ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిలో సంగమేశ్వరం నుండి పోతిరెడ్డిపాడుకు రోజుకు మూడు టి.యం.సీల ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనభైవేళ క్యూసెక్కులకు పెంపు, కాలువల సామర్థ్యం విస్తరణ తదితర నిర్మాణాలకోసం జి.ఓ 203 విడుదల చేసింది.
కరువుపీడిత సీమ ప్రాంతానికి ఇది ఎంతో తోడ్పటునిస్తుంది.కృష్ణానదిలో వరద ప్రవాహ రోజులు తగ్గుతుండడంతో యస్.ఆర్.బి.సి, కెసి కెనాల్, తెలుగు గంగ, గాలేరునగరి తదితర ప్రాజక్టుల నీటి అవసరాలు తీర్చడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
నికర జలాలే లేని సీమ ప్రాజక్టులకు ఏ పద్దతిలో నీరిస్తారని తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం తెలుపుతుంది. ఈ విషయమై గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రాతం వారు కేసు వేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ళ, నెట్టెంపాడు తదితర పథకాలకు పనులు చేపట్టారు. వాటికి కూడా నికర జలాలు లేవు. తెలంగాణలో ఒక వైపు నిర్మాణాలు చేపడుతూనే, మరో వైపు అంతకంటే వెనుకబడిన రాయలసీమలో మాత్రం పనులు చేపట్టకూడదనే వైఖరి అసంమజసంగా ఉంది.
ఇరు ప్రాంతాల వాద వివాదాలు అటుంచితే కృష్ణానదిలో నికరజలాలు, మిగులు జలాల వాస్తవ పరిస్థితి, వాటి కేటాయింపులు చూద్దాం.
కృష్ణానది జలాలను తొలుత పంపిణీ చేసిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు 2000 సంవత్సరం దాకా కొనసాగింది. ఈ ట్రిబ్యునల్ కృష్ణాజలాలలో 811 టి.యం.సీలను ఆంధ్రప్రదేశ్ వాటాగా కేటాయించింది. మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం కూడా దిగివ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చింది. ఈ గడువులోగా తెలుగు రాష్ట్రాలలో మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజక్టులు చేపట్టినా అవి ఒక్కటీ పూర్తికాలేదు. మిగులు జలాలు వాడుకొనే విషయంలో ఏమాత్రం ప్రభుత్వాలు శ్రధ్ద వహించలేక పోయాయి.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కాల పరిమితి 2000 నాటికి ముగియడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణజలాల పంపిణీ కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ ను 2004 లో కేంద్రం నియమించింది. ఈ ట్రిబ్యునల్ విచారణ సాగించి 2010 లో మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2013లో తుది నివేదిక ఇచ్చింది.
బ్రిజేష్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం ఆధారితంగా పాత కేటాయింపులు 811 టి.యం.సీలు అలాగే కొనసాగించింది.
కృష్ణానది మొత్తంగా 65 శాతం ఆధారితంగా జలాలను లెక్కకట్టి అదనపు నికరజలాలు 163 టి.యం.సీలు, వరద జలాలు 285 టి.యం.సీలు గా నిర్ధారించింది. వాటిని గతంలో బచావత్ ట్రిబ్యునల్ లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే వినియోగించుకునే అవకాశం ఇవ్వకుండ, మిగతా కర్ణాటక, మహారాష్ట్ర లకు కూడా కేటాయించింది. ఈ పద్దతిలో మహారాష్ట్రకు అదనపు నికరజాలు 46 + వరద జలాలు 46 గా, కర్ణాటక కు 68+105 గా, ఆంధ్రప్రదేశ్ కు 49+145 గా కేటాయించింది.
మహారాష్ట్ర, కర్ణాటకలకు అదనపు నికర జలాలు, మిగులు జలాలను ప్రాజక్టుల వారిగా కేటాయించిన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కొన్నింటికి మాత్రమే కేటాయించింది.
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అదనపు నికర జలాలు 49 టి.యం.సీలలో ప్రస్తుత తెలంగాణ లోని జూరాల ప్రాజెక్టు కు 9 టి.యం.సీ లు, కర్నూలు జిల్లాలోని రాజోలిబండ కుడి కాలువకు 4 టి.యం.సీలు, నదీ ప్రవాహం కొరకు 6 టి.యం.సీలు మొత్తం 19 టి.యం.సీ లు పొతే మిగిలిన 30 టి.యం.సీలను క్యారీ ఒవర్ కింద ఉంచింది. వరద జలాలలు 145 టి.యం.సీలలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగకు 25 టి.యం.సీలు కేటాయించి మిగిలిన 120 టి.యం.సీలను క్యారీ ఓవర్ కింద ఉంచింది.
అదనపు నికర, వరద జలాలు 150 టి.యం.సీలు ఇలా క్యారీ ఓవర్ కింద శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో బ్రిజేష్ ట్రిబ్యునల్ రిజర్వు చేసింది. ఇవి నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు నీళ్లు తక్కువగా వచ్చే సంవత్సరాలుంటాయి కాబట్టి ఎక్కువగా నిల్వ ఉంచుకొనే నిమిత్తం ఉపయోగపడతాయి. నిజానికి ఇది మొదటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు సంబంధించిన విషయం. మిగులు జలాలు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు అప్పట్లో ఇచ్చారు కాబట్టి, పై రాష్ట్రాల నుండి నికర,మిగులు జలాలు ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు అనే ఉద్దేశంతో క్యారీ ఒవర్ పద్దతి ఉండింది. ప్రస్తుతం బ్రజేష్ ట్రిబ్యునల్ ఎక్కువ తక్కువలకు సంబంధం లేకుండా అన్నిరకాల జలాలను పంచేశారు. ఇప్పుడు ఈ క్యారీ ఓవర్ అవసరం అంత ప్రధానం కాదు. ఉన్నంతలో ప్రతి నీటిచుక్క ఉపయోగించుకోవాలి. అయినా బ్రిజేష్ ట్రిబ్యునల్ క్యారీఓవర్ లో నీళ్ళను ఉంచింది. తెలంగాణ, రాయలసీమలలో ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలో ఉన్న, నిర్మాణాలు సాగుతూఉన్న, వెనుకబడిన కరువు పీడిత కల్వకుర్తి(25 టి.యం.సిలు), నెట్టెంపాడు(22), శ్రీ శైలం ఎడమకాలువ (18), రాయలసీమలో హంద్రీనీవా(40), గాలేరు నగరి(38), తెలుగు గంగ(29), ప్రకాశం జిల్లాలో వెలిగొండ(43) ఇలా మొత్తం 188 టి.యం.సీలు జలాలు అవసరం కాగా కనీసం మిగిలిన 150 టి.యం.సీ లైనా పై ప్రాజక్టులకు కేటాయించకపోవడం విచారకరం.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులో ఈ నీళ్ళను కరువు ప్రాంతాలు పొందలేక పోవడం శాపంగా భావించాలి.
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే క్రమంలో కృష్ణాజలాలపై తీవ్రమైన చర్చ జరిగింది. విభజన చట్టంలో కరువు ప్రాంతాల ప్రాజక్టులను దూరదృష్టితో ఆలోచించి చట్టంలో పేర్కొన్నారు.
విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు నీటి పంపకం కోసం కృష్ణజలాల వివాదాల ట్రిబ్యునల్ పదవీకాలం పొడిగించి కింది అంశాలను విచారణ చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. విభజన చట్టం భాగం-9, సెక్షన్ 89 లో పేర్కొన్నారు. అందులో
ఎ) అంతరాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం 1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్, ప్రాజెక్టు వారిగా నీటిజలాలను కేటయించకపోతే, ప్రాజెక్టు వారీ కేటాయింపులు జరపడం.
బి) తక్కువ నీటి ప్రవాహం సందర్భాలలో ప్రాజక్టుల వారీగ నీటిని విడుదల చేయడానికి ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్మించడం అని ఉంది. ఈ
రెండు అంశాలను మాత్రమే రాష్ట్ర విభజన అనంతరం కృష్ణాజలాల పంపకం కోసం కొనసాగుతున్న బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రస్తుతం విచారణ చేస్తుంది.
విభజన చట్టం, భాగం-9 , సెక్షన్ 85 లో జల నిర్వహణ మండలి ఏర్పాటు, విధులను తెలుపుతుంది. అందులోని (8)ఇ..ప్రకారం, 11 వ షెడ్యూల్ లో కింద విధంగా ఉంది.
“ఈ కింద చెప్పిన, నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులు ఉనికిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(ఉమ్మడి) ప్రకటించిన పథకం ప్రకారం పూర్తిచేయాలి. వాటి నీటి కేటాయింపు ఏర్పాట్లు అదే విధంగా కొనసాగుతాయి. 1. హంద్రీనీవా 2. తెలుగుగంగ 3. గాలేరునగరి 4. వెలిగొండ 5.కల్వకుర్తి 6.నెట్టెంపాడు.”
విభజనచట్టంలో పేర్కొన్న ఈ కరువు ప్రాంతాల ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపుల విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల కేటాయింపులకై విచారణ చేస్తున్న బ్రజేష్ ట్రిబ్యునల్ పరిధిలోకి రావటం లేదు. ఈ ఆంశాలు 89 వ సెక్షన్లో ట్రిబ్యునల్ విచారణ చేపట్టవలసిన అంశాల వద్ద కాకుండా, 85 వ సెక్షన్ లో ఉంచారు. ఇది కావాలనే జరిగిందా? సాంకేతిక పరమైన పొరపాటు వల్ల జరిగిందో ఆలోచించాలి. సెక్షన్ 89 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా కరువు ప్రాంత ప్రాజక్టులు నీటి వాటలు పొందకుండా, సెక్షన్ 85 లోని జల నిర్వహణ మండలి ద్వారా పొందచ్చని భావించడం అత్యాశే అవుతుంది.
రేపు జలనిర్వహణ మండలి ట్రిబ్యునల్ తీర్పునే అమలు చేస్తామంటే ఈ కరువు ప్రాంతాల ప్రాజక్టులకు దిక్కు ఉండదు. 2013 తీర్పులో వరదజలాలను క్యారీ ఓవర్లో ఉంచిన విధంగా, రేపు ట్రిబ్యునల్ తీర్పులో కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ ఆశయం కోసం కరువుపీడిత ప్రాజక్టులకు నీళ్లు కేటాయించాలని విభజనచట్టం పార్లమెంటు సాక్షిగా భావించిందో ఆ ప్రాజక్టులకు నీళ్ళు కేటాయించేలా 85 సెక్షన్ నుండి, సెక్షన్ 89 పరిధిలోకి తీసుకొని రావాలి. కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి, ఈ రెండు తెలుగు రాష్రాల లోని
కరువుపీడిత ప్రాంతాల ప్రాజెక్టులకు ఇప్పటికీ మిగిలి క్యారీ ఓవర్ కింద ఉంచిన 150 టి.యం.సీ లు కేటాయింపులు చేయించాలి. ఈ విధంగా అయినా తెలంగాణకు రాయలసీమ, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు చట్టబద్ధంగా నీళ్ళు అందుతాయి.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలపంపిణి కోసం బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది. తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా కృష్ణానది లోని 811 టి.యం.సీల నికరజలాలును 37:63 ప్రతిపాదికన తెలంగాణకు 299 టి.యం.సీలు, ఆంధ్రప్రదేశ్ కు 512 టి.యం.సీలుగా కేంద్రం 2015 లో కేటాయించింది.
పై నికరజలాలు 811 టి.యం.సీలు , అదనపు నికరజలాలు 49 టి.యం.సిలు, +వరదజలాలు 145 టి.యం.సీలను ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య బ్రజేష్ ట్రిబ్యునల్ పంపకం చేయబోతోంది.
ఈ సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కృష్ణా జలాల విషయంగా విభజన చట్టం స్ఫూర్తిని కాపాడమని కోరాలి. విభజన చట్టం ముందు నాటి నికరజలాల ప్రాజక్టులు, విభజన చట్టంలో పేర్కొన్న కరువు ప్రాంత ప్రాజక్టులను మొత్తం ఒక యూనిట్ గా పరిగణించి విచారించాలని కోరాలి. నీటి కేటాయింపులలో కరువు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అడగాలి. ఈలోగా ఇరు రాష్ట్రాలలో కనీసం ఎప్పుడో ఒక సారి వచ్చే వరదనీరు వినియోగానికి ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజక్టుల వల్ల పొందే అవకాశం ఉంటుంది. అవి అక్రమమా, సక్రమమా అనేది ప్రస్తుత బ్రిజేష్ ట్రిబ్యునల్ నీళ్ళ కేటాయింపుల బట్టి తేలిపోతాది.
ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కరువుపీడిత ప్రాంతాలలో ప్రాజక్టుల నిర్మాణంతో పాటు వాటికి చట్టబద్ధంగా ఎలా నీళ్ళు ఇవ్వాలనే విషయం ఆలోచించాలి. చట్టబద్ధంగా నీళ్ళు పొందే అవకాశాల కోసం ప్రస్తుతం విచారణ చేస్తున్న బ్రజేష్ ట్రిబ్యునల్ వద్ద ప్రయత్నం చేయకుండా వదిలేస్తే, రేపు ఇరు రాష్రాలలో కరువుపీడిత ప్రాంతాలలో ఎన్ని ప్రాజక్టులు పోటీలు పడి కట్టినా అవి అలంకార ప్రాయంగా నిలుస్తాయి.
ప్రజాస్వామిక స్ఫూర్తిని పక్కనపెట్టి భావోద్వేగాలతో పట్టింపులు, ఆధిపత్యం, ఘర్షణ వాతావరణంలోకి పోతే చివరకు కరువు పీడిత ప్రాంతాలకు నష్టం జరుగుతాది.
( డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వేమన అధ్యయన& అభివృద్ధి కేంద్రం, అనంతపురము, ph 99639 17187)