తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తారు. ఎందుకో తెలుసా. ఆయన అమలు చేస్తున్న పథకాల ఫలాల సొంతగా చూడ్డానికి.
వైసిపి అధికారంలోకి వచ్చాక తొలిసారి సీఎం జగన్ గ్రామాయాత్రలకు సిద్ధం అవుతున్నారు
ఏడాది పొడుగునా వైసిపి ప్రభుత్వం ఎపుడూ లేనంతగా రకరకాల పేర్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూఉంది. ఎన్నికల ముందు ఆయన ప్రకటించిన నవరత్నాలు ఎలా అమలుఅవుతున్నాయో స్వయంగా పరిశీలిస్తారు. నవరత్నాలు బాగా అమలవుతున్నాయని అధికారుల అందిస్తున్న నివేదికలతో సంతృప్తి చెందకుండా స్వయంగా ప్రజలతో సంప్రదించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
తన పర్యటన నాటికి భాగంగా ప్రజలలో ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు అందడానికి వీల్లేనంతగా,తమకు ఇంకా సంక్షేమ ఫలాలు అందలేదని చెయ్యేత్త అవకాశమీయకుండా ఈ లోపు పథకాలు అమలుచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గురువారం నాడు ఆయన గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందుకునేందుకు మనకు వోటేశాడా లేదా అనేది కొలబద్ధ కారాదని ఆయన స్పష్టంగా చెప్పారు. అందరికీ ఫలితాలు అందితీరాలని,అర్హత ఉన్నవారందరూ లబ్దిదారులు కావాలని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే…
పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి.
మాకు ఓటేయకపోయినా సరే అర్హత ఉంటే చాలు అందరికి పథకాలు అందించాలి.
ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అంది తీరాలి.
ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి.
ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.