జోగులాంబ-గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన జెనీలా (20) ప్రసవం కోసం ఆరు ఆసుపత్రుల తిరిగి ఎక్కడా చికిత్స ఆదరణ దొరకక చనిపోయిన సంఘటలను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
హృదయ విదారకమయిన ఈ సంఘటన మీద హైకోర్టు న్యాయవాది కరణం కిషోర్ రాసిన లేఖను జస్టిస్ రామచందర్ రావు, జస్టిస్ లక్ష్మన్ ల బెంచ్ విచారణ కు స్వీకరించింది.
జెనీలా హృదయ విదారక గాథ ఇది
మొదట ఆమె ఏప్రిల్ 24 గద్వాల జిల్లా ఆసుపత్రికి వెళ్లింది బిపి తక్కువగా ఉంది.రక్తం కూడా లేదని అక్కడి డాక్టర్లు ఆమెను కర్నూలు తీసుకెళ్లాలని చెప్పారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా కర్నూలు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు చెప్పారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా కరోనా హాట్ స్పాట్ కావడంతో కోఠీ డాక్టర్ ఆమె కరోనా పరీక్షకోసంగాంధీ ఆసుపత్రికి పంపించారు. అక్కడ పరీక్ష ఆమెకు నెగటివ్ అని తేలింది. తర్వాత ప్రసవం కోసం పేట్ల బురుజు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కాన్పుచేశారు. మగబిడ్డ పుట్టాడు. బాబు కు ఉపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో నీలోఫర్ కు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పసిపిల్లవాడు చనిపోయాడు. మరొవైపు జెనీలా పరిస్థితి కూడా విషమించడంతో ఆమెను ఉస్మానియాకు తరలించారు. సోమవారం రాత్రి ఆమె అక్కడ మరణించారు. ఆమెకు సకాలంలో చికిత్స చేసిఉంటే భార్య పిల్లలు బతికిఉండేవారని భర్త చెప్పాడు. కరోనా అనుమానంతో ఆమె ను అరుఆసుపత్రులక తిప్పి డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. అయితే, ఆమెను ఆలస్యంగా తీసుకువచ్చారని డాక్టర్లు చెబుతున్నారు.
యువతి కుటుంబానికి పరిహారం చెల్లించాలన్న అభ్యర్థన బీద కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ సంఘటన మీద విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ కోర్టు తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్ జోన్లలో కరోనాయేతర వైద్య సేవల మీద కోర్టు కొన్ని ఆసక్తి కరమయిన ఆదేశాలు జారీ చేసింది.
కరోనాయేతర వైద్య సేవల కోసం కూడా అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. రెడ్ జోన్లలో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని, ఆస్పత్రుల్లో గర్భిణీలకు వైద్య సేవలందేలా ప్రబుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలకు పాస్ లు అడగొద్దని కూడా కోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో గర్భిణీలు, క్యాన్సర్, గుండె జబ్బులకు చికిత్సలు నిరాకరించడకుండా చూడాలని చెబుతూ తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.