కర్నూలు: రాయలసీమ అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
స్థానిక కర్నూలు నగరంలోని శశికాంత్ ప్లాజా నందు రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ ప్రాజెక్టుల నిర్మాణం , విశ్వవిద్యాలయ అభివృద్ధి పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్, కోకన్వీనర్ ఆకుమల్ల శ్రీధర్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవిన్ రాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎద్దుపెంట అంజి, అఖిల భారత బిసి విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శి బండారి సురేష్ బాబు పాల్గోని రాయలసీమ అభివృద్ధి హక్కుల సాధన కోసం భవిష్యత్ పోరాటాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులో రాయలసీమ ప్రాంతీయ ప్రాజెక్టులు విశ్వ విద్యాలయాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కోస్తాంధ్రతో సమానంగా రాయలసీమకు బడ్జెట్లో కేటాయింపులు జరగాలని లేని పక్షంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం దిశగా ఉద్యమాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులైన గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి తదితర వాటికి బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదని, రాయలసీమ ప్రాంత విశ్వ విద్యాలయాలకు కూడా అరకొర నిధులు కేటాయించి వైసీపీ ప్రభుత్వం సీమకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు.
అన్ని రంగాలలో రాయలసీమకు జనాభా ప్రాతిపదికన 40 శాతం బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.