ఇపుడయితే రాజకీయ నాయకులు తిరుమలలో విఐపి హోదాకోసం పోటీపడుతున్నారు.విఐపి హోదా రద్దు చేస్తే గిలగిల్లాడిపోతారు. దేవుని దగ్గిర విఐపి దర్శనాలేమిటీ భక్తుల్లో ఒకరిగా ఉండి శ్రీవారిని దర్శించుకోవాలన్న యోచన ఎవరికీ రాదు. భక్తుడి హోదాకంటే విఐపి హోదాయో పెద్దది అనుకునేవారే ఎక్కువ మనరాజకీయ నాయకుల్లో. అయితే, ఒకే ఒక మహానాయకుడు, తెలుగుజాతీయ నాయకుడు,గొప్ప పండితులు, తిరుమలో దర్శనంలో తనకు విఐపి హోదా వద్దన్నాడు. తన హోదా దాచిపెట్టి గుట్టుచప్పుడుకాకుండా క్యూలో భక్తుల మధ్య దూరి, వారిలో ఒకడిగా ఓపికగా తన వంతువచ్చే దాకా ఆగి దర్శనం చేసుకుని తరించానని భావించే వాడు. ఆయననే లోక్ సభ మాజీ స్పీకర్,పదహారాణాల తెలుగువాడు మాఢభూషి అనంతశయనం అయ్యంగార్ (1891-1978).
పార్లమెంటులో స్పీకర్ (8 మార్చి 1956 to 16 ఏప్రిల్ 1962)గా ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.సభ నడపడంలో, సభా మర్యాదలు కాపడటంలో ఆయన బాగా ప్రశంసలందుకున్నారు. ఆయన వాగ్ధాటి అందరిని ముగ్ధులను చేసేంది.ఇంగ్లీష్ మీద ఆయన పట్టును చూసి విదేశీయులు కూడా ఆశ్చర్య పోయే వారు. సభలో ఆయన ప్రసంగాన్ని ‘అనంతవచనమ్’ అని పిలిచేశారు. ఆయన వాగ్ధాటిని శత్రుభీకరమయిన జర్మన్ సబ్ మెరైన్ Emden తో పోలుస్తూ ఆయనను Emden of The Assembly అని ఒక యూరోపియన్ విజిటర్ ఆయన కొనియాడారు. ఆయన ప్రసంగాలు చాలా అధికారిక సమాచారంతో ఉండేవి. ఆయన హిందూ లా, పర్సనల్ లా మీద అధారిటీ.
బీహార్ గవర్నర్ గా నియమించాక పార్లమెంటు హౌస్ నుంచి ఆయన కార్యస్థానం పట్నాలోని గవర్నమెంట్ హౌస్ కు మారింది. ఆయన రూల్స్ ని చాలా కఠినంగా పాటించేవారు. అంతా పాటించాలనే వారు. బీహార్ రాజ్ భవన్ ని ఆయన శాకాహారానికి మార్చేశారు. మద్యపానం నిషేధించారు.రాజ్ భవన్ అతిధులు కూడా ఆయన నియమాలను గౌరవించేవారు. ఆయనకు బీహార్ లో ఎంత మంచి పేరొచ్చిందంటే…. పట్నాలోని ఒక పార్క్ కి అయ్యంగార్ ఉద్యాన్ అని పేరు పెట్టారు. 1967లో బీహార్ గవర్నర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన నేరుగా తిరుపతికి వచ్చి సెటిల్ అయ్యారు. రాజధానులను పట్టుకుని వేలాడ లేదు. ప్రతిరోజు వెంకటేశ్వరుడి సుప్రభాతం చెవినపడగాన లేచేవారు. తిరుమల దర్శనానికి వచ్చినపుడు VIP దర్శనం కోసం అధికారుల మీద ఆధారపడకుండా గప్ చుప్ గా వెళ్లి క్యూలోని భక్తుల్లో కలిపోయేవాడు. తన వంతు వచ్చే దాకా దైవదర్శనం కోసం వచ్చే వరకు వేచి ఉండేవాడు. ఎపుడైనా అధికారులు ఆయనను గమనిస్తే,ష్ గమ్మునుండని వారించేవాడు. దైవదర్శనంలో అంతా సమానంగా ఉండాలని చెప్పేవాడు.విఐపి అనే పద్ధతి వద్దనే వాడు. స్పీకర్ గా 20 అక్బర్ రోడ్ నివాసంలో ఉన్నపుడు కూడా ఆయన సంస్కృతంపాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడు. సంస్కృతం ధారాళంగా మాట్లాడే వాడు. అందుకే ఆయన్ని తర్వాత తిరుపతి సంస్కృవిద్యాపీఠం ఛెయిర్మన్ ను చేశారు. (source:Speaker Par Excellence by Agara Eswar Reddy in The State of Rayalaseema by Ed. A Rangareddy P.367)
ఈ రోజు అనంతశయనం అయ్యంగారి పరిచయం
-చందమూరి నరసింహారెడ్డి
స్వాతంత్య్రానంతరం పార్లమెంట్ కు1952 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నుంచి మొదటి పార్లమెంటు సభ్యుడు మాడభూషి అనంతశయనం అయ్యంగార్. మొదటి పార్లమెంట్ డిప్యూటి స్పీకర్, లోక్‌సభ స్పీకరు.
ఎందరో త్యాగల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్దించింది. మన రాష్ట్రంలో కూడ అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. మాడభూషి అనంతశయనం అయ్యంగార్ చిత్తూరు జిల్లా కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు.
1891, ఫిబ్రవరి 4 తేదీన మాడభూషి అనంతశయనం అయ్యంగార్ చిత్తూరుజిల్లా తిరుచానూరు లో జన్మించారు.తిరుపతి దేవస్థానం హైస్కూల్ విద్యనభ్యసించారు. తర్వాత పచ్చయప్ప కళాశాల నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. మొదట తిరుపతి లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా 1915 -1950 వరకు ప్రాక్టీస్ చేశారు.
మహాత్మా గాంధీ సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 1921 లో సహయనిరాకరణోద్యమం లోను 1940 లో వ్యక్తి సత్యాగ్రహం లోను,1942 లో క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. 1919లో చూడమ్మల్ ను పెళ్లి చేసుకొన్నారు. వీరికి 4గురు కుమారులు 8మంది కూతుళ్లు. 1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. 1936లో తిరుత్తణిలో రైతు సదస్సు జరిగింది. ఆ నాటి సభకు మాడభూషి అనంతశయనం అయ్యంగారు కూడా వచ్చారు.
కొసరాజు చైతన్య ప్రతిభాపాటవాలకు ముగ్ధులై అనంతశయనం అయ్యంగారు వారిని ప్రశంసించి ‘‘కవిరత్న’’ బిరుదును ఇచ్చి ఘన సత్కారం గావించారు.
మొదటి లోక్ సభలో గుజరాత్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ మొదటి స్పీకర్ కాగా, మాడభూషి మొదటి డిప్యూటీ స్పీకర్ (1952 to 1956) .మావలాంకర్ మరణం తర్వత అయ్యంగార్ స్పీకర్ అయ్యారు( 8 మార్చి 1956 to 16 ఏప్రిల్ 1962). 1952 లో అట్టావా లో జరిగిన కామన్వెల్త్ మహాసభలో భారత ప్రతినిధి గా పాల్గొన్నారు. 1956లో జరిగిన రెండవ లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1956లో పార్లమెంట్ రెండవ స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి స్పీకర్ అయిన వ్యక్తి కూడా ఆయనే.
1962మే లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 డిసెంబర్ వరకు ఆ పదవిలో ఉన్నాడు. వరకట్న నిషేధచట్టం 1961చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మాడభూషి స్పీకర్ గా ఉన్నారు.
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు. ఈ సంస్థకు మాడభూషి అనంతశయనం అయ్యంగారి పేరుపెట్టాలని తిరుపతినుంచే అసెంబ్లీ స్పీకర్ ఎన్నికైన అగరాల ఈశ్వర్ రెడ్డి చాలా కాలంనుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాడభూషి అనంతశయనం అయ్యంగార్ 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించారు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు. ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసినది.
రాజకీయాలను మతాన్ని కలపరాదన్న అయ్యంగార్
రాజకీయాలనుంచి మతాన్ని వేరుచేయాలని అయ్యంగార్ వాదిస్తూ వచ్చారు.దీనిని మీద ఆ రాజ్యంగ సభలో చర్చకూడా లెవనెత్తారని ప్రముఖ చరిత్రకారుడు,భారత ప్రభుత్వ మాజీ హోం శాఖ కార్యదర్శి మాధవ్ గాడ్ బోల్ (Madhav Godbole) In Babri Masjid-Ram Mandir Dilemma: An Acid Test for India’s Constitution పుస్తకంలో పేర్కన్నారు. ఆయన ఒక తీర్మానం కూడా ప్రతిపాదించారు. సంపూర్ణ మద్దతు లభించింది. అయితే, ఈ ప్రతిపాదన రాజ్యంగంలో ప్రతిబింబించలేదని గాడ్ బోల్ రాశారు.చివరకు సెక్యులర్ ప్రధాని నెహ్రూకూడా ఈవిషయం మీద దృష్టి పెట్టలేదు.
It is significant to note that even while the Constitution was being drafted, the Constituent Assembly (Legislative) had passed a resolution moved by Madabhushi Ananthasayanam Ayyangar on April 3, 1948, to separate religion from politics. It was passed almost unanimously, with only one Muslim member opposing it. Since there was so much support for it, it is not clear why a suitable provision for it was not made in the Constitution at that stage itself. I wonder if this was because there was hidden opposition to it. Nehru had strongly supported the resolution but took no action on it during his 17-year term as Prime Minister. (Source: Indialegallive.com)
‘Our Parliament and Indian Culture and Religious Thought’ అనే పుస్తకాన్ని కూడా అయ్యాంగార్ రాశారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ సాంఘికరాజకీయ పరిశోధకుడు.ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)
Like this story? please share it with a friend!