ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి వస్తున్నది.
న్యాయ మూర్తులు, న్యాయ వాదులు ధరించే నల్ల కోట్లు గౌనులు ఇక కనిపించవు.
తీర్పు వెలువరించే న్యాయమూర్తులు నల్లకోట్ల, గౌనుల స్థానంలో ఇకనుండి తెల్ల షర్టు , ప్యాంట్ ధరించి వస్తారు.
న్యాయమూర్తులు, న్యాయ వాదులు ధరించే నల్ల గౌనులు , కోట్లు కరోనా వైరస్ వ్యాప్తి కారకాలుగా ఉంటాయని భావించిన ప్రధాన న్యాయ మూర్తి ఎస్ ఎ బాబ్దే ప్రస్తుతానికి నల్లకోట్లు వదిలేయాలని చెప్పారు. ఒక ప్రధాన మైన కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరుగుతున్నపుడు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రకటన చేశారు. అపుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు వాదిస్తున్నారు.
న్యాయమూర్తులు ఇందుమల్హోత్రా, రుషి కేష్ రాయ్ కూడా ప్రధాన న్యాయమూర్తితో ఉన్నారు. అపుడు డ్రెస్ కోడ్ చెబుతూ ఈ కొత్త డ్రెస్ కోడ్ గురించి తొందర్లోనే నియమ నిబంధనలు విడుదల చేస్తామని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు దేశవ్యాపితంగా లాక్ డౌన్ విధించిన మార్చి 25 నుంచి సుప్రీంకోర్టు కేసులను వీడియో కాన్షరెన్స్ ద్వారా వింటూ వుంది. అప్పటి నుంచి కోర్టు హైసెక్యూరిటీ జోన్ లోకి న్యాయవాదులను, సిబ్బందిని కూడా రానీయకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో న్యాయవాదుల గౌన్, కోటుల గురించి ప్రస్తావిస్తూఈ రెండు వైరస్ ను సులభంగా అంటుకునేపరిస్థితి ఉన్నందున వాటిని కొద్దిగా మానేయడం బాగుటుందని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు.