కరోనాతో సతమతమవుతున్న మహరాష్ట్ర మీద భారీ తుఫాన్ దాడిచేయబోతున్నది. దక్షిణ ముంబై నుంచి ఉత్తర మహారాష్ట్రమొత్తం తుఫాన్ పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉండటంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారింది. దీని పేరు ‘నిసర్గ’. ఇది వచ్చే 12 గంటల్లో తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరాన్ని తాకినపుడు సుమారు గంటకి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలో మహారాష్ట్ లోని రాయగడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం తాకవచ్చు. దీని వల్ల పాల్ఘార్, పుణే, థానే, ముంబాయ్,రాయ్ గడ్, ధూలే, నందుర్బార్, నాశిక్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
జూన్ నాలుగోతేదీ దాకా ఈ ప్రాంతాలను రెడ్ అలర్ట్ లో పెట్టారు.యాంఫాన్ తుఫాన్ వచ్చి ఒదిసా, పశ్చిమబెంగాలలో బీభత్సం సృష్టించిన వారంలోనే నిసర్గ దాడి చేస్తున్నది. తుఫాన్ మార్గంలో ముంబై ఉన్నంతున దీనిప్రభావం ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం ఈ నగరంమీద తీవ్రంగా ఉంటుందనుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సారి ఉత్తర భారతదేశానికి నార్మలో కంటే ఎక్కువగా, మధ్య భారతం, దక్షిణ భారతంలో నార్మల్ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తుపాను తీరం దాటే సమయంలో భయంకరమైన గాలులు వీస్తాయని, ముంబై వాసులు,దక్షిణ గుజరాత్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు.
అరేబియా సముద్రంలో ఈ వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఈ తుఫాన్ కు నిసర్గ అని పేరు పెట్టిందెవరో తెలుసా?
ఈ సంస్కృతం పేరు సూచించింది బంగ్లాదేశ్. తుఫాన్లకు బంగాదేశ్ నుంచి పేరు రావడంతో ఇది రెండో సారి.గతంలో ఫణి తుఫాన్ పేరు పెట్టింది కూడా బంగ్లాదేశే. ఫణి 2019 మే 3 ఒరిస్సా తీరాన్ని తాకి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందూమహా సముద్ర ప్రాంతంలో తుఫాన్లకు పేర్లు పెట్టడమనేది 2000లో మొదలయింది. ఆసియా దేశాల మధ్య ఈ మేరకు 2004 లో ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారమే తుఫాన్లకు ఆయన దేశాలు వంతుల వారీ గా పేర్లు పెడుతుంటాయి. ఈ సారి బంగ్లాదేశ్ ఈ తుఫాన్ కు నిసర్గ అని నామకరణం చేసింది.