నిజానికి ఆలోచనల్లో పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అంటూ ఉండవు. చూసే దృష్టిలో, అర్థం చేసుకునే విజ్ఞతలో ( సింపుల్ కామన్ సెన్స్) తేడాయే పాజిటివ్ థింకింగ్. ఒకదాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు లేదా నెగిటివ్ గా తీసుకోవచ్చు. అది మనలో ఉంటుంది.
ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక తాగుబోతుకి ఇద్దరు కొడుకులు. తాగుబోతు రోజు తాగి వచ్చి ఇంట్లో నానా గొడవ చేసేవాడు. భార్య మీద చేయి కూడా చేసుకునే వాడు. ఆయన స్నేహితుడు అప్పు డప్పుడు ఇది చూసి బాధపడేవాడు. కొన్నాళ్ళకు ఆ తాగుబోతు చనిపోయాడు. ఆ స్నేహితుడు తాగుబోతు ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని ఆసక్తితో పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. పెద్ద కొడుకు తాగుబోతు తండ్రిలాగే తాగి ఇంటికి రావడం, భార్యమీద చేయి చేసుకోవడం చూసి. ” ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఎందుకు ఇలా తయారయ్యావ్?” అని అడిగాడు. దానికి వాడు ” ఇదంతా మా నాన్న వల్లనే. ఆయనను చూసి చూసి నేను ఇలా తయారయ్యాను” అని కోపంగా సమాధానమిచ్చాడు.
తర్వాత ఫ్రెండు చిన్న కొడుకు ఎలా ఉన్నాడో అన్న ఆసక్తితో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాడు ఆ ఫ్రెండ్ ని చూసి ఆప్యాయంగా పలకరించి, భార్య పిల్లలకీ ఆయనను పరిచయం చేసి ” నేను ఆఫీసు నుంచి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం” అని ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
ఫ్రెండు రాత్రి వాడు వచ్చేదాకా ఆసక్తితో ఎదురు చూశాడు. వాడు తాగకుండా మామూలుగా వచ్చాడు. తాగుబోతు ఫ్రెండుని భోజనానికి ఆహ్వానించి చక్కగా మాట్లాడి ఎంటర్టైన్ చేశాడు.
అప్పుడు తాగుబోతు ఫ్రెండు వాళ్ళ అన్న గురించి వీడికి చెప్పాడు. “వాడు అలా తయారు కావడానికి మీ నాన్న కారణమంట, మరి నువ్వు ఇలా తయారవ్వడానికి ఏంటి కారణం?” అని అడిగాడు. దానికి వాడు నవ్వి ” దీనికి కూడా మా నాన్నే కారణం! ఆయనను చూసి చూసి నేను ఆయనలా కాకూడదని నిర్ణయించుకున్నాను!” అన్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే.
ఇద్దరి పరిస్థితులు, నేపథ్యం ఒకటే అయినా, ఒకడు ఒక రకంగా( నెగిటివ్ గా) అర్థం చేసుకుంటే, ఇంకొకడు ( పాజిటివ్ గా) తీసుకున్నాడు. అంతే! ఇది వ్యక్తిగత జీవితానికి, వ్యాపారానికి , మానవ సంబంధాలకి, దేనికైనా అవసరం.
ఇంకో ఉదాహరణ చూద్దాం
ఇద్దరు యువ సేల్స్ మెన్ కలిసి వ్యాపార నిమిత్తం ఒక ద్వీపానికి వెళ్లారు. ఇద్దరూ వేరే వేరే చెప్పుల కంపెనీలకి ప్రతినిధులు. ద్వీపానికి వెళ్ళాక చూస్తే, అక్కడ ఎవరూ బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకో కుండా ఉత్త కాళ్లతో తిరుగుతున్నారు! దాంతో ఒక సేల్స్ మన్ కీ నీరసం వచ్చేసి, ” ఇక్కడ ఎవరూ బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకోవడంలేదు. సరుకు పంపించవద్దు” అని కంపెనీకి సందేశం పంపాడు.
రెండో సేల్స్ మెన్ కూడా తన కంపెనీకి సందేశం పంపాడు. అది ఇలా ఉంది, ” ఇక్కడ ఎవరూ బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకోవడంలేదు. వెంటనే సరుకు పంపించండి!!” ఇద్దరిలో ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్ అని చెప్పాల్సిన అవసరం లేదు!
ఒక తత్వవేత్త సోక్రటీస్ గురించి తెలియని వారుండరు. ఒకసారి ఇంట్లో తన శిష్యులతో మాట్లాడుతుండగా, లోపలి నుంచి భార్య ఒకటే గొణుగుడు మొదలు పెట్టింది. సోక్రటీస్ మాత్రం పట్టించుకోకుండా శిష్యులతో మాట్లాడుతుంటే, వాళ్లు మాత్రం భయం భయంగా కూర్చుని ఉన్నారు కాసేపటి తర్వాత సోక్రటీస్ భార్య కుండతో నీళ్ళు తెచ్చి ఆయన తలపై న కుమ్మరించింది! శిష్యులు బిక్కచచ్చి పోతే, సోక్రటీస్ నవ్వుతూ ” అన్ని ఉరుముల తర్వాత వర్షం పడటం సహజమే కదా!!” అని చెప్పాడు.
వాట్ ఏ … పాజిటివ్ థింకింగ్!!
సెన్సాఫ్ హ్యూమర్ ఒక పాజిటివ్ లక్షణం. ఉన్నత స్థాయికి ఎదిగిన ఏ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.. పైన చెప్పిన ఉదాహరణ సోక్రటీస్ ఉన్నత స్థాయి సెన్సాఫ్ హ్యూమర్ కి తార్కాణం.
(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు.ఫోన్ – 9393737937)