శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జూన్ 25 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ముఖ మండపంలో జూన్, 25, 26, 27వ తేదీలలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
అదేవిధంగా రాత్రి 7.00 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వామివారిని మొదటిరోజు పెద్దశేష వాహనంపై, రెండో రోజు హనుమంత వాహనంపై, మూడో రోజు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.
జూన్ 28న పార్వేట ఉత్సవం :
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 28వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఏకాంతగా ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం, వాహన సేవలు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
జూన్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం :
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.