తెలంగాణ దీపికకు అమెరికా ప్రతిష్టాత్మక స్కాాలర్ షిప్

అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI)– హైదరాబాద్ లో బిఎస్పీ ఫారెస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ప్రతిష్టాత్మక అబర్న్ యూనివర్సిటీలో ఎం.ఎస్ కోర్సులో సీటు దక్కింది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. ఇంకా చివరి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఫారెస్ట్రీ కోర్సులో ఆమె ప్రతిభను చూసిన అమెరికా, అబర్న్ యూనివర్సిటీ ఎం.ఎస్ లో సీటును పూర్తి ఉచితంగా ఇచ్చింది.
రెండేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సు ఫీజు 15,000 డాలర్లను యూనివర్సిటీ పూర్తిగా మాఫీ చేయటంతో పాటు నెలకు 1500 డాలర్ల స్కాలర్ షిప్ ను కూడా మంజూరు చేసింది. రెండూ కలిపి దాదాపు యాభై లక్షల రూపాయల దాకా ఉంటుంది. అబర్న్ యూనివర్సిటీ లో ప్రముఖ డాక్టర్ జన్నా విల్లోగ్బి (Janna Willoughby) నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్ లైఫ్ ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది.
Dr Janna Walloughby (Credits Auburn University)

 

తెలంగాణ అటవీ కళాశాల గతంలో అమెరికా అబర్న్ యూనివర్సిటీ తోనూ, కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. మరో ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కే అవకాశం ఉందని డీన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అటవీ విద్యలో ఉన్నత చదువైన ఎం.ఎస్ ను తాను అమెరికాలో చదువుతానని అస్సలు ఊహించలేదని సూర్య దీపిక తెలిపింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు ఆమె కృతజ్జతలు తెలిపింది. అటవీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది తనకు అన్ని విధాలా అండగా నిలిచారని దీపిక అంటోంది.
హైదరాబాద్ శివారు ముగులులో నెలకొల్పబడిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ లో ప్రస్తుతం బీ ఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు నడుస్తోంది. 2016 కు చెందిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది ఉన్నత చదువులతో పాటు, సివిల్ సర్వీసులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా అందుకు సహకరిస్తోంది.
అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు వచ్చినట్లు కాలేజీ డీన్ చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్ లో 24 మందికి ఎం.ఎస్పీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు.