బాలివుడ్ నవ్వుల జలపాతం “సూర్మా భోపాలి” వెళ్ళిపోయాడు

(సిఎస్ సలీమ్ బాషా)
సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ(81) మనల్ని వదిలి( జూలై 8, 2020) వెళ్ళిపోయాడు అని చెప్తే ఎవరికి అర్థం కాదు. కాని షోలే సిన్మాలో ” సూర్మా భోపాలి” అని చెప్తే మాత్రం, అరే “జగ్ దీప్” చనిపోయాడా అనుకుంటారు. ఆ పాత్రను అజరామరం చేసిన హాస్యనటుడు జగ్ దీప్. హిందీలో జగ్ దీప్ అంటే “జగానికి వెలుగు” అని అర్థం.
400 వందల పైచిలుకు సినిమాల్లో తనదైన డైలాగ్ డెలివరీ తో హాస్యాన్ని పండించిన జగ్ దీప్ తొమ్మిది ఏళ్ళ వయసులో డబ్బుల కోసం, బీ.ఆర్.చోప్ర “అఫ్సానా” (1951) సినిమాతొ సినీ రంగంలో అడుగు పెట్టాడు. ఎన్నో పాత్రలు చేసినప్పటికి, షోలే లో చేసిన సూర్మా భోపాలి పాత్రతో చిరస్మరణీయుడయ్యాడు. తన కట్టెల అడితిలో కట్టెల కోసం వచ్చిన వారికి  జై, వీరూలను (ధర్మేంద్ర, అమితాబ్) ఎలా చితక్కొట్టింది కథలు చెప్పటం, వాళ్ళు వచ్చినప్పుడు మాట మార్చటం వంటివి రాయటం కన్నా చూస్తేనే మజా!

కేవలం ముఖ కవళికల తో, తనదైన మార్కు డైలాగ్ డెలివరీతో ఆశయాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన జగదీప్ రాంసే సోదరులు తీసిన కొన్ని హారర్ సినిమాలు కూడా నటించడం విశేషం.
ఫిజికల్ కామెడీ లో కూడా జగదీప్ ది అందె వేసిన చేయి. చాలా మంది హాస్యనటుల కీ జగదీప్ ఆదర్శం. ముఖ్యంగా అతనిలాగే ముఖకవళిక లతో హాస్యాన్ని పండించిన జానీ లీవర్ కు జగదీప్ అంటే అభిమానం. జానీ లీవర్ తన మొదటి సినిమాలోనే (ఏ రిష్తా నా టూటే లో ) జగ్ దీప్ తో నటించడం తన అదృష్టం అని చెప్పాడు.
డైలాగుల్లో వేగానికి, కామెడీ టైమింగ్ జగ్ దీప్ పెట్టింది పేరు. తను నటించిన పాత్రలతో హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన వాడు. దో భీగా జమీన్, ఆర్ పార్, ఖిలోనా, తీన్ బహురాణీయా, వంటి చిత్రాలు జగ్ దీప్ తరహా కామేడీ కి నిదర్శనాలు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం లో అందాజ్ అప్నా అప్నా(1994) సినిమాలో సల్మాన్ ఖాన్ తండ్రి గా జగ్ దీప్ పాత్ర మరుపురానిది.
షోలే లో తాను వేసిన ” సూర్మా భోపాలి” పాత్ర పేరు తోనే ఒక సినిమా (1980) దర్శకత్వం వహించిన జగదీప్ అందులో చిన్న వేషం వేశాడు. ధర్మేంద్ర, అమితాబ్ రేఖ వంటి మహామహులు ఆ సినిమాలో నటించడం విశేషం!
జానీ వాకర్, మహమూద్ ల తరానికి చెందిన జగ్ దీప్ అమితాబ్ కు కూడా ఫేవరైటే! అతని మాటల్లో చెప్పలంటే ” జగ్ దీప్ ది ఒక ప్రత్యేకమైన శైలి. షోలే, షహన్ షా సినిమాల్లో అయనతో నటించటం నాకు దక్కిన గౌరవం.”

 

హమ్ పంచి ఏక్ డాల్ కే (1957)లో ఆయన నటన చూసి మురిసిపోయిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.  ఆయన మొదటి చిత్రం అఫ్సానా. ఇందులో మాటలు లేని బాల నటుడు జగదీప్. అయితే, ఉర్దూని స్వచ్ఛంగా పలికే శక్తి ఉండటంతో ఆయన తొందరగా సినిమాల్లో మాట్లాడే పాత్రలొచ్చాయి.
 జగ్ దీప్ అయిదు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అందులో 1957లో వచ్చిన  Bahar సూపర్ హిట్ అయింది. ఇందులో హీరోయిన్ నందా. ఇదొక 1949లో వచ్చి కులదైవం అనే మరొక సూపర్ హిట్ తమిళ సినిమా రీమేక్. ఇది ఈ సినిమాలో హీరోయిన సౌత్ ఇండియాన్ హీరోయిన్ లాగ లంగా వోణీ వేసుకుని ఉండటం మీరు చూడవచ్చు. ఇదిగో వీడియో.
జగ్ దీప్ కుమారుడు జావేద్ జాఫ్రీ కూడా బాలీవుడ్ నటుడే. భార్య నలుగురు సంతానాన్ని వదిలి వెళ్ళిన జగ్ దీప్ తనతో పాటు జానీ వాకర్, మహమూద్ ల టైప్ కామెడినీ కూడా పట్టుకెళ్ళిపోవటం కాస్త విషాదకరమే!
మళ్ళీ అమితాబ్ మాటల్లోనే చెప్పాలంటే” మనం మరో ఆణిముత్యాన్ని పోగొట్టుకున్నాము”