(వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ, పాలిట్ బ్యూరో సభ్యుడు)
విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో వైకాపా ప్రభుత్వం మిలాఖత్ అయినట్లుగా కనపడుతోంది. 12 ప్రాణాలు కోల్పోగా , వందలమంది ఆస్పత్రి పాలయినా వేలాది మంది బాధపడేలా చేసిన యాజమాన్యాన్ని ఇంత వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైకాపా ప్రభుత్వం యాజమాన్యం వైపు ఎందుకు మొగ్గుచూపుతోందన్న ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలి! జనావాసాల మధ్య విషవాయువు వెదజల్లే కంపెనీలుండకూడదన్న ప్రజల అభిప్రాయానికి తెదేపా మద్దతిస్తోంది. ఎన్నిరోజుల్లో ఎల్జీ పాలిమర్స్ అక్కడి నుంచీ తరలిస్తారో సీఎం ప్రకటన చేయాలి. ప్రాణాల కోసం, మనుగడ కోసం స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకుని కంపెనీని తరలిస్తామని సీఎం ప్రకటన చేయాలి.
గతంలో ఎప్పుడూ జరగని ఘోరమైన సంఘటనను ప్రభుత్వం తేలిగా తీసుకోవడమేమిటి? ప్రభుత్వానికి ప్రాధాన్యతలు తెలియకపోవడానికి జగన్ పాలనా వైఫల్యమే ప్రధాన కారణమన్నది స్పష్టం. గ్యాస్ లీక్ సంఘటన జరిగిన తక్షణం కారకులను ఎందుకు కష్టడీలోకి తీసుకోలేదు? వేలాదిమంది ఇబ్బందుల పాలయినా యాజమాన్యానికి చీమైనా కుట్టినట్లు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా? అన్న ప్రజలు సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇంత పెద్ద ప్రమాదం జరిగితే విజయసాయిరెడ్డి విశాఖకు ఎందుకు వెళ్ళలేదు?ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఎల్జీ తెరవడానికి విజయసాయి రెడ్డి అనుమతులివ్వడమే కారణం కాదా? సీఎం జగన్ తక్షణమే విశాఖ వెళ్ళి గ్యాస్ ప్రమాద బాధితులకు సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు పీల్చడంతో అవయవ లోపం , మైండ్ పై ప్రభావం, లివర్ పనిచేయకపోవడం, కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 5 గ్రామాల ప్రజలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. స్థానిక ప్రజలకు తలెత్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ఎల్జీ పాలిమర్స్ బాధ్యత వహించాలి. బాధితులకోఆం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఎల్జీ పాలిమర్స్ నుంచి తీసుకుని రూ. 200కోట్లు ప్రభుత్వం తరఫున బ్యాంకులో జమ చేయించాలి. అనారోగ్య పీడితులు, బాధిత కుటుంబీకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలివ్వాలి. ఎల్జీ యాజమాన్యంతో జగన్ ప్రభుత్వం కుమ్మక్కయినట్లు ఉన్న అపోహలను నివృత్తి చేయాలి.
సీఎం విశాఖ వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమావేశమై వివరాలు సేకరించడంలో వైఫల్యం చెందారు. మృతుల కుటుంబాలను, నిరాశ్రయులైన బాధితులను గాలికి వదిలేసి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అనుకూలంగా పనిచేస్తున్న సీఎం తీరు అభ్యంతరకరం. కేసు రిజిస్టర్ చేసి యాజమాన్యాన్ని కష్టడీలోకి తీసుకొని జైలుకు పంపవద్దా? యాజమాన్యాన్ని న్యాయస్థానాలకు అప్పగించవద్దా? యాజమాన్యంతో సంభాషిస్తారా? హామీలిస్తారా?
విశాఖ విమానాశ్రయంలో యాజమాన్యంతో జరిపిన ముచ్చట్లు, ఒప్పందం, హామీలను రాష్ట్రప్రజలకు చెప్పాలి. విశాఖలో క్యాంప్ చేసి ప్రమాద తీవ్రత తగ్గేవరకూ, సాధారణ వాతావరణం నెలకొనే వరకూ బాధితులకు స్వాంతన చేకూరే వరకూ సీఎం అక్కడే ఉండాలికదా? చిత్తశుద్ధితో పని చేసేలా అధికార యంత్రాంగానికి సరైన దిశా నిర్దేశం ఇవ్వాలిగదా? గ్యాస్ ప్రమాద బాధితుల గోడు వినాలి, అన్నపానాల విషయం తెలుసుకోవాలి, రాత్రి వసతి సదుపాయం కల్పించడంపై శ్రద్ధ చూపాలి. గౌరవ ప్రదంగా జీవితం గడిపే ప్రజలను సీఎం బెగ్గర్స్ గా భావించారా? ప్రశాంత వాతావరణలో ఉండే విశాఖలో భవిషత్తులో విష వాయువుల నివారణ చర్యలు తీసుకున్నారా? విశాఖలో ఫ్యాక్షన్ సంస్కృతి రావడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. భోపాల్ లో అంతా అయిపోయిందకున్న తర్వాతా విషవాయువు ప్రభావం చూపింది.
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ముచ్చటించడం ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వారితో ఏం ముచ్చటించారో బహిర్గతం చేయాలి.ఇద్దరిమధ్యా ఒప్పందం జరిగి ఏం హామీ ఇచ్చారో వెల్లడించాలి. తప్పు చేసినందున అరెస్ట్ చేస్తామన్నారా? ఏం ఫర్లేదు తాను చూసుకుంటానన్నారా? తర్వాత మాట్లాడుకుందామన్నారా?’’ ప్రజల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి.
సీఎం వ్యవహార శైలికూడా సరిగాలేదు. ఎప్పుడెప్పుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోవాలన్న ఆతృత సీఎంలో కనిపించింది. రూ.కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే జై జగన్ అని ప్రజలంటారని సీఎం భ్రమించారు.12 మంది ప్రాణాలకు ధర కట్టారు. ఎల్జీ పాలిమర్స్ ఎక్కడ ఉందో తెలియదు, 5గ్రామాల ప్రజలను పరామర్శించలేదు ఓదార్పు ఇవ్వలేదు. వెంగళప్ప మంగళగిరి తిరునాళ్ళకు వెళ్ళాడు వచ్చాడన్నట్లు తయారయింది సీఎం పర్యటన. సీఎం బాధ్యత సరికాదు. గతంలో సీఎంల విధివిధానాలను ఆచరించే సహృదయత లేదు. ప్రమాదస్థలాన్ని నీళ్ళతో తడపమన్న తెదేపా నేతల సూచనలను పట్టించుకోలేదు. మళ్ళీ గ్యాస్ లీకయి ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందికదా?
జగన్ ప్రభుత్వ నిర్లక్షం వల్ల ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి ఎందరో రోడ్డున పడ్డారు. రాజకీయ పార్టీ ముఖ్యుడు ఒత్తిడి చేయకపోతే ఎల్జీ పాలిమర్స్ తెరుచుకొనేదికాదు,గ్యాస్ లీకయి ఇంతమంది మృతి, పలువురు ఆస్పత్రి పాలయ్యేవారు కాదుకదా? వేలాదిమంది నిరాశ్రయులయ్యేవారు కాదు. గ్యాస్ బాధితుల స్థితిగతులపై విచారణ చేయడం కనీస ధర్మాన్ని సీఎం విస్మరించారు. కోకో ఆటలో అలా వెళ్ళిఇలా వచ్చేసి నట్లు సీఎం పర్యటన ఉండటం శోచనీయం.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సీఎం బాధ్యతగా వ్యవహరించలేదు. సీఎం స్పందించే తీరు బాగాలేదు. కోటి పరిహారం ఇచ్చి యాజమాన్యాన్ని బయటపడేయడానికా?
గత ఏడాది సెప్టెంబరులో గోదావరిలో పడవ ప్రమాదంలో 36 మంది చనిపోతే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని తెదేపా డిమాండ్ చేస్తే రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే? సీఎంగా చంద్రబాబు ఉంటే జగన్ ప్రతిపక్షంలో ఉండి మృతులకు రూ.25లక్షలు డిమాండ్ చేసేవారుకదా? సిఎం జగన్ ద్వంద్వ వైఖరి చూపుతారని స్పష్టంగా తెలుస్తోంది. పడవ ప్రమాద మృతులకు రూ.25 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతులకు రూ.1కోటి ఎలా ఇచ్చారు?
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని రక్షించడానికే సీఎం తాపత్రయపడుతున్నారు. గ్యాస్ లీకేజీతో ఇంతమంది చనిపోతే ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం వ్యవహరిస్తున్నారు. విజయ సాయిరెడ్డి కడప సంస్కృతిని విశాఖలో ప్రవేశపెట్టారని ఆందోళన చెందుతున్నారు. `అయినదానికీ కానిదానికీ ఎగబడే విశాఖ ఎలుక ఏదీ ? విశాఖ ఎలుక ను తాడేపల్లిలో సీఎం కారులో నుంచి దించేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు. సీఎంతోపాటు విశాఖ ఎలుక ఉన్నట్లయితే ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యేవారు. ఎలుకేకదా ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు మంజూరు చేసింది. చీమచిటుక్కుమంటే ప్రత్యక్షమయ్యే ఆ ఎలుక ఇప్పుడు ఏ కలుగులో దాక్కుందీ? విశాఖ వ్యవహారలన్నీ తనకనుసన్నల్లో జరుగుతాయని చెప్పుకుంటూ, మూతికి చిక్కం కట్టుకుని తిరిగే ఎలుక విశాఖకు రాదే? విశాఖలో 12 మంది చనిపోడానికి ఎలుక ధనాశే కారణం కాదా? ఎలుకకు ఉన్న ట్రస్ట్ లో ఎల్జీ పాలిమర్స్ పెద్దెత్తున విరాళాలిచ్చింది నిజమోకాదో విచారణ జరిపి సీఎం నిర్ధారణ చేయాలి’’. ఎల్జీ పునః ప్రారంభానికి ప్లాస్టిక్ తయారీ ఎమర్జెన్సీ కిందకు వస్తుందా? విశాఖలో ఎన్ని విషవాయువు వెదజల్లే ప్రమాదకర కంపెనీలు ఎన్నున్నాయో సీఎం సమీక్ష చేశారా?