హైదరాబాద్:- మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతి ని ఇటీవల కులం పేరుతో దూషించిన మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పై చాదరఘాట్ పోలీసు స్టేషన్ లో SC,ST చట్టం కింద కేసు నమోదు కావడం చేశారు. బలాలా మీద చర్యతీసుకోవాలని పలు దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. శ్రుతి బిజెపి నేషనల్ ఎస్ సి మోర్చా సెక్రెటరీ.
బలాలా పై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని ఇటీవల చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ ఎదుట బంగారు శృతి మరియు దళిత సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాల్ నగర్ లోఒక యువకుడు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘటన మీద విచారణ జరిపేందుకు శ్రుతి మరికొందరు దళిత నేతలతో కలసి మే నెల ఆరోతేదీన ఆ ప్రాంతానికి వెళ్లారు. అపుడు బలాల కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయన శ్రుతి బృందాన్ని ఉద్దేశించి ‘థర్డ్ క్లాస్ వాలే, చోరో లోగ్ ’ అని వ్యాఖ్యానించినట్లు ఆమె మే 9 తేదీన పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద పోలీసుల చర్య తీసుకొనకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్ దగ్గిర గురువారంనాడు నిరాహార దీక్షకు పూనుకుని బలాలాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.