చలనచిత్ర, నాటక, కళా రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న శ్రీ రావి కొండల రావు మరణం నన్ను ఎంతో దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా చెరగని ముద్ర వేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారు. ఆయన మరణంతో తెలుగు సినీ, నాటక, టీవీ రంగం మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైంది.
600కుపైగా చిత్రాల్లో నటించి, అనేక చిత్రాలకు దర్శక నిర్మాతగా, రచయితగా పని చేసిన ఆయన మొదటిసారిగా కళాకారుడిగా మిస్ ప్రేమ అనే నాటకం ద్వారా ప్రస్థానం ప్రారంభించారు. రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932లో జన్మించారు. ‘శోభ’ (1958)తో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది.
ఆయన కెరీర్లో ‘తేనె మనసులు’, ‘దసరా బుల్లోడు’, ‘రంగూన్ రౌడీ’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘వరకట్నం’, ‘అందాల రాముడు’, ‘రాధా కళ్యాణం’, ‘చంటబ్బాయి’, ‘పెళ్ళి పుస్తకం’, ‘బృందావనం’ ‘భైరవ ద్వీపం’ ‘రాధాగోపాలం’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘కింగ్’, ‘ఓయ్’, లాంటి విజయవంతమైన చిత్రాలు ఎప్పటికీ తెలుగు వారికీ గుర్తుండిపోతాయి. . ఆయన భార్య రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు.
‘బ్లాక్ అండ్ వైట్’ పేరుతో సినీ సంకలనం రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించిన శ్రీ రావి కొండల రావుకు 2004లో తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది. సినీ కథా రచయిత గా కూడా ఆయన నందీ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ, నాటక, కళా రంగాల్లో అత్యంత అరుదైన వ్యక్తిగా నిలిచిపోయే శ్రీ రావి కొండలరావు గారికి అశ్రు నివాళులు అర్పిస్తున్నాను.
(టి.ఎస్.విజయ్ చందర్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటాకరంగ అభివృద్ధి సంస్థ)