ఒంగోలు : కరోనా కల్లోలం మధ్య లో కూడా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా, మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ అనే చర్చ వినిపించింది.
సాంబశివరావు ఇక టీడీపీకి గుడ్ బై చేప్పేస్తున్నారని, వైసిపికి చెెక్కేస్తున్నారని బాాగా ప్రచారం మొదలయింది. దీనికి సాక్ష్యం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమై, తన ఫిరాయింపుకు రోడ్డు వేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది.
అయితే, అలాంటిదేమీ లేదని ఇది ఉత్తుత్తి ప్రచారమే నని అదివారం నాడు సాంబశివరావు తెల్చేశారు.
ఈ రోజు పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో సమావేశమయ్యారు. తన ఫిరాయింపు మీదవస్తున్న వార్త ల గురించి వారితో చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని వీడతానంటూ జరిగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
. కొందరు కావాలనే పనికట్టుకుని తన మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తనని బాధించిందని ఆయన అన్నారు.
తనకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదని ప్రకటించారు.
సాంబశివరావు ఇంకా ఏమన్నారంటే…
నాకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదు. నేను పార్టీ మారే ఉద్దేశంతో ఎవరితో సంప్రదింపులు జరపలేదు.
నాకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను.
నియోజకవర్గ ప్రజలు కూడా రాజకీయ నేతగా కన్నా తమ కుటుంబ సభ్యునిగానే చూశారు. గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలిగాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాను.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పనులు వారు చేసుకుంటారనే ఉద్దేశ్యంతోనే కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను.
ఇపుడు నా నిబద్ధతకు ప్రశ్నించే విధంగా నాపై కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి నన్ను చాలా బాధిస్తున్నాయి. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వచ్చిన వార్తలు ఖండిస్తున్నాను.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉంటూనే ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు రాయడం మానుకోవాలి.