రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇపుడు ప్రతిపక్ష నేతలపై దాడులకు, మీడియా మీద దాడులకు పూనుకుంటున్నదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
ఈ రోజు విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ ఇలా అన్నారు.
ప్రజా సమస్యలను ఎత్తిచూపితే మాపై మాచర్లలో హత్యాయత్నం చేశారు. ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఫ్యాక్షన్ మనస్తతత్వంతో పనిచేస్తోంది. టీడీపీనే కాకుండా అన్ని వ్యవస్థల్లోనూ ఇదే విధంగా ఉంది. మీడియాను నిలువరించేందుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారు. మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. చీఫ్ రిపోర్టర్లను బెదిరించడం, మీడియా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం, ఇవాళ టీవీ 5 కార్యాలయంపై దాడికి పాల్పడి అద్దాలు పగులగొట్టారు. మొత్తం ఆఫీసును తగులబెట్టాలని చూశారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా. నియంతపాలన సాగుతోంది. టీవీ 5పై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దొంగ జీవోను తీసుకువచ్చి పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
జర్నలిస్టుల ఖండన
TV 5 కార్యాలయం పై జరిగిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్,ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ హైదరాబాద్ అధ్యక్షులు యోగానంద,ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యార లు డిమాండ్ చేశారు.