విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏపీ సీఎం జగన్ హుటాహుటిన విశాఖకు బయలుదేరి ఘటనపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తక్షణ చర్యల కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు. బాధితులకు అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపు నుండి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
కాగా గ్యాస్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. లీకైన విషవాయువు పీల్చి పలువురు మృత్యువాత పడిన దుర్ఘటనను సుమోటోగా తీసుకుంది హైకోర్టు.
అధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఫ్యాక్టరీ ఎలా ఉందని అనుమానం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ప్రజలను ఇబ్బందికి గురి చేసే ఇలాంటి పరిశ్రమలు జనావాసాల మధ్య ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా పేర్కొంది. తదుపరి విచారణ వారం రోజుల పాటు వాయిదా వేసింది.