మోటివేషన్ …ఈ రొజుల్లో, ఈ పదానికి అర్థం తెలీని యువత, దీని అవసరం లేని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదేమో.ఈ భూమి మీద ప్రతి మనిషి ప్రత్యేకమే, అతడి అలో చనలూ, జీవితగమ్యాలు అద్వితీయమే. మనిషి తను చేయ వలసిన పనుల్ని సాధిస్తూ విజయ వంతంగా ముందుకు సాగాలంటే, భౌతికమైన వనరు లెన్ని వున్నా మానసిక ధృడత కల్గించే విలువైన వనరు ఈ మోటివేషన్ మాత్రమే. ఇది లేకుండా మనిషి ముందుకు సాగలేడు.
మోటివేషన్ అనేది జీవితం లో మనిషి సాధించాలనుకునే గమ్యాలను స్పష్ట పరిచి, ప్రాధాన్య క్రమం నిర్ణయించి, వాటిని సాధించే మానసిక శక్తిని సమకూరుస్తుంది.అది గతం లో మనల్ని కృంగదీసిన సన్నివేశాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఆత్మ విశ్వాసాన్నీ, పట్టుదలను పెంచుతుంది, భయాన్ని తొలగిస్తుంది, ఎదుటి వాడిలో స్ఫూర్తి నికలుగచేస్తుంది.
అత్యంత కీలకమైన ఈ నైపుణ్యం కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ప్రతి మనిషిలోను ఏదో ఒక స్థాయి లో వుండేది.తరాలు మారే కొద్దీ, జీవన యానం వేగవంతమైంది. ఈ వేగాన్ని అందుకునే ప్రయత్నం లో జీవన శైలి మారాల్సి వచ్చింది. మారుతున్న జీవన శైలి లో యాంత్రికత పెరిగి, మోటివేషన్, స్థాయి తగ్గిపోసాగింది. చివరకు మనం మోటివేషన్ ను పుస్తకాల రూపంలో ఉపన్యాసాల రూపంలో కొనుక్కోవలసి వస్తున్నది.మోటివేషన్ సైన్స్ ఇపుడు పెద్ద బిజినెస్. ఈ పుస్తకాలు కోట్లలో అమ్ముడుపోతున్నాయి. జీవితం నెగ్గడమెలా, కోటీ శ్వరుడుకావడమెలా… ఇలా ఎన్నిపుస్తకాలు ఉపన్యాసాలు వస్తున్నాయో.
వివిధ సంస్థలు ఈ విషయాన్ని బొధించేందుకు అనేక రకాలైన తరగతులూ ప్రారంభించాయి. వెబ్ సైట్లూ, బ్లాగులూ, యూ ట్యూబ్ చానల్స్ వచ్చాయి. ఈ రోజు మనిషి మోటివేషన్ పొందడానికి వీటి మీద ఆధార పడవలసి వస్తోంది. జీవితానికి అత్యంత అవసరమైన ఈ నైపుణ్యాన్ని బోధించే పుస్తకాలూ, తరగతులు కూడా ఘన మైన ఫీజుల్నే వసూలు చేస్తాయి.
నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు, అందరికి అందు బాటులో మనచట్టూర జీవితంలో ఉండేది. మన అవ్వతాతలు చెప్పిన కథలన్నీ మోటివేషనల్ కథలే. పంచతంత్రం మొత్తం మోటివేషనల్ కధలే. అంతెందుకు భారతం, రామాయణాలలో ఉండేదంతా మోటివేషనే.సాధారణకథలూ, నవలలూ, సుభాషితాలూ, మంచి మాటలూ, ఒకే ఒక కాలక్షేపంగా వున్న సినిమాలూ, వాటిలో పాటలూ మనుషుల్లో ఎంతో ప్రేరణ కలిగించేవి. అది అప్పటి సొసైటీ.
ప్రతి మనిషి కీ సమస్యలుంటాయి. వాటికి సమాధానాలు దొరకనప్పుడు మనిషి నిర్వీర్యుడై పోతాడు. నిస్సత్తువ ఆవరిస్తుంది. ఆలోచనలన్నీ నిరాశా, నిశ్పృహలతో నిండి పోతాయి. అప్పుడు ఒక మంచి మాట వినిపిస్తుంది. మనలో ఉత్సాహం కలిగిస్తుంది. ఆ మంచి మాటకు ఒక అందమైన సంగీత స్వరం తోడయితే అది ఒక మంచి పాట గా మారుతుంది. మనకు అవసరమైనప్పుడు ఆ పాట మన జీవితం లో స్ఫూర్తిని కలిగించే ఒక సందేశాన్ని మోసుకొస్తే , అది ఒక జీవిత పాఠం అవుతుంది.
Think your friend would be interested in this story, share it
తెలుగు సినిమా ల్లో జీవిత సత్యాలను తెలియజేసి, వ్యక్తిత్వ వికాసాన్ని కలుగ జేసే పాటలెన్నో వున్నాయి. ఒక పాటలో పల్లవి మనలో ధైర్యాన్ని నూరిపోస్తే, మరో పాటలోని చరణం మనకు జీవిత సత్యాన్ని బోధిస్తుంది. ఇంకో చోట మొత్తం పాటే మనలోని నైరశ్యాన్ని తొలగించి మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక్కో సారి ఒక పాటని తరచి చూస్తే ఒక తాత్విక గ్రంధాన్ని తెరిచిచూసినట్లనిపిస్తుంది. మరొ సారి ఒక పాట వింటే మానసిక వికాసపు ముఖ్యమైన పాఠం నేర్చుకున్నట్లుంటుంది
పల్లవిలో, మనకు జీవితమంటే ఏమిటొ తెలియజేసి, ఎలా ముందుకు సాగాలో చెబుతుందిఈ పాట
(చిత్రం – సంబరాల రాంబాబు, గీత రచన – రాజశ్రీ , సంగీతం – వి. కుమార్, పాడిన వారు – ఎస్. పీ. బాల సుబ్రమణ్యం)
అనుకున్నది జరగనప్పుడు, లేదా మరో విధంగా జరిగినప్పుడు, అంతా మన మంచికేలే అనుకోమన్నారు పెద్దలు, ఈ సందేశం ఈ పాటలోని చరణంగా మన ముందుకొస్తుంది.
(చిత్రం – మురళీ కృష్ణ (1964), గీత రచన – ఆత్రేయ, సంగీతం – మాస్టర్ వేణు, పాడిన వారు – ఘంటసాల)
“అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని,జరిగేవన్నీ మంచికనీ, అనుకొవడమే మనిషి పనీ”
ఈ ప్రపంచం లో ఏదీ శాశ్వతం కాదు. మనుషులంతా ఒక్కటే. ప్రతి మనిషి జీవితం లో ఎగుడు దిగుడ్లు వుంటాయి. కష్టాలూ, సుఖాలూ వస్తూ వుంటాయి, పోతూ వుంటాయి. ప్రతి మనిషి చివరి గమ్యమొకటే అనే జీవితపు తాత్వికతను సరళమైన మాటల్లో తెలియ జేస్తుంది ఈ పాట .
(చిత్రం – రంగుల రాట్నం, గీత రచన – ఎస్. వి. భుజంగ రాయ శర్మ, సంగీతం – ఎస్. రాజేశ్వర రావ్, బి. గోపాలం , పాడిన వారు – ఘంటసాల, బృందం)
కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు/నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా? వాడిన బ్రతుకే పచ్చగిల్లదా? /ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నమూ
ఏనుగు పైని నవాబు, ప్లల్లకి లోని షరాబు/గుర్రము మీది జనాబు, గాడిద పైని గరీబు /నడిచే దారుల గమ్యమొక్కటే, నడిపే వానికి అందరొక్కటే. . . కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు/కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు/ఏది శాపమో, ఏది వరమ్మో,తెలిసీ తలియక అలమటించుటే. . . . . వ్యధలూ బాధలు కష్ట గాధలూ, చివరికి కంచికి వెళ్ళే కథలే
ఇరుగింటిలోన ఖేదం, పొరిగింటి లో ప్రమోదం/రాలిని పూవులు రెండూ, పూచే గుత్తులూ మూడూ
ఇంకో అందమైన మానసిక వికాసపు పా(ఠం) ట.
(చిత్రం – నా ఆటోగ్రాఫ్ (2004), గీత రచన – చంద్ర బోస్, సంగీతం – కీరవాణి, పాడిన వారు – చిత్ర)
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది,/ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థ మందులో ఉంది/అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది/ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మన జీవితంకలకాదు. అది ఒక నిజం. ఎంతో విలువైనది కూడా. ఏదో జరిగిందనిబాధ పడుతూ, ఎప్పుడూ ఏడుస్తూ కూర్చొని జీవితాన్ని నాశనం చేసుకో రాదు. కష్టాలు వచ్చినపుడు మనిషి అధః పాతాళానికి పడి పోవచ్చు.అలా పడటంతప్పు కాదు. కానీ, పడిన ప్రతిసారీ లేవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించక పోవడమే తప్పు.ఏదయినా పోగొట్టుకున్నపుడో, ఒక సాధనలో అపజయం కలిగినప్పుడో, ప్రేమ విఫలమైనప్పుడో మనిషి కృంగి పోవడం సహజం. ఆ బాధలో వ్యసనాలకు బానిసలై, విలువైన జీవితాలను నాశనం చేసుకునే వారెందరో (దేవదాసులా) . ఆటువంటివారికి అత్త్యుత్తమ సందేశం ఈ పాట.
(చిత్రం – వెలుగు నీడలు (1961), గీత రచన – శ్రీశ్రీ, సంగీతం – పెండ్యాల, పాడిన వారు – ఘంటసాల)
ఒక్కోసారి భవిష్యత్తు అంధకార బంధురంగా కనిపిస్తుంది. భయమేస్తుంది. ముందుకు సాగలేమనిపిస్తుంది.. ఒక్కో సారి పరాజయం కలుగుతుందేమోనని ఫలితానికి భయపడి ముందుకు సాగలేము. చతికిల పడితే జీవన యానం సాగదు. కానీ విజయం దక్కేదాక మనం ముందుకు సాగుతూనే వుండాలి. ఈ సందేశం ఈ పాటలో ఎంత స్ఫూర్తి దాయకంగా చెప్ప బడిందొ వినండి.
(చిత్రం – శభాశ్ రాముడు (1959), గీత రచన – కొసరాజు, సంగీతం – ఘంటసాల, పాడిన వారు – ఘంటసాల)
గాఢాంధకారమలుముకున్న భీతి చెందకూ/సందేహ పడక వెల్గు చూపి సాగు ముందుకూ , సాగు ముందుకూ /నిరాశలోన జీవితాన్ని కృంగ దీయకూ
ఈ పాటలలో ఇంకో ప్రత్యేకత వుంది. ఇటువంటి పాటలన్నీ అర్థాలంకారాలే కాదు, శబ్దాలంకారాలు కూడాను సరళమైన పదాలు, లయబద్ధంగా వుండటమే కాకుండా, వీటి బాణీలు కూడ అతి మనోహరంగా వుంటాయి. అందుకే ఈ పాటలు “వీనుల విందే”
(Ahmed Sheriff is a Hyderabad-based motivational speaker and PMP expert phone: 9849310610 mail id:csahmedsheriff@gmail.com )