తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. తల్లితండ్రుల ఆందోళన, వ్యాపిస్తున్న కరోనా పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడం కష్టమని ప్రభుత్వం భావించింది. అందుకే పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ చేయాలని నిర్ణయించింది.ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.
పదవ తరగతి పరీక్షలమీద నెలకొన్న సందిగ్ధం మీద ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు ఇందులో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి.
అయితే, కరోనాప్రబలడంతో పరీక్షల వ్యవహారం తెలంగాణ హైకోర్టు దాకా వెళ్లింది కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రెండుసార్లు వాయిదా వేసింది. రెండో సారి పరీక్షలు నిర్వహించాలని చెప్పినా, జిహెచ్ ఎంసి, రంగారెడ్డి జిల్లాలో పరీక్షలు జరపదారని కోర్టు చెప్పింది. కావాలంటే వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని ఆదేశించింది.
దీనితో పరీక్షలు అసలు జరపాలా వద్దా అనే దాని చర్చ మొదలయింది. ఈనేపథ్యంలో పరీక్షల మీద తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం సమావేశాన్ని సిఎం నిర్వహించారు.
దేశంలో వివిధ రాష్ట్రాలు ఎస్ ఎస్ సి పరీక్ష వ్యవహారంలో అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేస్తూ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లను నిర్ణయిస్తారు.
డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణ గురించి కూడా ప్రభుత్వం తొందర్లో ఒక నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.