విజయాలను, వైఫల్యాలను సమానంగా స్వీకరించడమే పాజిటివ్ థింకింగ్ !
డిసెంబర్ 9, 1914 తేదీన 5.30 గంటలకి అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న వెస్ట్ ఆరెంజ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీ లో విస్పోటనం జరిగింది. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆరు గంటల నుంచి, ఎనిమిది గంటల లోపు ఫైరింజన్లు వచ్చాయి. అయినా పెద్దగా ఉపయోగం కనపడలేదు. ఫ్యాక్టరీ చాలా భాగం బూడిద అయింది. భారీ ఎత్తున నష్టం జరిగింది. అప్పట్లో 919,788 పౌండ్లు దాకా నష్టం జరిగిందని అంచనా ( ఇప్పటి అంచనా ప్రకారం 23 మిలియన్ల డాలర్లు)! ఆ ప్రమాదంలో ఎన్నో విలువైన రికార్డులు, ప్రోటోటైప్ లు కాళీ బూడిదయ్యాయి. పైగా బీమా (insurance) కేవలం 1/3 కష్టాన్ని మాత్రమే భర్తీ చేయగలిగేది!! ఆ ఫ్యాక్టరీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త, థామస్ అల్వా ఎడిసన్ ది!
67 ఏళ్ల వయస్సులో కొన్ని వేల పౌండ్లు విలువచేసే తన ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి అయిపోతే, అబ్బాయి చార్లెస్ బాధపడుతున్నడు. కానీ, ఎడిసన్ మాత్రం నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు! పైగా వాళ్ళ అబ్బాయి చార్లెస్ తో ” నువ్వు వెళ్లి మీ అమ్మను ఆమె స్నేహితులను పిలుచుకొని రా. ఎందుకంటే ఇంత గొప్ప అగ్ని ప్రమాదాన్ని వాళ్లు మళ్లీ చూడలేరు!” అన్నాడు. చార్లెస్ అందుకు ఒప్పుకోకపోతే ” పర్వాలేదు. ఇప్పుడు మన చెత్తంతా కాలిపోయింది” అని భరోసా ఇచ్చాడు!
” కొన్ని ప్రమాదాల వల్ల మనకు లాభం ఉంది. ఇప్పుడు మన తప్పులన్నీ కాలిపోయాయి, మళ్లీ మనము కొత్తగా మొదలుపెట్టవచ్చు.” అని చెప్పడం పాజిటివ్ థింకింగ్ కాకుండా మరేంటి? (ఈ సంఘటన గురించి ఎడిసన్ కుమారుడు 1961 లో రీడర్స్ డైజెస్ట్ అనే మేగజైన్లో రాసిన ఒక వ్యాసంలో వివరించాడు).
” నాకు 67 ఏళ్ళు. అయినా సరే రేపటి నుంచే మళ్లీ మొదలు పెడతాను” అని ఒక రిపోర్టర్ తో చెప్పినట్లు ” న్యూయార్క్ టైమ్స్” పేపర్లో వచ్చింది. తర్వాత చెప్పినట్లే మరుసటి రోజు ఉదయం నుంచే పని చేయడం మొదలు పెట్టాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన దగ్గర పనిచేసే వాళ్లను ఏమీ అనలేదు. ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తీయలేదు!!
ఈ సంఘటన ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అందులో మొదటిది అయిపోయిన దాని గురించి ఆలోచించడం, రేపు ఏం జరుగుతుంది అన్న విషయం గురించి చింతించడం వృధా, ప్రస్తుతం మనం ఏం చేయాలన్న ది మాత్రమే మనం ఆలోచించాలి అన్నది. ఇవన్నీ పాజిటివ్ థింకింగ్ లక్షణాలు.
Yesterday is a waste paper; tomorrow is a question paper but today is a newspaper. Read Newspaper and be happy otherwise your life will become a tissue paper! ఎవరో కానీ బాగా చెప్పారు. దీన్ని ఇంకో విధంగాచెప్పాలంటే. ” మీరు నిరాశ, నిస్పృహ లో ఉన్నారంటే గతం గురించి ఆలోచిస్తున్నారని, మీరు ఆందోళనలో ఉన్నారంటే రేపటి గురించి చింతిస్తున్నట్లు, మీరు ప్రశాంతంగా లేదా నిమ్మళంగా ఉన్నారంటే వర్తమానం లో ఉన్నట్లు” అని పాలో కోఎలో ( “ది ఆల్కెమిస్ట్” పుస్తక రచయిత) ఒకచోట చెప్పాడు. ఇది కూడా పాజిటివ్ థింకింగ్ లక్షణమే. నిరాశ నిస్పృహలు, ఆందోళన వంటివి పాజిటివ్ థింకర్స్ డిక్షనరీ లో ఉండవు!
పైన చెప్పిన అగ్నిప్రమాదం సంఘటన తర్వాత ఎడిసన్ ఏం చేసి ఉండొచ్చు? బిగ్గరగా రోదించి ఉండవచ్చు, తన పని వాళ్ళ పై, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు, తనని తాను ఒక గదిలో బంధించు కొని దుఃఖంతో కుమిలి పోయి ఉండవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ, ఎడిసన్ ఎంచుకున్న ఆప్షన్ ” పాజిటివ్ రెస్పాన్స్” అంటాడు The Obstacle Is the Way: The Timeless Art of Turning Trials into Triumph పుస్తక రచయిత “ర్యాన్ హాలిడే” .
గొప్ప పనులు చేయాలంటే వైఫల్యాలను, కష్టాలను భరించాలి, అన్నది ఆ పుస్తక రచయిత అభిప్రాయం. మనం చేసే ప్రతి దాన్ని ప్రేమించాలి. దానివల్ల వచ్చే ఫలితం మంచైనా, చెడైనా! మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి అంటాడు. పాజిటివ్ థింకింగ్ వల్లనే అది సాధ్యం. * ఇది రాస్తున్నప్పుడు నా కారు కవర్ పిల్లి చించేసి ముక్కలు ముక్కలు చేసింది. అసలే లాక్ డౌన్, మంచి కవరు. పిల్లి మీద నాకు కోపం వచ్చింది, కొత్త కవర్ కొనాలి కదా. రెండు నిమిషాలు ఫీల్ అయ్యాను. నేను రాసిన ఆర్టికల్ లో విషయం అదే కదా? అప్పుడు నాకు అనిపించింది. కొత్త కవర్ కొనాలని చాలా రోజుల నుంచి వాయిదా వేస్తూ వచ్చాను, ఇప్పుడు పిల్లి కవర్ చించేయటం వల్ల కొత్త కవర్ కొనవలసి వస్తుంది. తప్పదు మరి. అనవసరమైన ఖర్చు! కానీ పాజిటివ్ గా ఆలోచిస్తే పిల్లి కవర్ చించేయడం వల్ల కొత్త కవర్ కొనుక్కో గలుగుతాను కదా! పిల్లికి ధన్యవాదాలు! ఇదే మరి పాజిటివ్ థింకింగ్ అంటే!!!
(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)