1990వ దశకంలో తెలుగు ప్రజానీకాన్ని తన పాటలతో మాటలతో ఉర్రూతలూగించిన పసుపులేటి కృష్ణయ్య చిత్తూరు జిల్లావాసి. పసుపులేటి కృష్ణయ్య అనే కంటే ‘మల్లి ముచ్చట్లు’ కృష్ణయ్య అంటేనే బాగా గుర్తు పడతారు.
పల్లె అందాలను… పదునైన మాటలతో …. తిరుపతి మాండలికంలో వినాలంటే మన పాడిపేటకు చెందిన దివంగత పసుపులేటి కృష్ణయ్య గారి రచనలను, పాటలను విని తీరాల్సిందే. (‘యూట్యూబ్’ లో అందుబాటులో ఉన్నాయి)
1990వ దశకం ముందు, తరువాత దాదాపు మూడు దశాబ్దాలపాటు రంగస్థల నటుడుగా, జానపద కవి, గాయకుడు, బుర్రకథ కళాకారుడుగా ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనుడు దివంగత కృష్ణయ్య.
పౌరాణిక, సాంఘిక, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించారు. 1938 లో జన్మించిన పసుపులేటి కృష్ణ గారు తన 18వ ఏట నుంచి నాటకాలు ప్రదర్శించడం ప్రారంభించారు.
టీటీడీలో సాధారణ ఉద్యోగిగా ఉన్న ఈయనకు తన ప్రవృత్తి నాటకాలు అంటేనే ప్రాణం. నండూరి సుబ్బారావు ఎంకి పాటలు నుంచి స్పూర్తి పొందిన పసుపులేటి కృష్ణయ్య తన స్వీయ రచనలుగా కృష్ణయ్య సేద్యం, గాజుల కృష్ణయ్య, రత్తీ… రంగడు, జానపద కళా మాన్యాలు, ఇదే నా దారి వంటి కథా గేయాలు ఎన్నో రచించారు.
మగ్గం పక్కనపెట్టి మనుషులను రంజింప చేయాలని చిన్నప్పటినుంచి కలలు కన్నారు. పసుపులేటి కృష్ణయ్య స్వీయ రచన, గానం చేసిన “మల్లి ముచ్చట్లు” ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పల్లెను, పట్టణాన్ని ఓ ఊపు ఊపాయంటే అతిశయోక్తి కాదేమో.
1991లో టిటిడి లో రిటైర్ అయిన తర్వాత తన ప్రవృత్తిని మరింత ఉధృతం గావించి 2007లో ‘రాయలసీమ నటరత్నం’ గా బిరుదు పొందారు.
1990లో తాను రచించిన “మల్లి ముచ్చట్లు” ప్రమోట్ చేయడానికి ఆడియో కంపెనీల చుట్టూ తిరిగారు. ఇంట్లో ఉన్న నగా, నట్రా అమ్మి ఎన్నో అవస్థలు పడి 1991లో మన ముందుకు తెచ్చారు.
ఈ క్యాసెట్ దశాబ్దకాలంపాటు మధురమైన గేయకావ్యంగా విరాజిల్లుతుందని రచయితకు గానీ, దాన్ని పరిచయం చేసిన నాటి మేటి నటులు రావు గోపాల్ రావు గారికి గానీ తెలియదు.
ఎన్నో కష్ట,నష్టాలకు ఓర్చి తెచ్చిన “మల్లి ముచ్చట్లు” క్యాసెట్లు అమ్ముకొని ఆడియో కంపెనీలు లాభ పడ్డాయి. తన గొంతు నుంచి జాలు వారిన జానపద కళా సేద్యంతో ఆంధ్ర రాష్ట్రంను తడిపిన సంతృప్తి క్రిష్ణయ్య కు మిగిలింది.
పలు సార్లు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న పసుపులేటి ఆకాశవాణి, దూరదర్శన్ లలో బుర్రకథలు ప్రదర్శించారు. సమాచార శాఖ తరపున కళాకారుడిగా ప్రజా చైతన్యంకై పలు ప్రదర్శనలు నిర్వహించారు.
జానపదానికి, పల్లె అందానికి సొగసు తెచ్చిన దివంగత పసుపులేటి కృష్ణయ్య గారు మన తిరుచానూరు పక్కనుండే పాడిపేటకు చెందిన వారు కావడం మనకు గర్వకారణం.
ఆయన పెద్ద కుమారుడు గోపి టిటిడి ఉద్యోగి. చిన్న కుమారుడు పసుపులేటి ఈశ్వర్ 10 టి.విలో ప్రముఖ యాంకర్ గా పని చేస్తున్నారు.
(*కందారపు మురళి, ప్రధాన కార్యదర్శి, సిఐటియు, తిరుపతి)