(CS Saleem Basha)
అతనే భారత సినీరంగంలో తనదైన నటనతో తెరపై నవ్వులు వెదజల్లి, చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాస్యనటుడు “మహమూద్” అనబడే మహమూద్ అలీ ! కామెడీకి పర్యాయపదంగా, భావోద్వేగాల ఘటనకు చిరునామాగా చాలా కాలం పాటు ఇండియన్ స్క్రీన్ ను ఏలిన కామెడీ రారాజు, మహమూద్! 2004 లో, ఇదే రోజున (23.7.2020) ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆ గొప్ప హాస్య నటుడు, స్క్రీన్ పైన తన నటనతో చాలా సినిమాల్లో ప్రేక్షకుల్ని ఏడిపించాడు కూడా!
మహమూద్ నవ్వినా, ఏడ్చినా ” కాసులే” రాలేవి. ఫలానా సినిమాలో మహమూద్ ఉన్నాడంటే చాలు, డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా కొనడానికి క్యూలు కట్టేవారు అంటే అతిశయోక్తి కాదు. అంతగా భారత సినీ రంగాన్ని శాసించిన కమెడియన్ మరొకడు లేడు అన్నది పూర్తిగా వాస్తవం. ఒకానొక దశలో హీరో కన్నా ఎక్కువ పారితోషికం పొందిన ఏకైక కమెడియన్! అతని తమ్ముడు అన్వర్ అలీ ఇచ్హిన ఇంటర్వ్యూ ప్రకారం, మహమూద్ రెండు వారాల షూటింగ్ కోసం ఒక్క సినిమాకు ఏడున్నర లక్షల రూపాయలు తీసుకున్నాడంటే అర్థం చేసుకో వచ్చు! జీవితంలో కష్టాల గురించి తెలిసినవాడు, కన్నీళ్ల గురించి పట్టించుకోని వాడు. తెరపై నవ్వులు పూయించినా, కన్నీళ్లు తెప్పించినా , మనసున్న మారాజు గా పేరుపొందిన వాడు.
అందుకే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను దాదాపు సంవత్సరం పాటు ఇంట్లోనే ఉంచుకొని, సినిమాలో వేషం ఇచ్చి , (అదీ హీరో వేషం- “బాంబే టు గోవా” ) ప్రోత్సహించిన వాడు. మహబూబ్ ను గాడ్ ఫాదర్ గా భావించే అమితాబ్ ఒకసారి ” గురుదత్ ఫోటోని ఆయన బెడ్ రూమ్ లో చూశాను.” అని రాశాడు. మహమ్మద్ సినీ ప్రయాణం మొదట్లో ” ప్యాసా, సీ.ఐ.డీ” సినిమాల్లో వేషాలు ఇచ్చి ప్రోత్సహించిన గురుదత్ పట్ల చూపిన కృతజ్ఞత కు నిదర్శనందాన్నిబట్టి తాను సాయం చేసిన వాళ్లను మర్చిపోవడం, తనకు సహాయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం మహమ్మద్ చేసేవాడు అని అర్థమవుతుంది
నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా సినీరంగంలో ప్రఖ్యాతి పొందిన ఈ హాస్య నటుడు చాలా సినిమాల్లో హీరో గా కూడా ఉన్నాడు. ఒకప్పుడు ” మహమూద్” అని పేరు ఉంటే చాలు( అది గెస్ట్ రోల్ అయినా సరే) సినిమా విజయవంతం అవుతుంది అన్నది ఒక నానుడిగా ఉండేది. అయితే ఈ స్థాయికి చేరడానికి మహమూద్ కి అంత సులభం కాలేదు. తండ్రి ” ముంతాజ్ అలీ” 1940 నుండి 1950 వరకూ నటుడిగా ఉన్నా కష్టాలు మాత్రం ఉండేవి. మొత్తం ఎనిమిది మంది సంతానం. మహమూద్ చెల్లెలు కూడా డాన్సర్, తమ్ముడు అన్వర్ అలీ నటుడిగా నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు తీశాడు. అందులో ” ఖుద్దార్ ” అనే సినిమా కూడా ఉంది. ఇందులో కూడా అమితాబ్ హీరో! అమితాబ్ టాలెంట్ పై మా అన్నకి చాలా నమ్మకం ఉండేది. అందుకే ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అమీన్ సయాని ” మీకు మీ గుర్రాల గురించి చెప్పండి అని అడిగితే. మహమూద్ ఇచ్చిన జవాబు ” నా గుర్రాలలో అత్యంతవేగవంతమైన గుర్రం అమితాబ్!” అని జవాబు ఇవ్వడం విశేషం. (Ameen Sayani, the radio broadcaster, once asked him about his horses. “The fastest horse is Amitabh,” Mehmood replied. “The day he picks up speed he will leave everyone behind.”) ఇంకో విశేషమేమిటంటే అమితాబ్ ను ఒక స్థాయికి తీసుకెళ్ళిన ” దీవార్” సినిమాలో అమితాబ్ గురించి పొగుడుతూ ఒక పాత్ర ” ఏ లంబీ రేస్ కా ఘోడా హై. జబ్ స్పీడ్ పకడేగా, సబ్ కో ఫీచే చోడ్ దేగా” అంటుంది. మహమూద్ చెప్పిన మాట అలా కొద్దికాలంలోనే నిజం కావడం విశేషం.
“గుం నాం” సినిమాలో ” హమ్ కాలే తో క్యా హువా దిల్వాలే హై” అన్న మహమూద్ పాట ఉంది. దాని అర్థం ” నేను నల్లగా ఉంటేనే మీ, మనసున్న వాడిని” అని. ఈ పాట కు మరో ప్రత్యేకత ఉంది. ఈ పాట ద్వారా మహమూద్ హైదరాబాది ఉర్దూని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత కొన్ని సినిమాల్లో అది పాపులర్ అయింది. తర్వాత ఆ హైదరాబాది ఉర్దూని కొన్ని సినిమాల్లో పెట్టడం జరిగింది.( “దేశ్ ప్రేమి” సినిమాలో అమితాబచ్చన్ హేమా మాలిని ఆటపట్టిస్తూ మహమూద్ లాగనే పాడతాడు. ). సహాయం చేయడం మహమూద్ కి తెలిసినట్లు ఎవరికి తెలియదు. కష్టాలు ఎరిగిన వాడు కాబట్టి చాలా మందికి సహాయం చేశాడు. 150 మంది కి పెరిగిన కుటుంబాన్ని పోషించడం అంత సులువు కాదు. ఎనిమిది మంది సోదరీ సోదరుల ను పెంచి పెద్ద చేయడం ద్వారా మహమూద్ ఎంత మనసున్న వాడో తెలుస్తుంది. 1961 లో చోటే నవాబ్ సినిమాతో ఆర్డీ బర్మన్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు, అలాగే 1974 లో “కున్వారా బాప్” సినిమా తో ” రాజేష్ రోషన్” కు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. స్నేహానికి ప్రాణమిచ్చే మహమూద్, కిషోర్ కుమార్ ను కూడా ప్రోత్సహించాడు. అతనికి తన సినిమాలో ఎప్పుడో ఒకసారి వేషం ఇస్తానని చెప్పి, అన్న మాట నిలబెట్టుకున్నాడు. అదే ” padosan ” సినిమా. ఇందులో దక్షిణాది శాస్త్రీయ సంగీత కళాకారుడిగా మహమూద్ నటన మరుపు రానిది. padosan సినిమాలో కిషోర్ కుమార్ గాయకుడిగా ముఖ్యమైన వేషం వేశాడు. దీన్నే తెలుగులో ” పక్కింటి అమ్మాయి” పేరుతో రీమేక్ చేశారు. దాంట్లో కిషోర్ కుమార్ వేసిన పాత్రను బాలసుబ్రమణ్యం వేశారు.
మహమూద్ జీవితంలో మొదటి కష్టం తండ్రి తాగుబోతుగా మారడం. తర్వాత ఎన్నో కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. అయినా మహమూద్ స్క్రీన్ పై నవ్విస్తూనే వెళ్ళాడు. పోలియో బారిన పడిన కొడుకు అన్నిటికన్నా పెద్ద కష్టం. అదే సినిమా రూపంలో తీశాడు. ” “కున్వారా బాప్” ( “పెళ్లి కాని తండ్రి” , పేరుతో పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా 1975 లో వచ్చింది) అనే సినిమాకు దర్శకత్వం వహించిన మహమూద్, తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల్లో కంటతడి పెట్టించాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన మహమూద్, కొన్ని సినిమాలను నిర్మించాడు, కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు, చాలా సినిమాల్లో హీరో వేషాలు వేశాడు. . ఒకసారి మెహబూబ్ స్టూడియో లో ప్రముఖ హాలీవుడ్ నటుడు Gregory Peck మహమూద్ ను చూసి ” ఒక హాస్య నటుడి కి మీ అందం చాలా ఎక్కువ” అని ప్రశంసించాడు. దాన్నిబట్టి మహమూద్ పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు కార్ డ్రైవర్ అయిన మహమూద్, విజయాలు సాధించడం మొదలు పెట్టిన తర్వాత ఖరీదైన హాబీలు అలవర్చుకున్నాడు. ఒకప్పుడు అతని దగ్గర దాదాపు 24 కార్లు ఉండేవి. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ఒక మెకానిక్ ని కూడా అపాయింట్ చేసుకున్నాడు! ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ రంగు కార్లో వెళ్ళేవాడు. ఆ రంగు బట్టలకు కారు సరిపోకపోతే, కారు కే ఆ రంగు పెయింటింగ్ చేయించేవాడు!! లండన్ లో షాపింగ్ చేసేవాడు. ఇలా ఖరీదైనా హాబీలను అలవాటు చేసుకున్నాడు
ఆయన సినీ జీవితంలో కూడా అరుణ ఇరానీ తో ప్రేమ వ్యవహారం (?) తాను హాస్పిటల్ లో ఉండగా ఒక్కసారి కూడా చూడడానికి రాలేదని అమితాబ్ ను నిందించడం, తానే పెద్ద మనసు చేసుకోవడం వంటివి కూడా మహమూద్ జీవితంలో ఉన్నాయి
దాదాపు మూడు వందల పైచిలుకు సినిమాల్లో నటించిన మహమూద్ కష్టాల కడలిని ఈదడం లో వెనుకంజ వేయలేదు. నేను ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాను, నా జీవితంలో ఎందుకింత విషాదం, అని అప్పుడప్పుడు స్నేహితులతో అనేవాడు. అయితే చార్లీ చాప్లిన్ చెప్పినట్లు ” Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot.” అని అర్థం చేసుకున్నాడు.
తాను బాధపడినా, ప్రేక్షకులను నవ్వుల నావలో విహారానికి తీసుకువెళ్ళాడు. అప్పుడప్పుడు కళ్ళల్లో కాసిన్ని కన్నీళ్ళు తెప్పించాడు, గుండెలను తడి చేశాడు.
. ఏం చేసినా, తనదైన ముద్ర ఒకటి వేసి వెళ్ళిపోయాడు.
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)