(డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
కరోనా మహమ్మారిని అరికట్టడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇదివరకే కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ అనేక సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ ఆయుష్ మంత్రిత్వశాఖ ఇచ్చిన సూచనలను పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అలవర్చుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు:
* దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగండి
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి
* రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లిలను తప్పకుండా ఉండేలా చూసుకోండి
ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు:
* ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చవనప్రాశ్ తినాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ్ తీసుకోవాలి
* తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగండి. అలాగే మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు.
* 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేక రెండుసార్లు తాగండి
సులభమైన ఆయుర్వేద పద్ధతులు:
* నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. ఇలా ఉదయం మరియు సాయంత్రం చేయండి
* ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకుని నోటిలో వేసుకుని రెండు మూడు నిమిషాలపాటు పుక్కిలించి తర్వాత ఊసేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు
* పొడిదగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి
* లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఒకవేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి