ఇండియా కరోనా కేసుల్లో తెలుగు రాష్ట్రాల వాటా పెరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న భారత కరోనా కేసుల్లో తెలుగు రాష్ట్రాల వాటా బాగా ఉందని కేంద్రం ప్రకటించింది. గురువారం నాటికి దేశంలోకి కరోనా కేసులు 7,67,296కు చేరింది. నిన్న ఒక్క రోజు 24, 897 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇందులో 75 శాతం కేసులు కేవలం ఏడు రాష్ట్రాలనుంచే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రాలు : మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ .
తాజాగా ఆంధ ప్రదేశ్ విడుదల చేసిన కరోనా బులెటీన్ ప్రకారం గత 24 గంటలలో 1555 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరణించిన వారు 13 మంది. ఈ రోజుతో మొత్తం కోవిడ్ కేసులు 23,814 కుచేరాయి. యాక్టివ్ కేసులు 11,383. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజు 1924 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 28,536 కు చేరాయి. రెండు రాష్ట్రాలలో గత 24 గంటలలో 3424 కేసులు నమోదయ్యాయి. ఇండియా మొత్తం నమోదయిన కేసులలో 14 శాతం కేసులు తెలుగురాష్ట్రాలనుంచే వస్తున్నాయి.
ఇప్పటికే భారత దేశం ప్రపచంలో కరోనా కేసుల్లో మూడోస్థానానికి వచ్చింది. ఈ ఉదయం ఎనిమిదిగంటలకు మరొక 487 కరోన మరణాలు సంభవించడంతో మొత్తం మరణాలు 21,129కి చేరుకున్నాయి. 24,879 కొత్త కేసులు నమోదయ్యాయి. అయినా సరే,ఇదేమంత ఆందోళనకరమయిన విషయం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ అన్నారు.
ఈ ఉదయం కరోనా వివరాలు విడుదల చేస్తూ భారతదేశంలో మిలియన్ జనాభాలో కరోనా కేసులు కేవలం 538 మాత్రమేనని, అంతర్జాతీయ సగటు 1,453 కేసులు అని ఆయన చెప్పారు. భారతదేశంలో రోగంనుంచి కోలుకుంటున్న (రికవరీ) వారి సంఖ్య 62.08 శాతం ఉందని ఆయన చెప్పారు. అయితే, భారతదేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని, దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా అది కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కాలేదని ఆయన వివరించారు