కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలి. ప్రస్తుతమున్న 519.6 మీటర్ల ఎత్తును 524.2 మీటర్లకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం పంపినట్టు కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోలి స్వయంగా ప్రకటించారు. భూసేకరణకు 32 వేల కోట్లతో, మొత్తం 61 వేల కోట్ల అంచనాతో ఎత్తు పెంచే పనులు వేగవంతం చేసే ఆలోచనతో కర్ణాటక ప్రభుత్వం ఉన్నది.
ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి, అవసరమైతే కేంద్రానికి పిర్యాదు చేయాలి.
ఆల్మట్టి ఎత్తు ఒకేసారి 519.6 మీటర్ల నుండి 524.2 మీటర్లకు, అంటే 4.6 మీటర్లు పెంచడం వలన ఇప్పుడు వాడుతున్న 173 టీఎంసీల నీరు కాక 303 టీఎంసీలు వాడుకోవొచ్చు. తద్వారా దిగువనుండే తెలంగాణకు రావాల్సిన 130 టీఎంసీలు కర్ణాటక వాడుకోనుంది.
గతంలో “ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూర్” చాలా స్పష్టంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా, ఆల్మట్టి ఎత్తు 518.7 మీటర్లు సరిపోతుంది అని నివేదిక ఇవ్వడం జరిగింది.
ఎత్తు పెంపు వల్ల దిగువనుండే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు ఎగువనుండే మహారాష్ట్రకు కూడా నష్టం వాటిళ్లనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం, నీటి నిల్వ పెంచడం వల్ల మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా, సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాలకు వరద ముంపు ప్రమాదం ఉంది.
ఎగువన ఆల్మట్టి ద్వారా, దిగువన పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి ప్రేక్షకాపాత్ర పోషించడం విడ్డూరం.
తక్షణమే అఖిలపక్షం పిలిచి సంఘటితంగా కర్ణాటక ఎత్తుగడలను తిప్పికొట్టాలి.