అధికారంలో ఉండి అసాధారణ మెజారిటీ ఉన్నా డిఫెన్స్ పాలిటిక్స్ నడపడం రాజకీయాలలో అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదే నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కోవిడ్ కారణంగా మార్చిలో జరగాల్సిన పూర్తిస్థాయి బడ్జట్ సమావేశాలు రద్దు చేసి ఓటాన్ పద్దును క్యాబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ చేశారు.
మళ్ళీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదు. కీలకమైన బిల్లులు ఉన్న నేపథ్యంలో రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్థిక పద్దుతో బాటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును సభలో పెట్టింది. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉన్నందున ఆమోదం పొందినది. శాసనమండలిలో బిల్లును ప్రవేశ పెట్టలేక పోయినది. ఇక్కడ అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ , శాసన మండలి అధికారాలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మండలి పెద్దల సభ అయినా రాజ్యసభ కున్నంత అధికారాలు లేవు. ఆర్థిక బిల్లులకు మండలి ఆమోదం అవసరం లేదు. ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మండలికి వెళుతుంది. మండలికి 1. బిల్లును తిరస్కరించడం 2. సవరణలు చేయడం 3 పరిశీలన చేయడం లాంటి అవకాశం ఉంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తిరస్కరించి లేదా సవరణలు ప్రతిపాదించిన తర్వాత తిరిగి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలిలో ప్రతిపాదించిన తర్వాత ఒక నెల రోజులు వ్యవధిలో మండలి నిర్ణయంతో సంబంధం లేకుండా అసెంబ్లీ తీర్మానం ఆమోదం అవుతుంది.
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై అధికార , ప్రతిపక్ష పార్టీలు స్పష్టమైన వైఖరిని కలిగివున్నాయి. తెలుగుదేశం పట్టుదలతో ఉన్నపుడు వారికి స్పష్టమైన మెజారిటీ ఉన్న శాసన మండలిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందని అంచనా వేయడంలో అధికార పార్టీ తొలి నుంచి విఫలం అవుతూ ఉంది. మెజారిటీ లేదని తెలిసి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మండలి ఆమోదం తెలపక పోయినా రెండవసారి ఆమోదించకోవచ్చన్న ధీమాతో వెళ్లింది.
పరిశీలన పేరుతో టిడిపి మరింత కాలం సాగదీయవచ్చన్న అంచనా వేయలేకపోయిన కారణంగా ప్రభుత్వం బిల్లును మార్చిలో ఆమోదింపచేసుకోవడంలో విఫమైనది.
గత అనుభవాలను పక్కన పెట్టి తెలుగుదేశం వ్యూహాలను గుర్తించడంలో అధికార వైసిపి విఫలమైందని చెప్పక తప్పదు.
నేడు ప్రభుత్వం చేసిన ఆలోచన ఏంటంటే రెండవసారి మండలిలో బిల్లు ప్రవేశ పెడితే చాలు మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండా నెల రోజుల తర్వాత అసెంబ్లీ ఆమోదం అమలు అవుతుందన్న అంచనాతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందుకు వెళ్లింది వైసిపి ప్రభుత్వం.
తమ పై దాడులకు వ్యతిరేకంగా అసెంబ్లీని బహిష్కరించిన తెలుగుదేశం శాసన మండలిని బహిష్కరణ చేయలేదంటేనే వారి వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం బిల్లు పెట్టినా చెల్లదని తెలుగుదేశం బహిరంగంగా ప్రకటించింది. ఎందుకంటే సెలక్ట్ కమిటీ పరిశీలన దశలో ఉన్న సమయంలో మరొసారి బిల్లు పెట్టినా కుదరదు. దీన్ని నమ్మిన అధికార పార్టీ బిల్లును పెట్టిన తర్వాత తెలుగుదేశం వ్యతిరేకిస్తుందన్న అంచనా వేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ప్రభుత్వం సమావేశాలను రెండు రోజులు అని నిర్ణయం చేయకుండా ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు.
రెండు రోజుల తర్వాత మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకునే యోచన ప్రభుత్వం చేసి ఉంటే తెలుగుదేశం ఎన్ని రోజులు బిల్లును పెట్టకుండా అడ్డుకుని ఉంటుంది !
కనీస అంచనాలు వేయకుండా సమావేశాలు రెండురోజులు మాత్రమే అని తీర్మానం చేశారు.
సభలో గందరగోళం ఏర్పడినపుడు సభను వాయిదా వేయడం సహజం. అధ్యక్ష స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యుడు ఉన్నారు. సమావేశం చివరి దశకు చేరుకున్న సమయంలో లోకేష్ ఫోన్ లో నిబంధనలకు వ్యతిరేకంగా చిత్రీకరణ చేస్తున్నారని చెబుతూ అడ్డుకునే ప్రయత్నం అధికార పార్టీ చేయడం, దాన్ని తెలుగుదేశం ప్రతిఘటించడం జరిగింది. ఫలితంగా సభలో గందరగోళం ఏర్పడిందనే పేరుతో నిరవధిక వాయిదా వేశారు.
లోకేష్ ఫోన్ వాడుతున్నారు అంటే అదొక వ్యూహం అని అధికార పార్టీ గుర్తించ లేకపోవడం వైఫల్యమే.
మరో వైపు తెలుగుదేశం విమర్శలు వచ్చినా పర్వాలేదు అని అసెంబ్లీని బహిష్కరించి మండలిలో అందుకు భిన్నంగా వ్యహారించినది. చంద్రబాబు అసెంబ్లీలో ఉన్నా చేసేది ఏమీ లేదు. మండలి సభ్యులకు అందుబాటులో ఉండి వ్యూహాత్మక వ్యహారించారు.
తమ పార్టీ నుంచి వెళ్లిన కేఈ ప్రభాకర్ తో స్వయంగా మాట్లాడారు. ప్రతిపక్ష నేత ఇలా అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంటే జరుగుతున్న పరిణామాలేమిటో వైసిపి పట్టించుకోలేదు. తాము ముందనుకున్న పద్దతిలో నడుచుకుని బిల్లులు ఆమోదించుకోవడంలో వైఫల్యం చెందింది అధికార పక్షం.
మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించలేదు. సాంకేతికంగా ఇబ్బంది లేకున్నా సభ ఆమోదం మంచి సాంప్రదాయం కాబట్టి వెంటనే సభను సమావేశపరిచి వినిమయ బిల్లుతో బాటు పాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం తన పాలనను సాఫీగా చేసుకోవాలి.
అందుకు భిన్నంగా వినిమయ బిల్లు ఆమోదం లభించక పోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నామని అందుకు కారణం తెలుగుదేశం పార్టీ అని నిందించినా పెద్ద ప్రయోజనం ఉండదు.
చంద్రబాబు మండలిని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని నడవనియకుండా చేస్తున్నారు అన్న అధికార పార్టీ విమర్శలు ఒక దశ దాటిన తర్వాత అది అధికార పార్టీ బలహీనతగా మారే ప్రమాదం ఉంది.
జరిగిన పరిణామాలను నెమరువేసుకుని ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు వెళుతుందేమో చూడాలి, లేదా మునుపటి లాగానే అలసత్వం ప్రదర్శించి డిపెన్స్ పాలిటిక్స్ కొనసాగిస్తుందా? వేచి చూడాలి.