తెలంగాణ కేసీఆర్ కేంద్ర ప్యాకేజ్ పై మాట్లడిన భాషను తెలంగాణ సమాజం కూడా సమర్ధించదని చెబుతూ ఆ భాషను తానూ ఖండిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
20 లక్షల కోట్ల ప్యాకేజ్ తో తెలంగాణ ప్రజలకు మేలు జరగదని కెసిఆర్ ఎలా చెప్పగలడని ఆయన అన్నారు.
నిన్న రాత్రి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్యాకేజీ, రాష్ట్రాల మీద కేంద్రం అనుసరిస్తున్నధోరణిని ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిధులు ఎందుకూ చాలవని, కేంద్ర రాష్ట్రాలను బిచ్ఛమెత్తుకునే స్థాయి దిగజార్చిందని కెసిఆర్ తిట్టిపోశారు. కెసిఆర్ సహజశైలిలో మాట్లాడితే ఎవరినీ లెక్చచేయకుండా తిట్టడం ఉంటుంది. నిన్న కేంద్రం మీద అలాగే ఆయన మాట్లాడారు. అయితే, కేంద్ర మంత్రి వర్గంలో తెలుగువాడు కిషన్ రెడ్డి ఒక్కడే కాబట్టి ఆయనకు అర్థమయింది. అందుకే ఈరోజు ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. బహుశా కెసిఆర్ భాషను ఇక కేంద్రానికి కిషన్ రెడ్డి చేరవేయవచ్చు.
కేంద్రాన్ని విమర్శించేటప్పుడు ముఖ్యమంత్రి వాడిన భాషకు కిషన్ రెడ్డి అభ్యంతరం చెబుతూ ఆయన కేంద్రం తీసుకువచ్చిన ప్యాకేజీని సమర్థించారు.
ఒన్ నేషన్ ఒన్ గ్రిడ్ (One Nation One Grid) వచ్చాక విద్యుత్ సంస్కరణలు తప్పనిసరి అని, వాడుకొంటుంన్న కరెంటుకు లెక్కలు అడిగితే తప్పా అని కిషన్ రెడ్డి అన్నారు.
‘‘ బిచ్చం ఇచ్చే భాషా నియంతలే మాట్లాడతారు, ప్రజాస్వామ్యంలో ఒకరు బిచ్చం ఇవ్వడం,మరొకరు తీసుకోవడం ఉండదు. గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించక పోతే ఒక్క పైసా ఇవ్వను అన్నది కెసిఆర్ కాదా,’ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కెసిఆర్ రాష్ట్రాభివృద్ధి పేరుతో సాగిస్తున్న నియంతృత్వ పాలనని కూడా కిషన్ రెడ్డి తప్పు పట్టారు.
‘‘మున్సిపాలిటీలు స్వయంసమృద్ధి సాధించాలని ఎఫ్ఆర్బీఎం తెస్తే అదెలా తప్పు అవుతుంది. చెప్పిన పంట వెయ్యకపోతే రైతుబంధు ఇవ్వనంటు రైతు మెడ మీద కత్తి పెట్టింది ఎవరు?,’’ అని అన్నారు.
“తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని చెబుతున్నారు… సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో?. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామా? మీరు చేసింది సరైనప్పుడు.. కేంద్రం చేసింది ఎందుకు సరికాదు. రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారు. తెలంగాణ నుంచి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. వలస కార్మికుల సమస్య 30-40 ఏళ్ల నుంచి ఉంది. రాష్ట్రాల నుంచి వలసలు వెళ్లకుండా మార్పు జరగకూడదా?. పాలనా సంస్కరణలు.. విదేశీ పెట్టుబడులు రాకపోతే ఎలా? దేశ ప్రధానిని విమర్శించుకోవడం మంచిదా?. ఉపాధి హామీపథకానికి రూ.1.01లక్షల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 3 కోట్ల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇస్తున్నాం. ప్యాకేజీలో భాగంగా తెలంగాణలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు రావా? ముద్ర రుణాల ద్వారా చిన్న వ్యాపారులకు రుణాలు దొరకవా? ప్యాకేజీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి జరుగుతుంది. ప్యాకేజీ కింద ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే బోగస్ అంటారా? ’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
రాజకీయాలకతీతంగా కరోనా పై పోరాటం చేయాల్సిన ఈ సమయంలో విమర్శలు చేయడం తగదుని అంటూ దూరదృష్టితో దేశహితం కోసం చేసిన సంస్కరణలను విమర్శించడం కేసీఆర్ కి తగదుని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.