గత మూడేళ్లుగా పలు రాష్ట్రాలలోని ఓబీసీల వెలివేత, సాధికారిత, ఆధునీకరణపై నా ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతోంది. మండల్ కమిషన్ అమలు ద్వారా ఉద్భవించిన సామాజిక ఉద్య మం భారత పాలక వర్గం ఓబీసీ వ్యతిరేకతను బయలుపర్చింది.
కేంద్ర సర్వీసులలో 1993 వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. కేంద్రీయ విద్యా సంస్థలలో 2008 వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న మండల్ కమిషన్ దాని ఛైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్ 97వ జయంతి సందర్భంగా ఈ కింది పరిశీలన.
బీహార్ ప్రభుత్వం 1990 నుంచి ఆగస్తు 25 మండల్ జయంతిని ‘డే ఆఫ్ స్టేట్ హానర్’ (Day of State Honor) గా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బిదేశ్వర్ ప్రసాద్ మండల్ని మిసయ్య ఆఫ్ సోషల్ జస్టిస్‌గా పరిగణిస్తున్నారు. జూన్ 1, 2001న మండల్ జ్ఞాపకార్థం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేసింది.
బీపీ మండల్ ఆగస్టు 25 1918 మొరో ప్రాంతంలో (బీహార్ రాష్ట్రం) రాస్బీహారీలాల్ మండల్ అనే జమిందార్, సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబంలో జన్మించారు.
అయితే కులం, మతత్త్వాన్ని రాస్‌బీహారీ మండల్ పూర్తిగా వ్యతిరేకించారు. సంఘ సంస్కర్తగా అంటరాని తనం సతీసహగమనం, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, మద్య పానం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రాస్బీహారీలాల్ మొదటి కొడుకు భువనేశ్వరీ ప్రసాద్ మండల్ 1922లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
రెండో కొడుకు కమలేశ్వరీ ప్రసాద్ మండల్ 1936లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చివరివాడైన బీపీ మండల్ 23వ ఏటనే జిల్లా కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. 1945-1951 మధేపురా డివిజన్లో జీతం తీసుకోకుండానే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పని చేశారు.
మొదటిసారిగా 1952లో బీపీ మండల్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి పాండే మిథిలా యూనివర్శిటీగా నామకరణం చేసే ప్రతిపాదనతో అటెండర్ నుంచి వీసీ వరకు ఒకే కులానికి చెందిన వారిని నియమించే స్పృహను వ్యతిరేకించారు.
బీపీ మండల్ ప్రత్యర్థి అయిన కెకె మండల్ మాట్లాడుతూ బీహార్ రాజకీయ చరిత్రలో నిర్భయంగా మాట్లాడటంతోపాటు నిజాయితీ, నిబద్ధత గల అతి కొద్ది మంది నాయకులలో బీపీ మండల్ ఒకరని కొనియాడారు. బీహార్ శాసనసభలో అధికార స్థానంలో కూర్చున్న బీపీ మండల్ పామా గ్రామాంలో కుర్మీలపై రాజ్‌పుత్ భూస్వాములు దాడులు చేయడాన్ని నిరసించారు.
అధికార స్థానంలో ఉంటూ బీపీ మండల్ వెనుకబడిన తరగతులపై జరుగుతున్న పోలీస్‌ల అరాచకాలను ప్రశ్నించడాన్ని అప్పటి ముఖ్యమంత్రి తప్పుపట్టారు. దీంతో అధికార స్థానాన్ని వదలి పెట్టి ప్రతిపక్ష స్థానంలో కూర్చొని పోలీస్‌ల అరాచకాలు, దాడులను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
బీపీ మండల్ వ్యక్తిత్వాన్ని గమనించిన లోహియా సంయుక్త సోషలిస్ట్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవి చేపట్టడానికి ఆహ్వానించారు. ఏడుగురు సభ్యులుగల పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు బీపీ మండల్ నాయకత్వంలో 1967లో జరిగిన ఎన్నికల్లో 69 ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు ఎంపీగా కొనసాగుతూనే మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీగా పార్లమెంట్‌కు రావాల్సిందిగా మండల్ని లోహియా ఆదేశించారు. అప్పటికే పార్లమెంటరీ సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నా.
లోహియా నియంతృత్వ ధోరణి బీపీ మండల్‌కి నచ్చలేదు. దీంతో లోహియా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రిగానే కొనసాగారు. 1967 మార్చి 5న సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ) అనే పేరుతో పార్టీని స్థాపించాడు.
ఫిబ్రవరి 1, 1968 రోజున బిందేశ్వరీ ప్రసాద్ మండల్ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ బీపీ మండల్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చింది. ఆ సమయంలోనే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమిషన్ విచారణ జరిగింది.
కమిషన్ నివేదికను బుట్ట దాఖలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ బీపీ మండల్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా బీపీ మండల్‌కి ఫోన్ చేశారు. అయితే ఫోన్లో ఆమెతో మాట్లాడటానికి మండల్ నిరాకరించారు. ఏ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్ణయం తీసుకోవడంతో బీపీ మండల్ ప్రభుత్వం శాసనసభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చింది.
1974లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో వచ్చిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమెర్జెన్సీ తర్వాత ఏర్పాటైన లోక్‌సభలో ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని బీపీ మండల్ వ్యతిరేకించారు.
రాజ్యాంగంలో ఓబీసీలు ఎవరు అనేదానికి సరైన సరైన నిర్వచనం ఇవ్వకపోవడంతో కాకా కాలేల్కర్ ఆధ్వర్యంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను 1953లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1955లో కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ నెహ్రు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ రిజర్వేషన్లను అమలుకు నిరాకరించింది. దాంతో ఓబీసీల రిజర్వేషన్లకై రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతకు కేంద్రం వదలివేయడం జరిగింది. రాష్ట్రాలలో ఏర్పాటైన బీసీ కమిషన్ల ఓబీసీ సిఫార్సులను కోర్టులలో పలుమార్లు కొట్టివేయడం జరిగింది. కులమా, వర్గమా అన్న నిర్వచనంలో ఓబీసీలు నలిగిపోయారు. కులం, వర్గ నిర్వచనంలో భాగంగా ఉంటే కులాన్నే వర్గంగా పరిగణించొచ్చని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కులం/వర్గం చర్చకు మండల్ కమిషన్ తెరదించడం జరిగింది.
జనవరి 1, 1979 రోజున రెండో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఛైర్మన్‌గా బిందేశ్వరీ ప్రసాద్ మండల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 31, 1980న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
1990 ఆగస్టు 7న భారత ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ పార్లమెంట్లో మండల్ కమిషన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మండల్ కమిషన్ నివేదికలోని కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 27 శాతం రిజర్వేషన్ల అమలును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది.
ఎల్కే అద్వానీ నాయకత్వంలో ఉద్యమం ముందుకొచ్చింది. నెహ్రు మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వరకు ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. అటు బీజేపీ ఎల్కే అద్వానీ నాయకత్వంలో ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కమండల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది.
కమ్యూనిస్టు పార్టీలు కూడా లోక్‌సభలో మద్దతుగా మాట్లాడినా సంస్థపరంగా ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు విముఖంగానే ఉన్నారు.
ఇదే సమయంలో మొదటిసారిగా భారత దేశంలో కింది స్థాయి సామాజిక వర్గాలు (ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఏకమై ఒకతాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ మండల్ ఉద్యమాన్ని ముందుకు తెచ్చారు. జనతాదళ్‌లోని బీసీ సామాజిక వర్గానికి చెందిన రాంవిలాస్ పాశ్వన్, శరద్‌యాదవ్, లాలుప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ వంటి నాయకులు రిజర్వేషన్లను బలపరుస్తూ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
బహుజన సమాజ్‌వాదిపార్టీ కాన్షిరాం నాయకత్వంలో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆరక్షన్ లాగు కరో, వర్ణ కుర్సీ ఖాళీ కరో… నినాదాన్ని బీఎస్పీ ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఓట్సే లేయేంగే సీఎం, పీఎం.. ఆరక్షన్ సే లేయేంగే డిఎం, జీఎం… అనే నినాదంతో బీఎస్పీ కింది స్థాయి సామాజిక వర్గాలను చైతన్యపరిచింది.
రిజర్వేషన్లను అమలు చేస్తున్న క్రమంలో జనతాదళ్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు బతుకు దెరువుకోసం కాదు.. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్నపోరాటంగా వర్ణించారు. మండల్ కమిషన్ అమలు ఆత్మగౌరవానికి సంబంధించిందేగానీ, పేదరికానికి సంబంధించింది కాదని అన్నారు.
వీపీసింగ్ మెరిట్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనా, అభివృద్ధిలో రంగాల్లో కావాల్సింది సోషల్ మెరిట్ … అన్నారు. సీపీఐ సీనియర్ నేత సోమనాథ్ ఛటర్జీ మండల్ కమిషన్ అమలుపై మాట్లాడుతూ మేం కులానికి వ్యతిరేకం కాదు.. కులం ఆధారంగా ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే విధానాలకు వ్యతిరేకమన్నారు. ఈ రోజు అత్యధికంగా కింది స్థాయి వర్గాలు సామాజిక, విద్య, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారన్నది చారిత్రక సత్యం.
సీపీఐ నాయకుడు ఇంద్రజిత్ గుప్త మాట్లాడుతూ 52 శాతం ఉన్న ఓబీసీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.5 శాతం మాత్రమే భాగస్వామ్యం ఉండటం చాలా అన్యాయంగా.. చెప్పడం జరిగింది . పాలనా వ్యవస్థ సామాజిక అధికార చట్రంలో ఘనీభవించింది అని వీపీసింగ్ వాపోయారు.
మొట్టమొదటిసారిగా 1993 కేంద్ర సర్వీసులలో (ఐఏఎస్, ఐపీయస్, ఐఎఫ్ఎస్), 2008లో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది.
మండల్ కమిషన్ కేవలం రిజర్వేషన్లు మాత్రమేగాకుండా 40 సిఫార్సులు, సూచనలు చేసింది. 52 శాతంగా ఉన్న ఓబీసీ జనాభాకు 27 శాతం రిజర్వేషన్ అమలుతోపాటు ప్రమోషన్లలో అదే విధానాన్ని పాటించాలని సూచించింది. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ప్రయివేట్ రంగ సంస్థలలో కూడా రిజర్వేషన్ల అమలుకు సిఫార్సు చేసింది. అయితే మిగిలిన 39 సిఫార్సులను ఏ ప్రభుత్వమూ సామాజిక న్యాయ స్పృహతో పట్టించుకోలేదు.
విద్యాపరమైన అంశాన్ని చర్చిస్తూ.. నిరక్షరాస్యత, పాఠశాల హాజరుపడిపోవటాన్ని దృష్టిలో పెట్టుకొని కల్చరల్ ఎన్విరాన్మెంట్ని మెరుగు పరుస్తూ వయోజ విద్యను, ఆశ్రమ పాఠశాలలను పెద్ద ఎత్తున గ్రామాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని కమిషన్ సిఫార్సు చేసింది.
ఆర్థిక సహాయం గురించి చర్చిస్తన్నప్పుడూ.. సామాజికవర్గాల వృత్తులు పారిశ్రామీకీకరణ వలన పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. వారిని ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యాపార, పారిశ్రామికంగా ఓబీసీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేసింది. ఓబీసీలలో ఎంటప్రిన్యూర్స్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కమిషన్ సూచించింది.
వ్యవస్థాగత మార్పులను సూచిస్తూ ప్రగతిశీల భూసంస్కరణల ద్వారా ఉత్పత్తి సంబంధాలలో మౌలికమైన మార్పులకు తోడ్పడాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. మత్య్సకారుల్లాంటి సామాజిక వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
ఓబీసీలకు కేంద్ర కేబినెట్లో ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేయాలని, అన్ని రకాల ఆర్థిక వనరులను రాష్ట్రాలకు కేంద్రమే చేకూర్చాలని సిఫార్సు చేయడం జరిగింది.
పేదరిక నిర్మూలన సమస్యను గుర్తిస్తూ… అతి పెద్ద జాతీయ సమస్య సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనమేనని మండల్ కమిషన్ చెప్పడం జరిగింది.
చరిత్రలో ఛత్రపతి సాహు మహరాజ్ కొల్హాపూర్ రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థ ఒకే కుల వ్యవస్థగా ఉండటాన్ని నిరసిస్తూ 50 శాతం బ్రాహ్మణేతరులకు 1902 జులై 6న మొదటిసారి రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. బ్రాహ్మణ సామాజికవర్గంతో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తిలక్ కూడా రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు.
బ్రాహ్మణేతరులు చదువుకొని చట్ట సభల్లోకి వచ్చి నాగళ్లు దున్నుతారా అని తిలక్ ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆధిపత్య సామాజికవర్గాల ఆలోచనలో ఎలాంటి మార్పు రాకపోవడం భారత దేశ సామాజికవర్గాల వెనుకబాటు తనానికి నిదర్శనం.
సామాజిక వెనుకబాటు తనంపై ఓబీసీ వర్గాల మెదళ్లల్లో యుద్ధం జరగాల్సిన అవసరం ఉందని మండల్ కమిషన్ పిలుపునిచ్చింది.
(ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, హైదరాబాద్)