ఆంధ్ర జివొ 203 ను స్వాగతించిన కళ్యాణదుర్గం మేధావులు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జి.ఓ 203 నేపథ్యంలో జల సంబంధిత అంశాలపై కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం సాయంత్రం గురజాడ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
అత్యంత కరువుపీడిత ప్రాంతమైన రాయలసీమకు కృష్ణానది వరదరోజులలో సంగమేశ్వరం నుండి మూడు టి.యం.సీ లను పోతిరెడ్డిపాడుకు ఇవ్వడం, ఎనభైవేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడం, కాలువల పెంపు తదితర అంశాలతో కూడిన జి.ఓ 203 విడుదల చేయడాన్ని  సమావేశం స్వాగతించింది.
 విస్తృత చర్చ అనంతరం సమావేశం పలు  తీర్మానాలు చేసింది.
తీర్మానాలు:
*కృష్ణానదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 1005 టి.యం.సీ లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు లభిస్తున్నాయి. వీటిని సక్రమంగా వినియోగించుకోంటే ఇరు రాష్ట్రాలలోని ప్రాంతాలకు న్యాయం జరుగుతాది.
*కృష్ణానదిపై ఇప్పటికే నికరజలాలతో కొనసాగుతున్న ప్రాజక్టులతో పాటు, ఇరు రాష్ట్రాలలో విభజన చట్టం ప్రకారం నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగు గంగ, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర కరువు పీడిత ప్రాజక్టులను కూడా కలిపి మొత్తం ఒక యూనిట్ గా తీసుకోని ప్రస్తుత బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టి జలాలు కేటాయింపులు చేయాలి.
*జలాల కేటాయింపులో వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
*రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ జి.ఓ 203 లాగే మరిన్ని పెండింగ్ ప్రాజక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని, వరదలు వచ్చిన సందర్భాలలో నీటి వినియోగానికి ఇవి తోడ్పడుతాయి.
*హంద్రీ-నీవా ద్వారా నిర్దేశిత చెరువులు, ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేందుకు వచ్చే పంటకాలానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
*కళ్యాణదుర్గం ప్రాంతంలో చెరువుల నింపడానికి, బి.టి ప్రాజక్టుకు నీళ్ళు అందించేందుకు తక్షణం పనులు చేపట్టాలి.
ఈ అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు, ప్రజలలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
సమావేశంలో గురజాడ అధ్యయన కేంద్రం సభ్యులు డాక్టర్‌ దేశం శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, నారాయణ రెడ్డి, శివశంకర్, మల్లికార్జున బాబు, చల్లా కిశోర్, ఓబుళరాజు, ప్రసాద్, నటరాజ్, ప్రదీప్, హరికృష్ణ, రాధాకృష్ణ నాగేష్, నాగరాజు,అచ్యుత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.