విశాఖ జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్ జి (LG) పాలిమార్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చినది. ఘటన తర్వాత ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకున్నది. పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. ఘటనకు కారణాలు , బాధ్యలపై చర్యలు తీసుకోవాలి. అన్నింటి కన్నా ప్రధానం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అన్నదాని ఇపుడు చర్చ జరగాలి.
సాంకేతిక అంశాలు సంబంధిత నిపుణులు మాట్లాడుతారు. ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఘటన జరిగినపుడు ఎంత వేగంగా స్పందిస్తామో ఆ తర్వాత అంతకన్నా వేగంగా మరిచిపోతుండటం మన బలహీనత. ఈ ధోరణి దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి మూలం.
ప్రకృతి వైపరీత్యాలపై అనునిత్యం నిర్లక్ష్యం
ప్రకృతి వైపరీత్యాలు జరగడం సహజం మనం చేయాలసింది అవకాశం ఉన్నమేరకు దూరంగా ఉండటం. ఉదాహరణకు తుపాను.. తుపాను కారణంగా విశాఖ , చెన్నై నగరాలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. రెండు ఘటనలలో కీలకమైన అంశం చెరువులు ధ్వంసం. ప్రభుత్వం , ప్రతిపక్షాలు , ప్రజలు ఈ పాపంలో భాగస్వాములే. నీటి ప్రవాహానికి ఆటంకాల వలన జన నివాసాలు ప్రభావానికి గురౌతున్నాయి. అయిన చెరువుల పునరుద్ధరణకు అడుగులు వేయడం లేదు.
విశాఖ ఘటన కూడా ఆలాంటిదే
గ్యాస్ ఆధారిత పరిశ్రమ నెలకొల్పినపుడు ఆ ప్రాంతం నగరానికి వెలుపల ఉన్నది. నేడు పరిశ్రమను దాటి కిలో మీటర్ల విస్తరణ జరిగింది. నగర అభివృద్ధి అందామా ? మానవ నివాసాలకు దూరంగా ఉండాల్సిన పరిశ్రమల చుట్టూ నగరం ఎలా అభివృద్ధి జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుమతులు ఎలా మంజూరు చేసింది. ప్రజలు కూడా పర్యావరణ వేత్తలు , మేధావులు చేసే ప్రయత్నాలకు సహకరించక పొగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కనీస ప్రమాణాలు పాటించని పరిశ్రమలు , పట్టించుకోని వ్యవస్థ
పరిశ్రమల స్థాపన నుంచి నడపడం వరకు అన్నీ ఉల్లంఘనలే. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే ముందు ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి అని మాట్లాడే వారందరూ దేశద్రోహులే ! పరిశ్రమల నిర్వహణలో ప్రమాణాల పాటింపుపై కనీస తనిఖీలు లేవు అన్నది నిజం. నేడు విశాఖ పరిశ్రమలో 40 రోజులు లాక్ డౌన్ తర్వాత పరిశ్రమ పునరుద్ధరణ జరిగింది. లాక్ డౌన్ విధించే సమయంలో ఏ రంగంలో ఏమేరకు లాక్ డౌన్ ఉండవచ్చు. తిరిగి ప్రారంభించే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉండవు. సున్నితమైన పరిశ్రమలు ప్రారంభించే సమయంలో ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద పరిశ్రమలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధిత శాఖ మార్గదర్శకాలు రూపొందించినదా ? కీలకమైన , సున్నితమైన సంస్థలు సుదీర్ఘ కాలం తర్వాత ప్రారంభించే సమయంలో అధికారులు స్వీయ పర్యవేక్షణ చేసే ఏర్పాట్లు లెవా ? లాంటి అంశాలును లోతుగా అధ్యయనం చేయాలి. ఈ విషయంలో ఆలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రకృతి వైపరీత్యాలకు అడ్డంగా పొవడం కాదు దూరంగా ఉండాలి
సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నా ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా మానవ నివాసాలు , నగరాల నిర్మాణం జరగాలి. విశాల భూభాగం ఉన్న మన రాష్ట్రంలో ఏ ప్రాంతం దేనికి అనువయినదో అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. విషవాయువులు వేదజల్లే అవకాశం ఉన్న సంస్థలను జనావాసాలకు దూరంగా ఉండాలి. నగరాల నిర్మాణం , ప్రజల నివాసాలకు అనుమతులు ప్రకృతి వైపరీత్యాలకు అవకాశం ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండాలి. విశాఖ దుర్ఘటన నేపద్యంలో ప్రమాదానికి గురైన ప్రజలకు మెరుగైన వైద్యం , ఇతర ఉపశమన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం. మరోమారు ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేని పరిస్థితులు వైపు అడుగులు వేయడం వివేచన కలిగిన పాలకులు చేయాల్సిన పని. సత్వర చర్యలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగానే స్పందించినది. శాశ్వత పరిష్కారం కోసం కూడా అదే అడుగులు వేయాలి ! అందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలది.