య స్థిర నివాసం. అరుగు దాటి లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద సావిడి. అదొక mini marriage hall. మన బంథువుల పెళ్ళిళ్ళు అక్కడ ఎన్ని అయ్యాయో చెప్పలేము. ఆ సావిడి కి కుడి పక్కన రెండు గదులు, ఎడమ పక్కన రెండు గదులు, ఎదురుగా ఈ మూలనుంచి ఆ మూలకి పేద్ద వంటిల్లు. ఆ వంటిల్లు దాటితే పెద్ద పెరడు. ఆ పెరడు ఎన్నో పూలమొక్కలతో, పళ్ళ చెట్లతో పచ్చపచ్చగా కళకళలాడుతూ కనిపించేది.
సావిడిలోనుంచి కుడి పక్క గది దాటి ముందుకు వెడితే దంపుడు వసారా. ఆ వసారా లోంచి మిద్దె మీదకీ డాబాలోకి దారివుండేది.
బాబయ్య గురించి రాస్తోంటే మన 12 గదుల విశాలమైన పరకాల భవంతి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది.
బాబయ్యకి ఏడాది నిండకుండానే దురదృష్టవశాత్తు తల్లి ‘(మన బామ్మ) కన్ను మూసింది. ఇంకా తల్లి పాలే ఆహారం. కాలవ అవతల ఒక బాలింత వచ్చి బాబయ్యకి పాలు ఇచ్చేదట. అటువంటి వారిని “పాల తల్లులు ” అని పిలిచేవారు .
బాబయ్య 1999 నవంబర్ 12 వ తేదీన, తన 71 వ ఏట కన్ను మూసాడు.
బాబయ్య చనిపోయి 21ఏళ్ళు అవుతున్నా ఆ జ్ఞాపకాలు మనసులో పదిలంగా వుండి పోయాయి.
బాబయ్యా , ఆయన ఇద్దరు అన్న గార్లు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. మనం వాళ్ళకి “తీపి గురుతులు ” గా మిగిలాము. మనలో కూడా చరమాంకంలో కి చేరుకున్నవాళ్ళు వున్నారు.
ఈరోజున నా ప్రియతమ బుల్లి అబ్బాయి బాబయ్యకి ఘన నివాళి అర్పిస్తూ, అంజలి ఘటిస్తున్నాను!
Parakala Suryamohan
(పరకాల సూర్యమోహన్,సీనియర్ జర్నలిస్టు, సోవియట్ ల్యాండ్, ఆంధ్ర ప్రభు, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ లలో పనిచేశారు. కవిటం పరకాల ట్రస్టు చైర్మన్. చెన్నైలో ఉంటారు. ఫోన్ :9840218466)

(మా నాన్న (ఒక నాటి విశాలాంధ్ర సంపాదకుడు పరకాల పట్టాభిరాం) గారి ఆఖరి తమ్ముని 92 వ జయంతి సందర్భంగా మా పరకాల group లో నేను రాసిన నా జ్ఞాపకాలు-ఒక నివాళి)