విశాఖపట్నం గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురం ఈ తెల్ల వారు జామున ఉపిరాడక ఉక్కిరిబిక్కిరయిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీక్ వల్ల మొత్తం పదకొండు మంది చనిపోయారు.. కొంతమంది ప్రజలు సృహ కోల్పోయారు. కొందరికి చర్మం మీద దద్దులు వచ్చాయి. నిద్రమత్తు విదిలించుకుని చాలా మంది ప్రాణభయంతో పరిగెత్తారు. అంబులెన్సలొచ్చి చాలా మంది ఆసుప్రతులకు తరలించాయి. కారణం: అక్కడి ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఇది సుమారు 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలలో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
లీకయిన ట్యాంకులో రెండువేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉండింది. మరొక ట్యాంక్ లో మూడు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. అయితే, లీకయిపుడు గ్యాస్ నిప్పంటుకోలేదు.ఎందుకంటే, లీకయిన స్టైరీన్ గ్యాస్ దహశీల వాయువు. నిప్పంటుకుని ఉంటే పేలుడు భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని కొంత మంది అధికారులు చెప్పారు.
ఇంతకు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే…
స్టైరీన్ గ్యాస్ సాధారణంగా ద్రవస్థితిలో ఉంటుంది. అయితే అది సులభంగా ఆవిరయి గాలిలోకి వ్యాపిస్తుంది. స్టైరీన్ గ్యాస్ ను 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దనే నిల్వ చేయాలి. ఉష్ణోగ్రత అంతకు మించి పెరిగితే అది ఆవిరయిపోతుంది. సురక్షితంగా ఉండాలంటే ఎపుడూ స్టైరీన్ ట్యాంక్ లో ఉష్ణోగ్రత 20 డి.సెంటిగ్రేడ్ లోపు ఉండేలా చూడాలి. అది ఈ రోజు తారుమారయింది. దీనికి కారణమెవరో తెలియదు.
ఈ రోజు ఫ్యాక్టరీ ప్రారంభించాలనుకున్నపుడు రిఫ్రెజిరేషన్ పనితీరులో తేడా వచ్చింది. ఈ గ్యాస్ నిల్వవున్న ట్యాంక్ లో ఉష్ణోగ్రత పెరగడం మొదలయింది. అంతే, స్టైరీన్ ద్రవం గ్యాస్ గా మారడం మొదలయింది. ఇదే గ్యాస్ పెరిగి, వత్తిడి పెరిగి ట్యాంక్ నుంచి లీకయిందని దారి తీసిందని పరిశ్రమల శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.