ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అదేవిధంగా లిక్కర్ షాపుల టైమింగ్ ను మార్పు చేసింది.షాపుల తగ్గింపు మే చివరకు పూర్తయితే, కొత్త టైమింగ్స్ రేపటి నుంచే అమలులోకి వస్తాయి. కొత్త టైమింగ్స్ ప్రకారం షాపులు ఉదయం పది నుంచి మొదలయి సాయంకాలం అయిదింటికి మూతపడతాయి.
తాజాగా మరో 13 శాతం షాపులు తొలగింపునకు జివొ జారీ చేశారు. గతంలోనే 20 శాతం షాపులను తొలగించారు. ఇపుడు 13 శాతం షాపులు మూసేస్తే మొత్తం 33 శాతం షాపులను తగ్గించినట్లవుతుంది. ఫలింగా రాష్ర్ంలో గతంలో ఉన్న 4380 షాపులు 2934కి తగ్గుతాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులు తొలగించారు.
వివరాలు:
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43000 బెల్టు షాపులను తొలగించింది. దీంతో పాటు ప్రైవేటు వ్యక్తుల మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటట్టు నిర్ణయం తీసుకుంది.
1. లిక్కర్ షాపుల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్ రూంలను రద్దు చేసింది. 2. ఒక వ్యక్తి గరిష్టంగా లిక్కర్ లేదా బీరు కేవలం మూడు బాటిల్స్ వరకు మాత్రమే కొనుగోలుకు అవకాశమిచ్చింది. అంతకు మించి కొనుగోలు చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. 3. మద్యం అమ్మకాలను తగ్గించేందుకు కాలపరిమితిని విధించింది. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాల ఇచ్చిన కాలపరిమితిని తగ్గించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేసింది. 4. మద్యం వినియోగాన్ని మరింత గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4380 నుంచి 3500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇపుడు మరొక 13 శాతం తగ్గుతున్నాయి. 5. మద్యం అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్, స్వయంగా రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 6. మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు మద్యం ధరలను 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం కొనాలంటేనే భయపడేలా షాక్ కొట్టే విధంగా ధరలను పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంది. 7. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి. 8. వీటికి తోడు మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ద్వారా మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
9. వీటితో పాటు ప్రభుత్వం అక్రమ మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 10. అక్రమ మద్యం తయారీదారులపై గట్టి నిఘా పెట్టి వారిపై తరచూ దాడులు నిర్వహిస్తోంది. 11. ఫలితంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం అమ్మకాలు, తయారీ, రవాణాపై గట్టి నిఘా పెట్టి పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది.