రాయలసీమ సిద్దేశ్వరం అలుగు సిద్ధించేనా?

( మే 31 సిద్దేశ్వరం అలుగు ప్రజాశంకుస్థాపన 4వ వార్షికోత్సవం)
(అరుణ్)
“ జనం ప్రభంజనమైంది” ,”సిద్దేశ్వరం యుద్దేశ్వరమైంది”. ”సిద్దేశ్వరంఅలుగు-సీమకు వెలుగు“అనే నినాధం మిన్నంటింది ,అంతవరకు సీమవాసుల తాగు-సాగు నీటి ఆకాంక్షలను పెడచెవిన పెట్టిన బధిరాంధ పాలక ప్రతిపక్ష పార్టీలను ఒక్క కుదుపు కుదిపింది. ప్రింట్ ,ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా సిమ ఆకాంక్షలను సీమలోనే గాక మొత్తం దేశంమంతా చాటిచెప్పిన మహత్తర చారిత్రాత్మిక ఉద్యమానికి నేటికి 4 సం.లు.
ఈనాలుగు సం.లలో సీమ వాసులు నికరంగా సాధించినది శూన్యమేగావచ్చు. కానీ,సీమ ప్రజలకు వాస్తవ పరిస్థితుల తెలపడం లో ఉద్యమం విజయవంతమైంది. చివరకు ఓట్ల కోసమైనా ఎన్నికల ముందు గుండ్రేవుల,RDS కుడికాలువ,వేదవతి ఎత్తి పోతలకు చంద్రన్న పచ్చజెండా ఊపక తప్పలేదు..జగనన్న గుండ్రేవుల నిర్మాణానికి హామి ఇవ్వక తప్పలేదు.అదంతా ఉద్యమ ప్రభావమే మరి.
జగన్ గద్దెనెక్కడంతో రాయలసీమ వాసుల ఆశలు మోసులెత్తాయి.అందుకు తగినట్టుగానే వాళ్ళ నాన్న రాజన్న శంఖుస్థాపన చేసిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ జోలదరాశి(0.80 tmc),రాజోలి(2.95tmc,దాదాపు 30 వేలఎకరాలకు) పథకాలకు నిధులు జారీచేసాడు.సీమవాసులు ఆవేశపరులేగాకా,అల్పసంతోసులుకూడా. మరో కారణం,అతని సామాజికవర్గంలో మెజారిటీకి తమవాడు గద్దెనెక్కాడు కదా కొంత కాలం వేచి చూద్దామనే భావన.
దాంతో, జగన్ గద్దెనెక్కాక సీమ ఉద్యమాలు స్థబ్దతలోకి జారాయనేది చేదువాస్తవం. సరే,అవన్నీ ఎలావున్నా, సిద్దేశ్వరం అలుగు దగ్గరకు వద్దాం. ఈ మధ్యనే విడుదల జేసిన జీఓ 203 తో అలుగు నిర్మాణం ప్రశ్నార్థకంగా కనపడుతుంది. సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి తోడ్పడే అనుకూలాంశాలు.1)ముగ్గురు ఇంజనీర్స్-ఇన్-చీఫ్స్ ల సిఫారసు.2) శ్రీశైలం రిజర్వాయర్ కు పూడిక ప్రమాదం తప్పించకలగడం. 3) ప్రకాశం జిల్లా నుండి హైదరాబాద్ కు ప్రయాణ దూరం 50 కి.మీ. తగ్గించడం. 4)కేవలం 600 కోట్ల.రూ.తో దాదాపు 50 tmc ల కేటాయించిన నికర జలాలను, జీఓ69 తో సంభందం లేకుండా వినియోగించుకోగలగడం.
ఇన్ని అనుకూల పరిస్థితులు కల్గిన సిద్దేశ్వరం అలుగు నిర్మించకుండా, ఇంచుమించు అదేప్రాంతంలో,రూ.3,825కో.తో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ఎందుకనే ఆలోచన సీమ బుద్దిజీవుల్లో కొందరికైనా కలగడం సహజం.దీనికి సమాధానం. దానికి తెలంగాణా అనుమతిపొందాలి. నిజమే ,ఇప్పుడు కూడా ఎత్తిపోతల పథకం వివాదాస్పదంగా మారిందని మరువరాదు.
కొంతమేరకు ,సిద్దేశ్వర అలుగు ఉద్యమం లో తెలంగాణా ప్రజలు పాల్గొన్నారు. సిద్దేశ్వర అలుగు నిర్మాణానికి మద్దతునిస్తూ పత్రికా ప్రకటనలు చేసారు కూడా.
మరో సాకు,సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆలస్యమయ్యే పని. ఇక, కాలం విషయానికొస్తే ఇన్నేళ్ళు ఆగిన ప్రజలు మరొక రెండేళ్ళు ఆగలేరా?ఎన్నో అనుకూల ప్రయోజనాలున్నా,సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టకుండా ,ఎత్తిపోతలను చేపట్టడానికి గల కారణాలేమిటి?వాటినర్థం చేసుకోవాలంటే చాణక్య ,మైకేవిల్లియన్ తంత్రం అర్థం చేసుకోవాల్సివుంది.
ఒక వైపు సీమ ప్రజలను ఊరిస్తూనే,దక్షిణ కోస్తా సంపన్న వర్గసేవలో తరించడం తొలి నుండి రాష్ట్రముఖ్యమంత్రులకు అలవాటే. ఈ ఎత్తిపోతలతో, సీమవాసుల్లోజగనన్న తమను పట్టించుకుంటున్నారనే భ్రమలు కల్పించడం.కమిటీ అడ్డుపడితే నింద దానిపై వేసి, తాను సానుభూతి పొందడం.అన్నీ సవ్యంగా సాగితే, సిద్దేశ్వరం అలుగుకు కృష్ణా డెల్టా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టీ, ఈ ఎత్తిపోతలవల్ల ఇటు,సీమ ప్రజలను అటు కృష్ణాడెల్టా ఆసాములను ఒకే మారు తృప్తిపరిచినవాడుకావడం .
చంద్రన్న జీఓ69, సీమ తాగునీటి-సాగునీటి పథకాలకు ఉరితాడు బిగించింది. సీమవాసులకు కేటాయించిన నికరజలాలను వాడుకోలేని దుస్థితికల్పించింది.కృష్ణాడెల్టా వాళ్లకు అదనపు నీరు పొందే అవకాశం కల్గించింది. సిద్దేశ్వరం నిర్మాణంతో, ఆ అదనపు నీరుపొందే అవకాశం పోతుంది. అటువంటప్పుడు, జగన్ సిద్దేశ్వరం అలుగునిర్మాణం చేపడుతాడనుకోవడం అత్యాశే గాక,అమాయకత్వం అవుతుంది. It is just living in fools’paradise.అరివీరభయంకరుడు,తిరుగులేని నాయకుడు అని అభిమానులతో కొలవబడే దివంగత మహానేతనే కోస్తా లాబీకి లొంగి తాను రద్దుజేసిన జీఓ69 ను 2 నెలల లోపే పునరుద్దరించాడు.
ఇక జగన్ సంగతి చెప్పాలా?అంతేకాదు,తెలంగాణాలో ప్రాజెక్టుల నిర్మాణాలతో కృష్ణా డెల్టా,(రాయలసీమ కాదు), ఎడారి అవుతుందని వాపోతూ కర్నూల్లో 3 రోజుల ప్రతిపక్షనాయకునిగా జగన్ నిరసన దీక్షకు కూర్చున్నాడు.ఆ విధంగా, కృష్ణాడెల్టా రైతాంగానికి తన విధేయతను చాటిన విషయం తెల్సిందే.గుండ్రేవుల విషయం లో కూడా,జగన్ భిన్నంగా వ్యవహరించే తీరు ఇప్పట్లోకన్పడదు. గుండ్రేవుల నిర్మాణంతో కృష్ణలో కలిసే తుంగభద్రాజలాలు 20 tmc తగ్గుతాయిగా మరి.
అందువల్ల,మాట తప్పని,మడమ తిప్పనని పదే,పదేప్రకటించే జగన్ కూడా గుండ్రేవుల నిర్మాణానికి పూనుకుంటాడనుకోవడం అత్యాశే అవుతుందేమో?
అంతెందుకు,కృష్ణాడెల్టా వాళ్లకు ఏమాత్రం నష్టం కల్గించని,పట్టిసీమ,పులిచింతల, చింతలపూడి ద్వార ఆదా అయ్యే నీటిని సీమకు కేటాయించవచ్చు.
అంతేకాదు,దివంగత రాజశేఖరరెడ్డి ప్రారంభించి,రూ.500 కొ.వెచ్చించిన నాగార్జునసాగర్ టైల్ పాండ్ నిర్మాణానికి కేంద్రం పై ఒత్తిడి తేవచ్చు.(కెసిఆర్ లా కాకుండా కేంద్రంతోజగన్ సఖ్యతతో వున్నాడు కూడా).కానీ, దీనికీ కోస్తాఆదిపత్యరాజకీయాలు ఒప్పుకోవు.ఎందుకంటే సీమలో పుష్కలంగా నీరు లభ్యమవుతే, ఇక్కడి ధనికరైతాంగం,కోస్తా ధనిక రైతాంగాన్ని ధిక్కరించే స్థాయికి ఎదుగుతుంది.
తెలంగాణావిడిపోవడానికిగల అనేకకారణాలలో ప్రజాకాంక్షలతోపాటు, రెండు బలమైన సామాజిక వర్గాల (రెడ్ది,వెలమ) ఆధిపత్యపోరు కూడా ఒకబలమైన కారణంగా చెప్పవచ్చు. అదే పరిస్తితి ఇక్కడ ఏర్పడనీయరు. జగనేకాదు,ఎవరు ముఖ్యమంత్రి అయినా సీమ పరిస్థితిలో పెద్దగా మార్పురాదు. పొతే ఒట్లకొరకై కొన్ని చిన్నా,చితకా పనులు చేపట్టక తప్పదు.వాటినే బూతద్దం లో చూపూతే సరి. నేడు చేపట్టిన కుదింపు పథకాలు, 45 tmc వరద కాలువ బదులు RDS ను కేవలం 4 tmcలకే పరిమితం,అదేవిదంగా24 tmc ల బదులు కేవలం 4 tmc లకే కుదించిన వేదవతి లాంటి పథకాలు చేపట్టనూ వచ్చు.ఇక తెలంగాణా తరహ ప్రజావుద్యమాలే సీమకు దారిచూపాలి.
చాలామందికి,ఈవిశ్లేషణ, ఇచ్చిన దానితో తృప్తిపడక, చేస్తున్నరంద్రాన్వేషణగా కనపడవచ్చు. నేటి రాజకీయ వ్యవస్థలో రంద్రాన్వేషణ తప్పనిసరి. పాలకులు తమ విధానాలకు,ఆచరణనలకు ఎన్నిముసుగులు తొడిగారో,వాటికింద దాచిన ఈవిధానాల నిజస్వరూపమేమిటో తెలుసుకోవడం అంత సులభం కాదు. వాస్తవాన్నుండి సత్యాన్నన్వేశించడం(FROM FACT TO TRUTH)తప్పనిసరి. ప్రజాప్రయోజనాలముసుగులో,తమప్రయోజనాలను కాపాడుకోవడం.ప్రజలధీర్గకాలిక ప్రయోజనాలకు హానికల్గిస్తూ,తాత్కాలిక లబ్ది చేకూర్చడం అన్నిరాజకీయపార్టీలకు వెన్నతోపెట్టిన విద్య.
నా అభిప్రాయాలతో నా ఉద్యమ సహచరులలో కూడా చాలామంది ఏకీభవించరని తెలుసు.నిజం నిష్టూరంగానే వుంటుంది. నిలకడపైన తేలుతుంది. సీమకు గత 7 దశాబ్దాలుగా వివిధ రాజకీయపార్టీలు చేసిన ద్రోహం సీమ వాసుల్ని వెంటాడుతూనే వుంది. అందుకే ఈ సంశయాలు. “ONCE BITTEN,TWICE SHYఅన్నారు.సీమ ఒకమారు కాదు 1927 నుండి నేటివరకు సీమ తనబిడ్డల చేతిలోనే ద్రోహానికి గురవుతూ వస్తూంది. గత చరిత్రను మరిస్తే,వర్తమానమే కాదు,భవిష్యత్తూ ఉండదు.
ఏమైనా ,సిద్దేశ్వరంఅలుగు సీమప్రజలకు తీరని,తీయని కలగా మిగలకూడదనే నా ఆందోళన. నా అంచనా తప్పని రుజువైతే,అందరికన్నా ఎక్కువుగా సంతోష పడేవాన్ని నేనే.
సీమ ప్రజలు రాజకీయచదరంగంలో పావులుకాగూడదనే నా అభిలాష,ఆకాంక్ష.