అమరావతి: రైతులకు చేస్తామన్న సాయాన్ని ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలని మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మహన్ రెడ్డి అన్నారు. దీనికి సాక్ష్యంగా ఈ రోజు బటన్ నొక్కిన వెంటనే రైతుల కుటుంబాల ఖాతాల్లో రూ.5500 చొప్పున జమ అయ్యేలా చేశారు. ఈ రోజు ఆయన వైఎస్ ఆర్ రైతుభరోసా-ప్రధాని కిసాన్ యోజన పథకాలను ప్రారంభించారు. గత నెల రూ.2 వేలు పొందని వారికి ఇప్పుడు రూ.7500 జమ అవుతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
లాక్డౌన్ సమయంలో రైతులను ఆదుకోవడం కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.
ప్రతి విషయంలో రైతులకు మంచి జరగాలని ప్రభుత్వం పరితపిస్తోందని అందుకే చెప్పిన దాని కంటే ముందే, ఇస్తానన్న దాని కన్నా ఎక్కువ సహాయం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతాయని తెలిపారు. రైతులకు ఇంకా మంచి జరగాలని, వారికి సేవ చేసే అవకాశం రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
సాగు పెట్టుబడి కోసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కిన ఆయన, ఒకేసారి లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. 49,43,590 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత నెలలో రూ.2 వేలు తీసుకోని వారికి ఆ మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఒకేసారి రూ.7500 చొప్పున మొత్తం రూ.3675 కోట్ల ఇస్తున్నారు.
వీడియో ప్రదర్శన
కార్యక్రమంలో ముందుగా ప్రజా సంకల్పయాత్రలో విజువల్స్‌తో పాటు, మహానేత వైయస్సార్ విజువల్స్‌తో వీడియో ప్రదర్శించారు. తొలుత ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని అనుకున్నా, ఆ తర్వాత ఆ అన్నీ పెంచి, 5 ఏళ్లు, ఏటా రూ.13,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రతి రైతు కుటుంబానికి 5 ఏళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుందని సీఎం పేర్కొన్నారు.
రైతులకు ఎంత చేసినా తక్కువే
వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం బాధాకరం అన్న ముఖ్యమంత్రి, కానీ కరోనా వల్ల తప్పడం లేదని పేర్కొన్నారు. బహిరంగసభలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేయాలని ఉవ్విళ్లూరానని కానీ తప్పలేదని చెప్పారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
చెప్పిన దాని కన్నా ముందుగా.. ఎక్కువగా..
‘ఎన్నికల ప్రణాళికలో నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా ముందుగా, మెరుగ్గా చేయగలిగాం. నాలుగేళ్లకు బదులు 5 ఏళ్లు, రూ.12,500కు బదులు రూ.13,500 రైతుల చేతిలో పెడుతున్నాం’. ‘గత ఏడాది 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6534 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు 49.43 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. గత నెలలో రూ.2 వేలు ఇచ్చాం. కాబట్టి మిగిలిన రూ.5500 ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆలయాల భూములు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా సహాయం చేస్తున్నాం. గత నెలలో రూ.2 వేలు పొందని వారికి ఇప్పుడు రూ.7500 ఇస్తాం. వచ్చే అక్టోబరులో రూ.4 వేలు, ఆ తర్వాత పంట ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతి పండగ సందర్భంగా మరో రూ.2 వేలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
మరో నెల రోజులు అవకాశం
గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిటింగ్ కోసం గత నెల 24 నుంచి రైతుల పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా మిస్ అయితే దరఖాస్తు చేసుకోమని కోరామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మూడు వారాల్లో ఎవరైనా దరఖాస్తు చేయకపోతే, తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, మరో నెల రోజుల సమయం ఇస్తున్నామని వెల్లడించారు. కాబట్టి అర్హులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
కాల్ సెంటర్ రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా, వెంటనే 1902 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు ఏ రుణ ఖాతాలో జమ చేసుకునే వీలు లేదని స్పష్టం చేశారు.