తిరుమల శ్రీ వారిదర్శనలు పునరుద్ధరణ సందర్భగా కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు టీటీడీ అమలు చేస్తున్న ముందుజాగ్రత్త చర్యలు విజయవంతంగా సాగుతున్నాయి.
టిటిడి చేపట్టిన ఈ చర్యలకు భక్తుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి, సానిటైజ్ చేసుకుంటూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.
గురువారం నుంచి తిరుమలలో సాధారణ భక్తులకుస్వామివారి దర్శనం ప్రారంభమయింది. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సేవలు, పాటిస్తున్న జాగ్రత్తలు తెలుసుకోవడానికి ఛెర్మన్ ఆకస్మిక తనిఖీలు చేశారు.
అన్నదానం కాంప్లెక్స్ వంటశాలను పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు.
భౌతిక దూరం పాటిస్తూ భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు కాలితో నొక్కే కుళాయిలను చూశారు. రెండురోజుల క్రితం ఈ కుళాయిలు ఏర్పాటు చేయాలని చైర్మన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
కళ్యాణకట్టలో తలనీలాల సమర్పణ జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. క్షురకులకు పీపీ ఈ కిట్లు ధరించడం లో ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం చైర్మన్ మీడియా తో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవకాశాన్ని బట్టి దర్శనం టికెట్ల సంఖ్య పెంచుతామనీ, అయితే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమన్నారు.
అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.
సివిఎస్ ఓ గోపినాథ్ జెట్టి, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, డిప్యూటి ఈ ఓ సెల్వం చైర్మన్ వెంట ఉన్నారు.