(Dr. A. Venu Gopala Reddy*)
ప్రతీ రోజు ఉదయం నిద్ర లేవగానే వార్తాపత్రికలలో ఈరోజు ఎన్ని కరోన కేసులు నమోదయ్యాయి, ఎంత మంది మరణించారు, ఎన్ని టెస్టులు చేశారు అనేది చూడడానికే సరిపోతుంది. ఇక దినమంతా వివిధ టీవీ ఛానల్ లో కరోన విలయతాండవం అంటూ సమాచారాన్ని నట్టింట్లోకి తీసుకొస్తున్నాయి. వివిధ వార్తా మాధ్యమాలలో పతాక శీర్షికలు కూడా చాలా భయం గొలిపే విధంగా ఉంటున్నాయి. కరోన విలయతాండవం, కరోన మరణమృదంగం, కరుణ విధ్వంసం అంటూ ప్రజల మనస్సుల్లో భయాన్ని(Obsessive Corona Disorder-OCD) బాగా నాటాయి.
ఇక వివిధ సోషల్ మీడియాలలో జనాలు అనాలోచితంగా పోస్టు చేస్తున్న సందేశాలు, వీడియోలు ప్రజల్లో భయాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఆసుపత్రుల ఆవరణల నుండి వస్తున్న వీడియోల వల్ల ప్రజలకు నిద్ర కరువవుతున్నది. ఇక అసలు ఈ వైరస్ గూర్చి, వ్యాధి గూర్చి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కొందరు అపరిపక్వ మేధావుల వల్ల ప్రజలకు అసలు సమాచారం కన్నా అపోహలు ఎక్కువగా చేరుతున్నాయి.
ఇప్పుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వైరస్ కు వాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మందు వస్తుంది, ఎప్పుడు ఈ ప్రాణ సంకటం నుంచి బయటపడతామని ఆలోచనలోనే ఉన్నారు. ఇదిగో కుడుము అంటే అదిగో పండుగ అన్న చందంగా ఎవరు వాక్సిన్ వచ్చిందన్నా, ఔషధం వచ్చిందన్నా ఆశగా చూస్తున్నారు.
ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్న కరోనా గురించి మాట్లాడుకోవడం తప్పించి వేరే ముచ్చటే లేదు. ఊరు, వాడ, పట్టణం, పల్లెలు అన్నీ కరోన భయంతో వణికిపోతున్నాయి. అందరూ పనులు మానేసి ఇంటికే పరిమితం అయిపోయారు.
మరి కరోనా నిజంగా అంత భయంకరమైన వ్యాధా? మనం కూడా ఒకసారి కరోనా లెక్కలు చూద్దాం. ఈ రోజు వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరుణ కేసులు 1కోటి 30 లక్షలు, ప్రపంచ జనాభా 750 కోట్లు. ఆ లెక్కన, ఇప్పటివరకు కరోన వైరస్ బారిన పడ్డ జనాభా శాతం కేవలం 0.17 ఇందులో 70 లక్షల మంది ఇప్పటికే కోలుకోవడం జరిగింది. ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య షుమారుగా ఐదు లక్షలు, మరణాల శాతం 3%.
ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో కేసుల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షలు భారతదేశ జనాభాలో ఇది కేవలం 0.06%. ఇందులో 5 లక్షల 50 వేల మంది ఇప్పటికే కోలుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో కేసులు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఈ వ్యాధి పెద్దగా ప్రభావం చూపలేదు ఇప్పటివరకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరణల శాతం 2% వరకు ఉంది.
ఈ లెక్కలన్నీ కూడా మనకు అధికారికంగా వివిధ వెబ్ సైట్లలో అదేవిధంగా వివిధ అధికారిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నవి. కానీ ప్రపంచ వ్యాప్తంగా epidemiologist లు చెప్పేదాని ప్రకారం కరోన కేసులు అధికారికంగా నమోదైన సంఖ్య కన్నా 10 నుండి 20 రెట్ల వరకు వైరస్ వ్యాపించి ఉంటుంది అని. అదే కనుక నిజమైతే కరోనా మూలంగా జరుగుతున్న మరణాల శాతం 3% శాతం నుండి 0.3% పడిపోతుంది
అసలు వ్యాధి అని దేనిని అంటారు. వ్యాధి నిర్వచనం ప్రకారము ఏదైనా బాహ్య పదార్థము శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు,ఆ బాహ్య పదార్థం వల్ల శరీరంలో హానికరమైన, మార్పులు జరిగినప్పుడు దానిని వ్యాధి అంటాము. వివిధ దేశాల్లో జరిగిన సీరో సర్వేల ప్రకారం తేలిన అంశం ఈ వైరస్ సోకిన వారిలో 94 శాతం మందికి వైరస్ సోకిన సంగతి వారికే తెలియదు. మిగిలిన వారిలో 3% మందికి ఏ లక్షణాలు లేవు, 2%వారికి స్వల్ప లక్షణాలు ఉండగా, 1% లో కొద్దిగ త్రీవ్ర లక్షణాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు నిజంగా ఇది ప్రమాదకరమైన వ్యాధా.
భారత దేశంలోని ఎనభైశాతం గ్రామాలలో అసలు ఈ వైరస్ ఆచూకీ కూడా లేదు. కానీ దేశంలోని అన్ని గ్రామాలు భయం లో మునిగిపోయాయి. భారతదేశంలో నమోదవుతున్న కేసులన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. భారతదేశంలోని 80 శాతం కేసులు 7 రాష్ట్రాలోనే నమోదవుతున్నాయి. 20% దేశం మాత్రమే కరోన బారిన ఉంది కానీ కరోనా గుప్పిట్లో భారతదేశం అని ప్రచారం చేస్తూ భారతదేశంలోని గ్రామగ్రామాన వీధివీధిన కరోనా సోకిన భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది నిజమే. దాని మూలంగా కొందరిలో అకస్మాత్తుగా అనుకోని పరిణామాలు సంభవిస్తున్నది నిజమే. వయసుతో సంబంధం లేకుండ మరణిస్తుంది నిజమే. కాని, ప్రజలని ఇంతగా భయపెట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 84 లక్షల మంది వివిధ రకాలైన శ్వాసకోశ వ్యాధులతో మరణిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వాటన్నిటికీ వివిధ రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. చికిత్స విధానాలు అందుబాటులో ఉన్న వ్యాధులు వల్లనే 84 లక్షల మంది చనిపోతే ఒక కొత్త వ్యాధి మూలంగా మొదట్లో కొంత మరణాలు సంభవించే అవకాశం ఉంది. రానురాను దాని తీవ్రత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజలకు ప్రతి రోజూ కొత్తగా ఎన్ని కేసులు రికార్డు అవుతున్నాయి మొత్తం కేసులు ఎన్ని అనే సమాచారం మాత్రమే చేరుతుంది. కానీ కోలుకుని చాలామంది ఇంటికి వెళ్తున్నారు అనే సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతము భారతదేశంలో 63 శాతం మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. మార్చి చివరి వారంలో ఇది కేవలం 10 నుండి 12 శాతం మాత్రమే ఉండేది. రోజురోజుకు కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది అనే సమాచారాన్ని ప్రజలకు అంద చేయగలిగితే ప్రజల్లో భరోసా పెరుగుతుంది.
ఈ భయాలు చాలవన్నవట్టు ఇంకా వైరస్ ఇలా వ్యాప్తి చెందుతుంది, అలా వ్యాప్తి చెందుతుందని, మళ్ళీ మళ్ళీ రావచ్చని, కొత్త లక్షణాలు కనపడుతున్నాయని, ఇంకొన్ని కొత్త వైరస్లు పొంచి ఉన్నాయాని, ఈ వైరస్ వందల రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుందని, వాక్సిన్ లు పనిచేయవని నానా కొత్త భయాలు ప్రచారంలోకి తెస్తున్నారు..
ప్రజలు కూడ జాగ్రత్తలు పాటిస్తున్నట్టు నటిస్తున్నారు తప్పించి, పాటించడం లేదు. అందుకే వైరస్ బారిన పడుతున్నారు. కరోన కాస్త వేగంగా వ్యాప్తి చెందే వైరస్, అతిస్వల్ప జనాభాలో ఎవరు ఊహించని లక్షణాలు, మరణాలు కలుగచేసే వైరస్. అందువల్ల ప్రభుత్వాలు, వైద్యులు, సూక్ష్మజీవ శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటించాలి.
ప్రభుత్వాలు తగు నివారణ చర్యలు చేపట్టాలి, చికిత్సలు అందుబాటులో ఉంచాలి
ఇప్పటికే కోవిడ్ 19 మూలంగా సామాజిక ఆర్థిక రంగాలకు విపరీతమైన నష్టం జరిగింది. ఈ నష్టాన్ని వెంటనే నివారించకపోతే ప్రపంచ మానవాళి మరెప్పుడూ కోలుకోలేదు. అందువల్ల ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అంతే కానీ కరోనాకు భయపడుతూ కూర్చుంటే, కరోనా మూలంగా ఆగిపోయే ఊపిరి కన్నా, ఆకలిదప్పులతో ఆగిపోయే ఊపిరి ప్రమాదం ఎక్కువ.
(*Dr. A. Venu Gopala Reddy, Microbiologist 9948106198)
(సోర్స్: సోషల్ మీడియా)