తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కమల్ రెడ్డి ని కరోన కష్టాలు వెంటాడుతున్నాయి. విధి నిర్వహణలో భాగంగా ఓ రాజకీయ నేత కార్యక్రమ కవరేజీకి వెళ్లి ఆయన, కుటుంబం కరోనా బారిన పడినట్లు సమాచారం అందింది..
ఆ తర్వాత పరిణామాల్లో ఆ రాజకీయ నేతకు కరోనా పాజిటివ్ గా తేలడంతో అనుమానం వచ్చిన జర్నలిస్టు తాను కూడా స్వచ్చందంగా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.
రెండు రోజుల క్రితం రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఇక అప్పటి నుండి ఆ జర్నలిస్టు కుటుంబంలో మొదలైన కరోనా కష్టాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పాజిటివ్ విషయం తెలుసుకున్న భద్రాచలం ప్రభుత్వ వైద్యులు కమల్ ఇంటికి వచ్చి కొన్ని మందులు ఇచ్చి ఇంటి వద్దనే ఉండమని సూచించారు.
సాయంత్రానికి కమల్ భార్య, రెండేళ్ల కూతురుకు జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన జర్నలిస్టు తమ కుటుంబంలోని మిగిలినవారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించాలని అధికారులకు విన్నవించాడు.
ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. రెండు రోజులు గడుస్తున్నా స్థానికంగా స్పందన లేకపోవడంతో కుటుంబాన్ని తీసుకుని వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు.
మాములు పేషెంట్ కాకపోవడంతో ప్రభుత్వం పంపే అంబులెన్స్ కోసం ఆదివారం ఉదయం నుండి ఎదురుచూసాడు. రాత్రి సమయానికి వచ్చిన అంబులెన్స్ లో తన భార్య, కుతురు గుండెజబ్బుతో బాధపడుతున్న తండ్రిని తీసుకుని భారీ వర్షంలో బయల్థేరాడు.
అంబులెన్స్ కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ దగ్గరకు రాగానే టైర్ పంక్చర్ కావడంతో ఆగిపోయింది. అర్థరాత్రి వర్షంలో ఏంచేయాలో తెలియక అంబులెన్స్ ను తాత్కాలికంగా మరమత్తులు చేసుకుని సమీపంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు.
సోమవారం ఉదయం అధికారులు వచ్చి భార్య,కుతురుకి కరోనా టెస్టులు చేయాల్సి ఉన్నందున వారిని కొత్తగూడెంలోనే ఉంచి, పాజిటివ్ వచ్చిన కమల్ ను హైదరాబాద్ వెళ్లాల్సిందిగా కోరారు.
ఓవైపు చిన్నారి కూతురు, భార్య మరోవైపు గుండె జబ్బుతో బాధపడుతున్న తండ్రిని అక్కడే వదిలేసిన కమల్ హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి భారంగా బయల్థేరాడు.
మరి మన తోటి జర్నలిస్టు సోదరుడు చికిత్స కోసం మరికొద్ది సేపట్లో గాంధీ ఆస్పత్రికి చేరుకుంటాడు. ఆయనకు మెరుగైన వైద్యం అందేలా తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా కుటుంబం చెంతకు చేరేలా ప్రతీ ఒక్కరూ ఈ మెసేజ్ ప్రభుత్వ పెద్దలకు చేరే వరకూ షేర్ చేయండని జర్నలిస్టులు కోరుతున్నారు.