ఒక్క అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు సమాజంలో విలేకరుల పాత్ర ఏమిటి అన్నది చెప్పడానికి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అనిర్వచనీయం. అత్తెసరు జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం చేరవేయడమే శ్వాసగా, ధ్యాసగా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారు.
కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారు. కష్టకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా పరిస్థితుల పై క్షణక్షణం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనా సోకి మరణించిన సందర్బం హృదయాన్ని కలచివేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు మిత్రుడికి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలి.
ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలి. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి.
వీటి పై తక్షణం స్పందించాల్సిందిగా సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో జర్నలిస్టు సమాజంలో మీరు మానవత్వం లేని మనిషిగా మగిలిపోతారని హెచ్చరిస్తున్నాను.