కరోనా రాజకీయాలు: కుదేలైన ఆర్థిక వ్యవస్థలు – బలైపోతున్న ప్రజలు

(టి.లక్ష్మినారాయణ)
1. అధ్యయనం, సత్యాన్వేషణ, ప్రశ్నించడం ఉత్తమ లక్షణాలు. అనుమానాలు, అపోహలు సృష్టించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం, విషప్రచారం చేయడం అత్యంత హానికరమైనవి, అనారోగ్యకరమైన లక్షణాలు. “నావెల్ కరోనా వైరస్” ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు హెచ్.ఓ.) నిర్ధారించింది. కరోనా వైరస్ కంటే అనేక రెట్లు వేగంతో దాని పుట్టుకకు సంబంధించిన అనుమానపు భీజాలను ప్రజల్లో నాటే ప్రచారం ప్రపంచాన్ని చుట్టేసింది.
2. “నావెల్ కరోనా వైరస్” పుట్టుక సహజ సిద్ధమైనదేనా! లేదా! చైనా ప్రపంచాధిపత్యకాంక్షను నెరవేర్చుకోవడానికి సృష్టించబడిన సూక్ష్మ క్రిమా! చైనాలోని వూహాన్ సూక్ష్మ క్రిముల పరిశోధనా కేంద్రంలో గోప్యంగా జీవాయుధం తయారు చేస్తుంటే కరోనా వైరస్ తప్పించుకొని బయటపడిందన్న ఆరోపణలకు ఆధారాలేమైనా ఉన్నాయా! ప్రపంచ ప్రజానీకంలో రేకెత్తించబడిన ఈ అనుమానాలను ఎవరు నివృత్తి చేయగలరు?
3. అంటువ్యాధుల్లో అత్యధిక భాగం జంతువుల ద్వారానే మనుషులకు వ్యాప్తి చెందాయని “వైరాలజిస్ట్స్” నిర్ధారించారు. సమాజ శ్రేయస్సు లక్ష్యంగా సూక్ష్మ క్రిముల పరిణామక్రమంపై అంకితభావంతో పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు “వైరాలజిస్ట్స్” మాత్రమే “నావెల్ కరోనా వైరస్” పుట్టుక అంశాన్ని లోతైన అధ్యయనానంతరం నిగ్గుతేల్చగలరు. అంతే కానీ, పూటకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడో, రాజకీయ నేతలో మాత్రం కాదు.
4. డోనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి వెనుక కుట్ర ఏమైనా దాగి ఉన్నదా! చైనా తప్పుడు సమాచారం ఇచ్చిందని, సమాచారాన్ని దాచి పెట్టిందని, కుట్ర దాగి ఉన్నదన్న ఆరోపణలు చేయడం ద్వారా సమస్యను ప్రక్కదారి పట్టించడానికే దోహదపడుతుంది. ఆధారరహితమైన ఆరోపణలు, విషప్రచారాలు, సంకుచిత రాజకీయాలు “కోవిడ్ -19” చుట్టూ అల్లబడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహణ కోసం అమెరికా ఇవ్వాల్సిన నిథులను కూడా ట్రంప్ నిలిపేశారు. చైనాపైకి కాలుదువ్వుతున్నాడు.
5. ప్రపంచ ముఖ చిత్రం, ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికమైన, గుణాత్మకమైన మార్పులు అనివార్యంగా సంబవించే వాతావరణం నెలకొన్నది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితికి దారి తీసింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి రాజకీయ రంగంలో పెనుమార్పులకు తెరతీయవచ్చు!
6. నేను 1955లో పుట్టాను. నేను పసి వాడుగా ఉన్నప్పుడు నాకు తీవ్రమైన జ్వరం వచ్చిందని మా అమ్మా, నాన్నా చెప్పగా విన్నాను. మాదొక కుగ్రామం. ఆ రోజుల్లో మండల వ్యవస్థ లేదు. కడప జిల్లా రైల్వే కోడూరు సమితి పరిథిలో మా గ్రామం ఉండేది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదు. నాటు వైద్యులు, వ్యాప మండలతో మంత్రించే మంత్రగాళ్ళ మీదే జబ్బులొస్తే నయం చేసుకోవడానికి ప్రజలు ఆధారపడే రోజులవి. అలాంటి వైద్యాన్నే నాకు ఇప్పించారట. ఎన్ని రోజులైనా తగ్గకపోగా విషమించడంతో మంచం మీద చనిపోతే అరిస్టమని నేల మీద చాప పరిచి, దానిపై వేపాకు మండలు వేసి పడుకోబెట్టి, దింపుడు కళ్ళం ఆశతో ఎదురు చూశారట. మొత్తం మీద బ్రతికి బయటపడ్డాను.
7. “కోవిడ్ -19″(నోవెల్ కరోనా వైరస్) ప్రపంచ మానవాళిని వణికిస్తున్న నేపథ్యంలో సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలిన అంటువ్యాధుల చరిత్రను తెలుసుకోవాలన్న ఆసక్తితో చరిత్రకారులు, వైద్య రంగానికి చెందిన శాస్త్రవేత్తలు వ్రాసిన కొన్ని వ్యాసాలను చదివాను. అందులో ఒకటి,1957-58 సం.లలో ప్రపంచ వ్యాపిత మహమ్మారిగా ప్రకటించబడిన హెచ్2ఎన్2(ఏసియన్ ఫ్లూ). ఆ “వైరస్” పుట్టుక కూడా చైనాలోని ఘీజోవ్. దాని వల్ల పది లక్షల మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. బహుశా ఆ కాలంలోనే నేను తీవ్ర జ్వరంతో జబ్బునపడ్డానేమో అన్న అనుమానం నాకు కలిగింది. నిర్ధారించడానికి మా తల్లిదండ్రులు లేరు.
8. మానవ నాగరికత వికసిస్తున్నది. సూక్ష్మ క్రిములు కూడా రూపాంతరం చెందుతూ ప్లేగు/ అంటువ్యాధులు మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. విపత్తులను సృష్టిస్తూ, సర్వనాశనం చేస్తూ, ప్రపంచ గమనాన్ని మారుస్తూనే వస్తున్నాయి. చరిత్రపూర్వ కాలం(prehistoric times) నుండి ఈనాటి వరకు అంటువ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి.
9. జనాభా పెరుగుతున్నది. జనసాంధ్రత పెరుగుతున్నది. శారీరక శ్రమ కంటే మేధోశ్రమపై ఆధారపడే విజ్ఞాన వ్యవస్థలోకి అడుగులు వేస్తున్నాం. ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు చోటు చేసుకొన్నది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడ్డ దేశాలలో పౌష్టికాహార లోపంతో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నది. పర్యవసానంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
10. సంపదను గుట్టలు గుట్టలుగా పోగేసుకొనే దురాశతో సహజ వనరులను కొల్లగొడుతూ పర్యావరణ సమతుల్యతను ధ్వంసం చేస్తున్నారు. పందులు, ఎలుకలు, బొద్దెంకలు, దోమలు, గబ్బిలాలు, అడవి జంతువులు, వగైరా ప్రాణులతో సహజీవనం చేస్తున్నాం. మరొక వైపు పారిశుధ్య సమస్య ఉండనే ఉంది. అంటువ్యాధులు ప్రబలడానికి ఇవన్నీ కారకాలే.
11. కొత్త కొత్త “వైరస్” పుట్టుకొచ్చి మనిషిని వణికిస్తున్న ఉదంతాలు చరిత్ర పుటలు తిరగేస్తే అనేకం కనిపిస్తాయి. వైరస్ రూపం మార్చుకొంటూ మానవాళిపై దాడి చేస్తూనే ఉన్నది. ఒకనాడు దూర ప్రయాణాల కోసం మనిషి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. అందు వల్ల మనిషి ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ఆయా ప్రాంతాలకే పరిమితమయ్యేవి లేదా కట్టడిచేయబడేవి. కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుతో, ప్రపంచీకరణ పర్యవసానంగా ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ప్రాణాంతకమైన అంటువ్యాధుల వ్యాప్తి అంతే వేగంగా జరుగుతున్నది.
12. మానవాళి చరిత్ర రచనకు పూర్వం సంబవించిన అంటువ్యాధుల గురించి అధ్యయనం చేయడానికి ఆధారాలు దొరకవు. చరిత్ర రచన ప్రారంభమైన నాటి నుంచి ప్రబలిన అంటువ్యాధుల చిట్టా చాలా పెద్దదే. అది అసమగ్రంగానే ఉంటుంది. 19వ శతాబ్ధం నుండి ప్రబలిన అంటువ్యాధులకు సంబంధించి కాస్త సమగ్రమైన సమాచారం లభించే అవకాశం మెండుగా ఉన్నది.
* ప్లేగు వ్యాధి (ఎలుక ద్వారా వ్యాపించు వ్యాధి – సి.ఇ.541): రోమ్ లోని కాన్స్టాంటినోపుల్, ఈజిప్ట్ నుండి మధ్యధరా సముద్రం మీదుగా ఎలుకల ద్వారా ఐరోపా, ఆసియా, ఉత్తర ఆఫ్రికా మరియు అరేబియా ప్రాంతాలకు కారిచ్చులా వ్యాపించి, మూడు నుండి ఐదు కోట్ల మంది (ఆనాటి ప్రపంచ జనాభాలో దాదాపు సగ భాగం) ప్రజల ప్రాణాలను బలిగొన్నదని చరిత్రకారులు అంచనా వేశారు. ప్లేగు వ్యాధి నుండి బయటపడ్డ వారిలో వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
* బ్లాక్ డెత్(గజ్జలలో బిళ్ళలు కట్టుట):
ప్లేగు అంటువ్యాధిని వ్యాప్తి చేసే సూక్ష్మజీవులు అంతరించి పోలేదు. 800 సం.ల తదనంతరం తిరిగి క్రీ.శ.1347లో “బ్లాక్ డెత్” రూపంలో ఐరోపాను కబళించి, నాలుగేళ్ళలో 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొన్నదని చరిత్ర చెబుతున్నది.
ఆ అంటువ్యాధిని నిరోధించే శాస్త్రీయ పరిజ్ఞానం నాడు లేదు. ప్రజల మధ్య సామీప్యత పర్యవసానంగా అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతున్నదన్న ఆలోచన నాటి నావికాధికారుల్లో రేకెత్తడంతో కొత్తగా తీరానికి చేరిన నావికులను నెల రోజులకుపైగా ఒంటరిగా ఉంచి, వారు అనారోగ్యంగా లేరని నిర్ధారణ అయిన తరువాతనే అనుమతించే వారు. నాటి నుంచే “క్వారంటైన్”/ దిగ్బంధం అన్న విధానం పాటించబడింది. దాన్నిబట్టి “క్వారంటైన్” విధానం పాశ్చాత్య ప్రపంచం నుండే అమలు మొదలయ్యిందని బోధపడుతున్నది.
* ది గ్రేట్ ప్లేగు ఆఫ్ లండన్: “బ్లాక్ డెత్” తదనంతర కాలంలో 1348 -1665 మధ్య , ఇరవై సం.లకు ఒకసారి దాదాపు 40 సార్లు అంటువ్యాధులు ప్రబలాయి. ప్రతిసారి బ్రిటన్ రాజధాని లండన్ జనాభాలోని 20% మృత్యవాత పడ్డారు. వ్యాధిగ్రస్తులను వేరు చేసి ఒంటరిగా దిగ్భంధంలో ఉంచడానికి వీలుగా 1500 సం. ప్రారంభంలోనే ప్రప్రధమంగా శాసనాన్ని రూపొందించి, బ్రిటీష్ ప్రభుత్వం అమలు చేసింది. 1665-66లో “గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్” లక్ష మందిని ఏడు నెలల కాలంలో బలిగొని అత్యంత విషాదకరమైన ఉదంతంగా చరిత్రలో నమోదయ్యింది.
* 1545-48 కాలంలో “కోకోలిజ్ట్ లీ” అంటువ్యాధి మెక్సికో మరియు మధ్య అమెరికా, 16వ శతాబ్ధంలో అమెరికన్ ప్లేగు, గ్రేట్ ప్లేగు ఆఫ్ మార్సీల్లే(1720-23) ప్రాన్స్, రష్యన్ ప్లేగు(1770-72), ఫిలడెల్ఫియా ఎల్లో ఫీవర్ అంటువ్యాధి(1793), ప్లూ పెడిమిక్(1889-90), ఆ కాలంలోనే “ది ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ -1897” రూపొందించబడింది.
* స్మాల్ ఫాక్స్(మశూచి/పెద్ద అమ్మవారు): ఐరోపా నుండి ప్రబలిన అంటువ్యాధి ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది. ఐరోపా, ఆసియా, అరబిక్ లలో మశూచీ శతాబ్ధాలుగా స్థానిక వ్యాధిగా పరిగణించబడింది. కీ.శ.18వ శతాబ్ధంలో ప్రప్రథమంగా మశూచీ వైరస్ కు వాక్సిన్ తయారు చేయబడింది. 1980 నాటికి మశూచీని పూర్తిగా నిర్మూలించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
* కలరా: 19వ శాతాబ్ధం తొలినాళ్ళలో, భారత దేశంలోని గంగా నదీ తీరంలో కలరా పుట్టి, ప్రపంచ వ్యాపితంగా విస్తరించిందని చెప్పబడుతున్నది. ప్రతి ఏడాది పదుల వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయని పరిశోధకుల అంచనా. త్రాగు నీటి ద్వారా సంక్రమించే ఈ అంటువ్యాధి అభివృద్ధి చేందిన దేశాల్లో పూర్తిగా నిర్మూలించబడినప్పటికీ తృతీయ ప్రపంచ దేశాల్లో ఇంకా వెంటాడుతూనే ఉన్నది.
* అమెరికన్ పోలియో(1916): న్యూయార్క్ లోని రాక్ పెల్లర్ ఇన్ స్టిట్యూట్ నుండి పోలియో వైరస్ తప్పించుకొని ఉండవచ్చన్న అనుమానాలు నాడు వ్యక్తమయ్యాయి.
* ఇన్ఫ్లుఎంజా(విషపడిశము): 1918-1920: మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో ఈ అంటువ్యాధి ప్రబలింది. ఐరోపా, అమెరికా, పసిఫిక్ ప్రాంతాలలో వ్యాపించింది. స్పానిష్ ప్లూ గా కూడా పిలువబడే ఈ వైరస్ పుట్టుక ఎక్కడన్నది నిర్ధారించలేక పోయారు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు జనాభాకు సోకింది. కోటి డెబ్బయ్ లక్షల నుండి ఐదు కోట్ల మంది మరణించి ఉండవచ్చని భావించారు. పక్షి జాతుల నుండి ఈ వ్యాధి మనుషులకు సోకి ఉండవచ్చన్న అంచనాకు వచ్చారు. వ్యాధిగ్రస్తుల ఊపిరితిత్తుల కణాలను సేకరించి, జన్యుపరమైన పరీక్షలు నిర్వహించిన మీదట వచ్చిన ఫలితాలపై ఆధారపడి నిర్ధారణకు వచ్చారు. ఆ సూక్ష్మ క్రిములకు అడవి జలపాతాలు నిలయాలని పేర్కొన్నారు.
* 1920 దశకంలోనే పశ్చిమ ఆఫ్రికాలో హెచ్.ఐ.వి.(హూమన్ ఇమ్మునోడెఫిషియెన్సీ వైరస్) లక్షణాలను పోలిన వైరస్ గుర్తించబడిందని,1981 నాటికి హెచ్.ఐ.వి./ఎయిడ్స్(అక్వర్డ్ ఇమ్మూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్)గా ప్రపంచ మానవాళిని కబళించిందని వైరాలజిస్ట్స్ నిర్ధారించారు.
* హెచ్1ఎన్1 స్వైన్ ప్లూ(2009-10) మెక్సికోలో పుట్టి, విస్తరించింది.
* ఎబోలా వైరస్: 2013-16 పశ్చిమ ఆఫ్రికా, గుయానాలో పుట్టి ఉండవచ్చన్న భావన, కానీ, నేటికీ నిర్ధాణ జరగలేదు. గబ్బిలం నుండి మనిషికి సోకినట్లుగా భావించబడుతున్నది. తరువాత మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందింది. ఇటలీ, స్పెయిన్, యూ.కే., అమెరికా వరకు వ్యాపించింది. కాకపోతే ఇతర దేశాల్లో తక్కువ కేసులు నమోదైనాయి. మొత్తం 11,310 మరణాలు సంబవించినట్లు నిర్ధారించినా, అంతకంటే ఎక్కువగానే మరణాలు ఉండవచ్చని భావించబడుతున్నది.
* హెచ్2ఎన్2(ఏసియన్ ఫ్లూ): 1957-58 కాలంలో ప్రపంచ వ్యాపిత మహమ్మారిగా ప్రకటించబడింది. పది లక్షల మంది మరణించారని అంచనా. ఈ వైరస్ పుట్టుక చైనాలోని ఘీజోవ్. మొదటి కేసు ఫిబ్రవరి 1957లో నమోదయ్యిందని చెప్పబడుతున్నది.
* 1990 దశకం మధ్య భాగంలో “హెండ్రా వైరస్” గబ్బిలాల నుండి గుర్రాలకు, గుర్రాల నుండి మనుషులకు ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందింది. నిపహ్ వైరస్, సార్స్-కోవిడ్1, ఇప్పుడు సార్స్ – కోవిడ్2 కూడా గబ్బిలాలే నిలయాలని భావించబడుతున్నది.
* 1994 నుండి చాలా అంటువ్యాధులు హాంగ్ కాంగ్, వియత్నాం, థాయిలెండ్, కెనడా, అమెరికా తదితర ప్రాంతాల నుండి ఆకస్మికంగా పౌల్ట్రీ ఫారమ్స్ నుండి వ్యాపించాయని చెబుతున్నారు.
13. కరోనా వైరస్ కుటుంబంలో “నోవల్ కరోనా వైరస్ -2019” తాజాగా ప్రబలిన ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి. మానవాళిని వణికిస్తున్నది. 2019 డిసెంబరు ప్రధమార్థంలో చైనాలోని వూహాన్ నగరంలో వ్యాధి లక్షణాలున్న మొదటి కేసును పసిగట్టారు. అదే రకమైన వ్యాధి లక్షణాలున్న మరికొన్ని కేసులు నమోదు కావడంతో చైనా ప్రజారోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు.హెచ్.ఓ.) దృష్టికి డిసెంబరు 31న తీసుకెళ్ళింది.
14. ప్రపంచీకరణ ప్రక్రియతో విదేశీ వాణిజ్యం, వ్యాపారం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విద్య, ఉపాథి మరియు పర్యాటక రంగాలు బాగా అభివృద్ధి చెంది దేశాల మధ్య ప్రజల రాక పోకలు బాగా పెరిగాయి. పరస్పరం ఆధారపడి జీవించే వ్యవస్థ నెలకొన్నది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు సంబవించాయి. ప్రయాణ సమయం బాగా తగ్గిపోయింది. నాడు ఓడల ద్వారా ముడిసరుకులు, వ్యవసాయ – కుటీర పరిశ్రమల ఉత్ఫత్తులను రవాణా చేసే వారు. ప్రజలకు నౌకాయానం తప్ప మరొక మార్గం లేదు. అందువల్ల సూక్ష్మ క్రిముల ద్వారా సంక్రమించే అంటువ్యాధుల వ్యాప్తికి చాలా సమయం పట్టేది. నేడు త్వరితగతిన ప్రపంచ వ్యాపితంగా విస్తరిస్తున్నాయి.
15. ప్రపంచంలో చైనా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచ స్థూల ఉత్ఫత్తిలో 16.7% వాటా ఉన్న దేశం. 140 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉన్నది. ఒక ప్రత్యేకమైన అభివృద్ధి నమూనాలో పెరిగి, పెద్దదైన దేశం. ప్రపంచ దేశాలతో చైనాకు వాణిజ్య, వ్యాపార, దౌత్య సంబంధాలు బలపడ్డాయి. చైనా సామాజిక – ఆర్థిక – రాజకీయ వ్యవస్థ పట్ల భావజాల రీత్యా భిన్న దృక్పథాలతో ఆలోచిస్తూ, ఎవరి నిర్ధారణలకు వారు వస్తూ, ఆ వ్యవస్థపై వ్యాఖ్యానాలు, విమర్శలు చేయడం సహజమే.
16. 1946లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకొన్న సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ఆటం బాంబులు వేసి మారణహోమానికి పాల్పడింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా చేసిన, చేస్తున్న ఆగడాల చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. చైనాతో వాణిజ్యపరమైన, టెక్నాలజీకి సంబంధించి, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా సైనిక స్థావరం, ఇలా పలు అంశాలపై అమెరికా ఆధిపత్య రాజకీయాలు పథకం ప్రకారం అమలు చేస్తున్నది. కరోనా మహమ్మారిని కూడా ఆయుధంగా వాడుకోవాలని ట్రంప్ దురాలోచన చేస్తున్నట్లు కనబడుతున్నది.
17. “నావెల్ కరోనా వైరస్” మూలాలెక్కడో తేలాల్సిందే! అంటువ్యాధుల మహమ్మారి ప్రకోపించిన ప్రతి సందర్భంలో ఆ సూక్ష్మ క్రిమి(వైరస్) ఎక్కడి నుండి వ్యాప్తి చెందింది! మూలాలెక్కడన్న మీమాంశ ఎప్పుడూ ఉండనే ఉంది. జంతువు నుండి మనిషికి వ్యాపించు వ్యాధి(జూనోటిక్) కాదని జీవాయుధ పరిశోధన సంస్థ(బయొలాజికల్ ఆర్మ్స్ రీసర్చ్ లాబ్) నుండి తప్పించుకొన్న “వైరస్” ఈ “నావెల్ కరోనా వైరస్” అంటూ లేవదీసిన వివాదంపై వైరాలజిస్ట్స్ యుద్ధ ప్రాతిపదికపై పరిశోధనలు చేసి నిజ నిర్ధారణ చేసినప్పుడే అనుమానాలు నివృత్తి చేయబడతాయి.
18. 1990లో కా.డి.రాజా(ప్రస్తుతం సిపిఐ, ప్రధాన కార్యదర్శి, నాడు ఎ.ఐ.వై.ఎఫ్. ప్రధాన కార్యదర్శి) కా.పల్లబ్ సేన్ గుప్తా(ప్రస్తుతం సిపిఐ, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు, నాడు ఐ.యు.యస్., ఉపాధ్యక్షులు), నేను (నాడు ఎ.ఐ.ఎస్.ఎఫ్. ప్రధాన కార్యదర్శి) ముగ్గరితో కూడిన ఎ.ఐ.ఎస్.ఎఫ్. & ఎ.ఐ.వై.ఎఫ్. ప్రతినిథివర్గంగా చైనా పర్యటనకు వెళ్ళాం. ఆ సందర్భంలో చైనా రాజధాని బీజింగ్ మహానగరంలో ఒక పెద్ద సముద్ర ఆహార మార్కెట్(సీపుడ్ మార్కెట్) ను సందర్శించాం. సీపుడ్ లో ఎన్ని రకాలున్నాయో చూసినప్పుడు, పేర్లు విన్నప్పుడు ఆశ్చర్య పోయాను. సీపుడ్ మార్కెట్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన అనుభవం నాకున్నది.
19. వూహాన్ సీపుడ్ హోల్ సేల్ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటున్నారు. కరోనా వైరస్ వూహాన్ లోని తడి మార్కెట్ లో పుట్టిందని చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో క్రిములపై పరిశోధనలు చేస్తున్న వైద్య నిపుణులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర విచారణ జరిపి, నిజాన్ని నిగ్గుతేల్చి, ప్రపంచ ప్రజానీకంలో విశ్వాసాన్ని పాదుకొల్పాలి.
20. ముగింపులో ఒక్క మాట. మనుషులకు, సూక్ష్మ జీవులకు మధ్య విడదీయలేని భాందవ్యం ఉన్నది. సూక్ష్మ జీవులు ఏకకణ జీవులు. సూక్ష్మ జీవులన్నీ మనుషులకు హానికరమైనవి కావు. నిజానికి మానవ శరీరం లోపల, బయట ఉన్న కోటాను కోట్ల సూక్ష్మ జీవులు లేకపోతే మనిషి జీవించలేడు. మనిషి జీవితాన్ని సులభతరం చేసేది సూక్ష్మ జీవులే. పర్యావరణ పరిరక్షణలోను కీలక పాత్ర పోషిస్తాయి. పదార్థాలను కుళ్ళిపోయేలా చేసి శిథిలం చేస్తాయి. మనిషి జీర్ణకోశం(చిన్న ప్రేగులు), పెద్ద ప్రేగుల్లో కోటాను కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, విటమిన్ల తయారీకి, ఇథనాల్, ఎంజైమ్స్, వ్యాధి నిరోధక శక్తిని, టీకాలను వగైరా ఔషదాలను మన శరీరంలోనే ఉత్ఫత్తి చేస్తాయి. మిథేన్, బయోగ్యాస్, విషపూరిత వ్యర్థాలను విసర్జింప చేయడం, మొక్క తెగుళ్ళను చంపివేయడం, సాధారణ జన్యువులను మానవ జన్యువులుగా మారుస్తాయి. సూక్ష్మ జీవులే లేకపోతే మానవ మనుగడే లేదు. మనుషుల్లో మంచి వారు, చెడ్డ వారు ఉన్నట్లే సూక్ష్మ జీవుల్లో కూడా మనిషికి మేలు చేసేవి, కీడు చేసేవి ఉన్నాయి.

(టి.లక్ష్మీనారాయణ,సామాజిక,ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్)