హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం వైసిపి బాపట్ల ఎంపి నందిగం సురేష్ కుమార్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లతో కలిపి 49 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో కోర్టు ధిక్కరణ అభియోగం మీద మెత్తం 93 మందికి ఇప్పటి వరకు నోటీసులు అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సీఐడీ అధికారులు కేసును విచారిస్తున్నారు.
హైకోర్టు జడ్జీలను కించపరిచేలా కొంతమంది వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుసుమోటోగా స్వీకరించింది.
ఇలా కోర్టు తీర్పుల మీద , రూలింగ్ మీద అభ్యంతకరమయిన వ్యాఖ్యలు చేయడమే కాకుండా న్యాయమూర్తులకు దురుద్దేశం అంటగట్టినందుకు 49 మందికి వైసిపి అభిమానులకు,కొందరు ప్రజాప్రతినిధులకు, మాజీ ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
గత వారం రోజులుగా రోజూ ఏదో ఒకే కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బతగులుతూ ఉంది. దీనితో వైసిసి నేతల్లోఅభిమానుల్లో అసహనం మొదలయింది. కొంతమంది నేతలు విలేకరుల సమావేశాలలో ఈ తీర్పులు వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఇంక సోషల్ మీడియా లో వచ్చిన పోస్టులకు లెక్కేలేదు.
కోర్టు తీర్పులమీద, చివరకు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమయిన పోస్టులను పెడుతున్నారని న్యాయవాది లక్ష్మినారాయణ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కోర్టులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశలో జరుగుతూ ఉందని అనంతరం న్యాయవాది విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.