వైజాగ్ లో ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చిందని, గ్యాస్ బారిన పడిన వారంతా కోలుకుంటారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.
గ్యాస్ పీల్చకుని సుస్తీ అయిన వారికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అని ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని, తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారని ఆయన ప్రకటించారు.
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి విశాఖలోని పరిస్థితిని గమనిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఎల్జీపాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని, వారిలో చాలా మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని అన్నారు.
లీకైన గ్యాస్ ను ఎక్కువ మొత్తంలో పీల్చిన వారికే ప్రమాదం ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ గ్యాస్ అంత ప్రాణాంతకం కాదని, దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జి అవుతారని సవాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం మృతుల వివరాలు
విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీక్ ఘటన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 9కి చేరిందని చెప్పారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
కుందన శ్రేయ (6), ఎన్.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు.
ఇందులో చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్ లీకైన ప్రాంతాల్లో ఉండే వారు. గ్యాస్ పీల్చుకుని ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందారు, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరొక సారి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.