ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
బాగా గనుల వ్యాపారం ఉన్న రాఘవరావు తెలుగుదేశం ప్రభుత్వం లో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి (వైసిపి) చేతిలోఓడిపోయారు. ఎందుకో చేరారంటే ఆయన కూడా పాత పాటే పాడారు. ‘ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కగా పాలిస్తున్నారు. ఆయన ప్రభుత్వం చక్కటి సంక్షేమ పథకాలు ప్రారంభించింది. పేద మధ్య తరగతి ప్రజలకోసం బాగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేయాలి. పార్టీ లోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు,’ అని రాఘవ రావుచెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్య
బెదిరించి ప్రలోభాలు పెట్టి తెలుగుదేశం నాయకులనువైసిపి పార్తీలో చేర్చుకుంటున్నదని సిద్ధారాఘవరావు వైసిపిలో చేరుతున్నాడన్న వార్తల మీద టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాఖ్యానించారు. ఇలా బెదిరింపులు లొంగిపోవడం పిరికి తనమని ఆయన అన్నారు. నాయకులను చేర్చుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందనుకోవడం తప్పని , చాాలా మంది వెళ్లిపోయినా టిడపికి ఏమీ కాలేదని ఆయన పార్టీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అన్నారు.