ఆంధ్ర ప్రదేశ్ ఆలయాలు దర్శనాలకు ఏర్పాటుచేస్తున్నాయి. జూన్ 8 నుంచి ఆలయాలలను, ఇతర ప్రార్థనమందిరాలలోకి ప్రజలను అనుమతించాలని కేంద్రం ప్రకటించడంతో ఈ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించే మార్గదర్శకాల ప్రకారం ఈ దర్శనాలను అనుమతిస్తారు. అయితే, దర్శనాలన్నీ లఘుదర్శనాలేనని తెలుస్తున్నది.
ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆలయాల్లో గంటకు 300 మందికే దర్శనం ఉంటుంది. అదీ లఘు దర్శనమే.
లఘు దర్శనం అంటే దేవుడిని 50 అడుగులు దూర్నాన్నుంచే దర్శనం చేసుకోవడం.తిరుమలకు సంబంధించి లఘదర్శనమంటే ప్రధానాలయం లోని మూడు వాకిలి దగ్గిర నుంచి దర్శనం చేసుకోవడం.ఇపుడు ఈ దర్శనాన్ని మాత్రమే అనుమతిస్తారని తెలిసింది.అంటే భక్తులకు స్వామిని దర్శించే భాగ్యం 30 నుంచి 40 సెకన్ల వరకు ఉంటుంది.
ఈ పద్ధతి సాధారణంగా జనం ఎక్కువగా ఉన్నపుడు అమలుచేస్తున్నది. మహా లఘ దర్శనం అని మరొక పద్దతి ఉంది.ఈ దర్శనంలో భక్తులు స్వామి వారిని ఆలయంలో చివరి తలుపు అంటే జయవిజయుల దగ్గిర నుంచి మాత్రమే దేవుడిని దర్శించుకోవాలి. ఈపద్ధతి లో దర్శన భాగ్యం కేవలం 10 నుంచి 12 సెకన్ల దాకా ఉంటుంది.
అంటే దర్శనానికి వచ్చే భక్తులకు అంతరాలయంలోకి ప్రవేశం ఉండదని అర్థం. ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూనే ఇది కరోనా వ్యాప్తికి దారి తీయకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నది.
ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ ఇలా పలు మార్గదర్శకాలనురూపొందించి వైద్యారోగ్య శాఖ అనుమతి కోసం పంపినట్లు తెలిసింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి దర్శనాల అనుమతి గురించి ప్రకటన చేస్తారు.
దేవాదాయ శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో ముఖ్యమయినవి:
* ఆలయాల దర్శన వేళలను అక్కడి పరిస్థితులను బట్టి కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి. * భక్తులు ముందుగానే దర్శనాాలను బుక్ చేసుకుంటే టైమ్ స్లాట్ దర్శనం కేటాయిస్తారు. * దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. * నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి.
* కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకటి విడిచి మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించాలి. * కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు ప్రతిసారీ జాగ్రత్తలు తీసుకోవాలి. * ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి. * అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు. * ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించవద్దు.