తెలంగాణ అసెంబ్లీ చీఫ్ రిపోర్టర్ గా బేతి వీరారెడ్డి పదోన్నతి పొందారు. అసెంబ్లీ రిపోర్టర్ గా 25 ఏళ్ళ పాటు సర్వీస్ చేసిన ఆయన… బుధవారం అసెంబ్లీ చీఫ్ రిపోర్టర్(డిప్యూటీ సెక్రటరీ కేడర్) గా ప్రమోషన్ తీసుకున్నారు. తనకు ప్రమోషన్ రావడం సంతోషంగా ఉందన్నారు వీరారెడ్డి. పాతికేళ్ల తన సర్వీసు ఎన్నో అనుభవాలను, అనుభూతులను ఇచ్చిందన్నారు. తన గతాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ… అసెంబ్లీ రిపోర్టర్ గా తన కార్యాచరణ, రాజకీయ నాయకులతో తనకున్న సత్సంబంధాలు, స్టెనోగ్రఫీలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఇలా పలు అంశాలపై ఆయన ట్రెండింగ్ తెలుగు న్యూస్ తో ముచ్చటించారు.
వీరారెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లాలోని దొమ్మాట గ్రామం. తల్లిదండ్రులు బేతి నరసింహారెడ్డి, బేతి వెంకట లక్ష్మి. వీరి నలుగురి సంతానంలో ఆఖరి సంతానం వీరారెడ్డి. మహాత్మా గాంధీ కాలేజీ నుండి బిఏ., ఎల్ ఎల్ ఎం పూర్తి చేసారు వీరారెడ్డి. 1993 లో ఈయనకు శైలజతో వివాహం ఐంది. వీరికి ఇద్దరు కవలలు. ఇప్పుడు వారు విదేశాలలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీ రిపోర్టర్ గా ఉద్యోగ బాధ్యతలు
జులై 1995 లో గ్రూప్ 1 కేడర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించారు వీరారెడ్డి. ఎన్నో సంచలనాత్మక బిల్లుల ఆమోద సమయంలో తాను కూడా సభలో ఉండడం మంచి అనుభూతిని కలిగిస్తోందన్నారు.
రాజకీయ నాయకులతో పరిచయాలు
వృత్తి రీత్యా ఎందరో రాజకీయ నేతలను నేరుగా కలిసే అవకాశం లభించిందని, పరస్పర సహకారం ఉండేదని తెలిపారు. తమ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు వారితో ప్రస్తావించేవాడినని, వారు కూడా సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపేవారని తెలిపారు.
కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష
స్పీకర్ పోడియంలో కేవలం మాకు ఒక మీటర్ దూరంలోనే కెసిఆర్ ఉంటారు. ఆయన స్పీచ్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. ఆయనకి గాడ్ గిఫ్ట్ టాలెంట్ అనుకోవచ్చు. ప్రతి విషయంపై ఆయన సంపూర్ణ అవగాహనతో మాట్లాడతారు. పశుసంరక్షణ శాఖకు మంత్రి కావాలని ఎవరూ కోరుకోరు. కానీ అందులో ఉన్న సేవాదృక్పథం గురించి, ఈ శాఖలో అతి తక్కువ ఖర్చుతో ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందో కేసీఆర్ వివరించాక ఆ శాఖకు మరింత గౌరవం పెరిగింది అన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కొనియాడారు వీరారెడ్డి.
హరీష్ రావు గురించి తెలిసాక షాక్ అయ్యాను
హరీష్ రావు నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కష్టం అని ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే వారి దగ్గర వాలిపోతారు. స్వయంగా ఆయనే వారి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తారు. రోజుకి ఆయన కొన్ని వందల కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. ప్రజలతో కలిసిపోయి పని చేస్తారు. శత్రువులని కూడా మిత్రులుగా మార్చుకోగల సమర్ధుడు ఆయన. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగల వ్యక్తి హరీష్ రావు. ఆపద అని అర్ధరాత్రి కాల్ చేస్తే తానే వాహనం నడుపుకుంటూ బాధితుల దగ్గరికి వెళ్లి సహాయం చేసే గొప్ప గుణం ఆయనది. ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. హరీష్ రావుని నేను ఆదర్శంగా తీసుకుంటాను అంటారు వీరారెడ్డి.
వైఎస్సార్ తో బ్రేక్ ఫాస్ట్
వృత్తిరీత్యా రెండు మూడు సార్లు వైఎస్సార్ ఇంటికి వెళ్ళాను. బంధువులను ఎలా రిసీవ్ చేసుకుంటారో అలానే వైఎస్సార్ నన్ను ట్రీట్ చేసారు. పేరు పెట్టి పిలిచి మరీ లోనికి ఆహ్వానించారు. ఆయన ముందు కూర్చోవడానికి ఇబ్బంది పడ్డాను. కానీ నేను కుర్చీలో కూర్చునే వరకు ఆయన ఊరుకోలేదు. ఆయన పక్కనే కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేయడం ఇప్పటికీ మరపురానిది. ఆయన సింప్లిసిటీనే ఆయనకు అంత పాపులారిటీని తెచ్చిపెట్టిందని నేను నమ్ముతాను అని ట్రెండింగ్ తెలుగు న్యూస్ కి తెలిపారు వీరారెడ్డి.
స్టెనోగ్రఫీ శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలు
ఈ విభాగంలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. 10వ తరగతి పూర్తి చేసుకున్న వెంటనే శిక్షణ ప్రారంభిస్తే డిగ్రీ పూర్తయ్యేసరికి అందులో మంచి నిష్ణాతులవుతారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రయివేట్ సెక్టార్లలో ఈజీగా ఉద్యోగం లభిస్తుంది. తొలినాళ్లలోనే నెలకు 30 వేల వరకు జీతం ఉంటుంది. డిగ్రీ పూర్తయ్యాక స్టెనోగ్రఫీ నేర్చుకోవాలి అనుకునేవాళ్లు రెండేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ అంటున్నారు వీరారెడ్డి.
అసెంబ్లీ రిపోర్టర్ల డ్యూటీస్, వీరారెడ్డి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పూర్తి అంశాలు వీరారెడ్డి ఇంటర్వ్యూ పార్ట్-2 త్వరలో…