అమరావతి: ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రభుత్వం అనుమతినీయలేదు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టిడిపి అధ్యక్షుడు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు ఆస్పత్రికి వచ్చారు.
అచ్చెన్నను పరామర్శించేందుకు ఉదయాన్నే జైళ్లశాఖ డీజీ, జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు చంద్రబాబు పేషి సిబ్బంది దరఖాస్తు చేశారు. అయితే, అధికారులు అనుమతినీయలేదు.
గుంటూరు చేరుకున్న తర్వాత చంద్రబాబుకు అనుమతి నిరాకరణ విషయాన్ని పార్టీ నేతలు, పోలీసు అధికారులు తెలిపారు.
దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడును పరామర్శించకుండానే చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబునాయుడికి అనుమతినిరాకరించడాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సమర్థించారు.ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదని స్పీకర్ అన్నారు.
తెలుగు దేశం పార్టీ అసంతృప్తి
టెలిమెడిసిన్ సంస్థకు సుమారు రూ.3 కోట్లు చెల్లించింది జగన్ ప్రభుత్వమే
స్పీకర్ తమ్మినేని సీతారాం గారు శాసన సభాధ్యక్షుడిగా కాకుండా
వైకాపా కార్యకర్తగా మాట్లాడతున్నారని టిిడిపి ఎపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, టిడిపి శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ సందర్బంగా వారొక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ఇదే :
“శాసనసభ్యుల హక్కుల గురించి గొప్పలు చెబుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం గారు సభ్యులకు జరుగుతున్న అవమానంపై, శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చిన టెలి మెడిసిన్ విలువ రూ.7.96 కోట్లు మాత్రమే. తెలుగుదేశం హయాంలో ఈ టెలిమెడిసిన్ సంస్థకు రూపాయి కూడా చెల్లించలేదు. పైగా ఈ అంశంపై విచారణకు ఆదేశించినది కూడా చంద్రబాబు ప్రభుత్వమే.
ఈ టెలిమెడిసిన్ సంస్థకు సుమారు రూ.3 కోట్లు చెల్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. విచారణ ఎదుర్కొంటున్న ఈ సంస్థకు జగన్ ప్రభుత్వం ఎందుకు చెల్లింపులు చేసింది?
కేసు పెట్టాల్సి వస్తే చెల్లింపులు చేసిన జగన్ ప్రభుత్వంలో చెల్లింపులకు సిఫార్సు చేసిన వైకాపా నేతలపై పెట్టాలి.
రూ.500కోట్లు పైగా కరోనా వస్తువులు నామినేషన్ పై కొన్నందుకు జగన్ ప్రభుత్వంపై కేసులు పెట్టాలా?
ఈ వ్యవహారంలో సంబంధం లేని అచ్చెన్నాయుడుపై లేఖ ఇచ్చారనే కుంటి సాకుతో అమానుషంగా అరెస్ట్ చేశారు. తెలంగాణలో మంత్రిపై చర్య తీసుకోలేదు.
రాజకీయ కక్షతో అక్రమ అరెస్ట్ చేయబడ్డ తన శాసనసభ్యునికి అండగా నిలవాల్సిన శాసన సభాపతి.. అచ్చెన్నాయుడు నేరస్థుడు అని మాట్లాడటం సరైంది కాదు. అవినీతి సాక్షిలో నేరస్థుడు అని స్క్రోలింగ్ లు ఇచ్చారు.
అచ్చెన్నాయుడు నిందితుడేగాని నేరస్థుడు కాదు. అచ్చెన్నాయుడు అక్రమ కేసుకు, అక్రమ అరెస్ట్ కు గురైన బాధితుడే గాని నేరస్థుడు కాదని స్పీకర్ గారు గుర్తించాలి.
అచ్చన్నాయుడి మీద కోపం ఎందుకంటే…
అచ్చెన్నాయుడు బీసీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
34 శాతం రిజర్వేషన్ ను 24 శాతంకు కుదించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. ఇసుక, మద్యంలో అవినీతిని ప్రశ్నించారు.
అసెంబ్లీలో వీటిపై నిలదీస్తారనే భయంతో సమావేశాలకు ముందు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
శాసనమండలిలో యనమల రామకృష్ణుడు గారిని బ్లాక్ చేయడానికి ఆయనపై అక్రమ కేసు పెట్టారు. ఇవన్నీ బీసీలపై దాడులుకాక మరేమిటి స్పీకర్ గారు?