ఒకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వరస బెట్టి హైకోర్టు రద్దు చేస్తోంది. విధానపరమైన నిర్ణయాలను తప్పు పడుతోంది. ఇది అంతు చిక్కని ఫజిల్ గా వుంది. జగన్మోహన్ రెడ్డి గాని మరొకరు గాని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు రాజ్యాంగ న్యాయ సంబంధమైన అంశాల్లో నిష్ణాతులుగా వుండక పోవచ్చు. . అందుకే తుదకు ప్రధాన మంత్రి కూడా సలహాదారులను నియమించుకున్నారు. . ఆ మాట కోస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ పలువురు సలహా దారులు వున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు తటస్థించింది?
ఈ దేశంలో న్యాయ వ్యవస్థకు రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. . నేడు అది నిష్పక్షపాతంగా వున్నందున సరిపోయింది. లేకుంటే ఎవరైనా సరే కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని ప్రజలు తమకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని రాజ్యాంగ విలువలను దుమ్ములో కలిపే వారు. ఈ ప్రమాదం ఊహించబట్టే రాజ్యాంగ రూప కర్తలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
దేశ జీవనంలో చట్ట సభలు కార్యనిర్వాహక వర్గంతో పాటు న్యాయ వ్యవస్థ మూడు విభాగాలు ఏర్పాటు చేసి ఎవరి బాధ్యతలేమిటో రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. చట్ట సభలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి చట్టాలను రూపొందించాలని కార్యనిర్వాహక వర్గం విధులు స్పష్టంగా రాజ్యాంగంలో పొందు పర్చారు. అటు చట్ట సభలు చేస్తున్న చట్టాలు ఇటు కార్యనిర్వాహక వర్గం రాజ్యాంగ పరిధిలో వ్యవహరిస్తున్నాయా? లేదా అనే అంశాలను సమీక్షించే కర్తవ్యం విధులు న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కట్ట బెట్టింది.ఈ రోజు దేశంలో న్యాయ వ్యవస్థ ఖరాబు కాకుండా వుంది – కాబట్టి సరి పోయింది. లేకుంటే జాతీయ స్థాయి నుండి రాష్ట్రాల వరకు సంభవిస్తున్న సంఘటనలు పరిశీలించితే ఊహించడానికే భయమేస్తోంది
ఇంత ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపు తున్న విధానాలు జారీ చేస్తున్న జీవోల్లో ఎక్కువ భాగం రాష్ట్ర హైకోర్టు తప్పు పడుతోంది.. ఎందుకిలా జరుగుతోంది?
బహుశా భారత దేశంలో ఇంత తక్కువ కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సుప్రీంకోర్టుతో కూడా పేచీ పడిన సందర్భాలు లేవనిపిస్తుంది.
2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయం వ్యవస్థతో ఏమాత్రం పొసగడం లేదు. కనీసం మచ్చుకు ఒకటి రెండు కేసుల సందర్భంగా ప్రభుత్వ వైఖరిని న్యాయ వ్యవస్థ సమర్థించిన సందర్భాలు లేవేమో!
మొన్న సోమ మంగళ వారాల్లో రెండు రోజుల్లో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది.. మంగళవారం రెండు కేసుల అంశంలో హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బే.
పంచాయతీ కార్యాలయాలకు గ్రామ వార్డు సచివాలయాలకు రంగులు వేసే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థతో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరిస్తోందనిపిస్తోంది .. ఏ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. తుదకు ఈ పరిణామం ఏ దిశకు దారి తీస్తుందో ? ఈ పాటికే హైకోర్టు ఒక మారు రాజకీయ పార్టీల పతాకాల రంగులు పోలి వుండ కూడదని సూత్రబద్ద మైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అచ్చట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన పట్టు వీడకుండా ఇప్పుడు వున్న రంగులకు అదనంగా మరొక మట్టి రంగు కలిపి జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పట్టుదలకు ఎందుకు పోతోందో అర్థం కావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులు ఏ రాజకీయ పార్టీ పతాక రంగులు పోలి వుండ కూడదని హైకోర్టు ఆదేశాలు వుంటే అవే రంగులకు మరొక రంగు కలిపి రంగులు వేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం ఆశ్చర్యమేస్తున్నది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టి వేస్తూ మధ్యంతర తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ వేయ మని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా వుండగా రంగులు వేయడం తొలగించడం తిరిగి వేయడం వలన ప్రజా ధనం కోట్లాది రూపాయలు హారతి కర్పూరం అవుతోంది. ఈ పట్టుదలతో కోట్లాది రూపాయలు బుగ్గి పాలు కావడం ఈ ప్రభుత్వాధి నేతలు గుర్తించడం లేదు. ఒక వేపు కరోనా వైరస్ నిర్మూలనకు నిధులు కొరత మరో వేపు రాబడులు తగ్గి పోతున్న ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పంతానికి ఎందుకు పోవాలి? ఒక వేళ ప్రజల సంక్షేమ పథకాల అంశమైతే తెగించి పోరాడ వచ్చు.రంగుల అంశంలో ఇంత పట్టుదలకు పోతున్నారంటే ప్రజా సంక్షేమం కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా వున్నాయి. ఇదిలా వుండగా రాష్ట్రంలో రెండు రకాల చట్టాలు అమలు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలే కాకుండా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి పయనిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే ఏ ప్రతి పక్ష నేత కాలు కదిపితే కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు చాల కాలంగా వున్నాయి.
గతంలో కాంగ్రెస్ టిడిపి ప్రభుత్వాలు వున్నాయి.కొన్ని సందర్భాల్లో అధికార పార్టీకి సహజమైన వెసులుబాటు వుంటుంది. అయితే ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత వెంటనే పార్టీ అధినేత జోక్యం చేసుకొని కట్టడి చేయ వలసి వుంది. గతంలో ఇలా జరిగేది. తత్సంబంధిత నేతలను పిలిచి మందలించే వారు.ఈ అంశం మీడియా కెక్కేది. ఫలితంగా పార్టీ పరంగా హెచ్చరిక వెళ్లేది. తదుపరి నేతలు అట్టి చర్యలకు పాల్పడటం ఆగి పోయేది. లేదా కొన్ని సందర్భాల్లో కేసుల తీవ్రత బట్టి పోలీసులు కేసు నమోదు చేసే వారు.ఈ లాంటి హెచ్చరికలు వెళ్లితే ప్రజల్లో కూడా పార్టీ ప్రతిష్ట ఇనుమడించేది. ప్రస్తుతం ఇలాంటి సూచనలే లేవు. అధినేత నుండి హెచ్చరికలు లేక పోవడంతో ఎమ్మెల్యేలు నేతలు మరీ రెచ్చి పోయి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఈ లాంటి కేసు ఒకటి హైకోర్టు విచారణకు తీసుకొన్నది.
లాక్ డౌన్ నిబంధనలు అమలులో వున్నా అయిదు మంది వైకాపా ఎమ్మెల్యేలు నిబంధనలు అతిక్రమించారని వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని ఒక లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు పిటిషన్ ను విచారణకు తీసుకుంటూ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పైగా ఏం చర్యలు తీసుకున్నది నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డిజిపిని హైకోర్టు కోరింది.
ఇలాంటి సంఘటనల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి పక్కన పెడితే డిజిపి మాత్రం ఇరుకున పడ వలసి వస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు కేసు విషయంలో కూడా డిజిపి జవాబు చెప్పవలసి వచ్చింది. వాస్తవంలో ఈ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినట్లు సాక్ష్యాలు జాతీయ మీడియా వరకే కాకుండా బిబిసి వరకు వెళ్లాయి. రేపు కోర్టుకు ఏం జవాబు చెబుతారో చూడాలి.ఈ కథాకమామీశు ఇంతటితో ఆగలేదు. పరిశ్రమలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో (పిపిపి) నడిచే ప్రాజెక్టుల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం విధానం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర హైకోర్టు మొన్న మౌఖికంగా వ్యాఖ్యానించింది. ఈ నిబంధన ఏ మేరకు చట్ట బద్దత కలిగివుందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నెల రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులకు వర ప్రసాదంగా వుంది. కాని ఏ చర్య తీసుకున్నా రాజ్యాంగానికి అనువుగా వుందో లేదో పాలకులు ఎవరైనా తరచి చూడ వలసి వుంది. ఇదే సూత్రం హైదరాబాద్ లో అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన లక్షలాది మంది భవిష్యత్తు ఏం కాను?
ఇదిలా వుండగా గురువారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరో జలక్ ఇచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులను నిర్థారించుతూ ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో నెంబరు 15 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫీజుల నిర్ణయంలో కొన్ని కళాశాలలకు అన్యాయం జరిగిందని దాఖలైన పలు పిటీషన్లు విచారణ జరిపిన హైకోర్టు ఈ జీవో సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. గత నెలలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన రావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
అయిదు మంది ఎమ్మెల్యేల కేసు హైకోర్టు కెక్కిన తర్వాత కూడా రాష్ట్రంలో మార్పుకనిపించడం లేదు. రాష్ట్రంలో రెండు రకాల చట్టాలు అమలు జరుగుతున్నాయని అధికార పార్టీ వారైతే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే అపప్రధ మూట గట్టుకొంటున్నది. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో కరోనా వైరస్ పడగ విప్పినప్పటి నుండి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కింది స్థాయి సిబ్బంది చేసిన కృషి అద్వితీయం. కొన్ని చోట్ల కటువుగా వ్యవహరించినా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు శాఖ ఏమరు పాటు వహించి వుంటే మరింత నష్టం జరిగేది. నాణేనికి ఇది ఒక వేపు అయితే అధికార పార్టీ నేతలను కట్టడి చేయడంలో జరిగిన వైఫల్యం ఈ శాఖను బజారున పడవేస్తోంది.
ఇప్పుడే కాదు. తొలి నుండి వైకాపా ప్రభుత్వానికి న్యాయ స్థానాల్లో చుక్కెదురౌతోంది. వైకాపా అధికారంలోనికి రాగానే విద్యుత్ ఒప్పందాలు బిల్లులు చెల్లింపులపై పలు సంస్థలు హైకోర్టు కెక్కాయి. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్థలకు అనుకూలంగా వుందని తెలిసిన తర్వాత నైనా వెనక్కి తగ్గ వలసి వుండినది. ఈ కేసుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఇదిలా వుండగా ఇంగ్లీషు మీడియం అమలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కన్పించడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం దానితో పాటు రాజ్యాంగం నిబంధనలు మేరకు ప్రాధమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన వుండాలని ఏ మీడియంలో చదువుకోవాలనేది తల్లిదండ్రులు అభీష్టం మేరకు వుండాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
కాని ఒక పక్క కరోనా వైరస్ విలయ తాండవం సాగించుతుంటే ఇంటి నుండి బయటికి వచ్చేందుకు భయ పడే పరిస్థితులు వుంటే హడావుడిగా వాలంటీర్లను తల్లిదండ్రులు వద్దకు పంపి తమ పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువు కోవాలనే అఫిడవిట్ లు నేడు సేకరిస్తున్నారు. ఈ సంక్షోభంలో ఇవి అత్యవసరమా? ఇవే కాదు. భూసేకరణకు చెందిన కేసులు ప్రధానంగా కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఎన్నడూ ఎప్పుడూ ఈలాంటి సంఘటనలు చూచి ఎరుగము.
1953 లో ఆంధ్ర రాష్ట్రం 1956 ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఎంతో మంది ముఖ్యమంత్రలు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా న్యాయం వ్యవస్థతో తగదా పడిన సందర్భం లేదు. పైగా పలువురు కోర్టు ఆదేశాలను ఔదల దాల్చారు బస్సుల జాతీయకరణకు వ్యతిరేకంగా తీర్పు వస్తే నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారు. ప్రైవేటు వైద్య కళాశాల అంశంలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు తీర్పు ఔదల దాల్చి ముద్దు కృష్ణ నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదంతా గతం. ఇప్పటి నాయకులు అంత సాహసం చేసి రాజకీయ సంక్షోభాలకు తెర దీయ వలసిన అవసరం లేదు గతంలో జాతీయ పార్టీలు అధికారంలో వుండగా న్యాయ స్థానాల తీర్పులతో మరొక నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే వారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్నందున రాజు మంత్రి అంతా ఒకరే కాబట్టి గతంలాగా ఆలోచించ లేము. అయితే ఇప్పటి నేతలు రాజ్యాంగ సంక్షోభం సృష్టించకుండా వుంటే చాలు. ముందు చూపుతో రాజ్యాంగ రూప కర్తలు రూపొందించిన విలువలను కాపాడితే చాలు.ఇదిలా వుండగా మున్ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా వుండబోతున్నది.