కాళేశ్వరం ప్యాకేజీ- 27, 28 ద్వార నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు నీరు
రైతులకు నష్ట పరిహార చెక్కులు అందజేసిన మంత్రి అల్లోల
నిర్మల్, మే 15: తెలంగాణ రాష్ట్రం పూర్తిగా మారిపోయిందని, ఇపుడు రైతులువిత్తనాల కోసం పడరాని పాట్లు పడినరోజులు పోయాయని అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 28 ద్వారా భూములు కొల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను అందిస్తూ ఇలా మాట్లాడారు.
గతంలో విత్తనాలు ఎరువుల కోసం క్యూలో నిలబడే వారని, లాఠీచార్జీలు జరిగేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు.
రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని రైతులు సకాలంలో పంటలు వేసుకుని మంచి దిగుబడి సాధించుకోవాలని మంత్రి అన్నారు.
.కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 & 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందిస్తామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తానూర్ మండలానికి చెందిన 113 మంది రైతులకు మొత్తం రూ.8,12,40,250 ల నష్ట పరిహార చెక్కులను మంత్రి అల్లోల అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజీ 27 & 28 పనులు పూర్తైతే నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.
కాంట్రాక్టర్ల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని, సాధ్యమైనంత త్వరగా కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులకు చేయూత ఇవ్వడంలో సీయం కేసీఆర్ వెనుకంజ వేయలేదని, పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు.
రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం రూ. 8,210 కోట్లు విడుదల చేసిటనట్లు వెల్లడించారు.
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి నిధులు విడుదల చేశారని తెలిపారు.
గతంలో విత్తనాలు ఎరువుల కోసం క్యూలో నిలబడే వారని, లాఠీచార్జీలు జరిగేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.