హైదరాబాద్, జులై 17: సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవయిత్రి, రచయిత్రి నస్రీన్ ఖాన్ కవితా భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. వాట్సాప్ వేదికగా ప్రముఖ, సీనియర్ కవులైన దాస్యం సేనాధిపతి, దాస్యం లక్ష్మయ్యల పర్యవేక్షణలో ‘నేటి కవిత’ పేరిట గ్రూపు నిర్వహిస్తున్నారు. ఎందరో సీనియర్ కవులు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపులో ప్రతిరోజూ ఏదో ఒక విభిన్నమైన అంశంపై సభ్యులందరూ కవితలు రాయాల్సి ఉంటుంది. రాసిన కవితలను మరికొందరు సీనియర్ కవులు ప్రతిరోజూ సమీక్షిస్తూ కవులలోని కవితా పటిమను మెరుగుపరుస్తారు.
ఈ క్రమంలో హుస్నాబాద్ కు చెందిన సాహితీ సంస్థ ఉదయ సాహితీ వారు నేటి కవిత వార్షికోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రకటిస్తారు. ఇటీవలే గ్రూపు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 108కవితలు పూర్తి చేసిన వారికి కవితా భూషణ్, 500కవితలు రాసిన వారికి కవితా విభూషణ్ పురస్కారాలను అందిస్తామని గ్రూపు వ్యవస్థాపకులు, అడ్మిన్ దాస్యం లక్ష్మయ్య తెలిపారు. నేటి కవిత వార్షిక వేడుకలను జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించామని, పురస్కారాలను కూడా ఆన్లైన్ లోనే ప్రకటించామని ఆయన వివరించారు.
నస్రీన్ ఖాన్ ఇటీవలే ‘ౙఖ్మీ’ పేరిట కవితా సంపుటి వెలువరించారు. ఇప్పటిదాకా గ్రూపులో 125 కవితలను రచించారు.